CM Revanth Reddy | మూసీ ప్రక్షాళన తథ్యం… బఫర్ జోన్‌లో కూల్చివేతలు తప్పవు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం మీడియాతో చిట్ చాట్ చేశారు. అనేక అంశాలపై సమాధానాలు చెప్పారు. మూసీ ప్రక్షాళన తథ్యమని, బఫర్ జోన్ లో కూల్చివేతలు ఆగబోవని స్పష్టం చేశారు. పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • By: TAAZ |    telangana |    Published on : Mar 20, 2026 8:58 PM IST
CM Revanth Reddy | మూసీ ప్రక్షాళన తథ్యం… బఫర్ జోన్‌లో కూల్చివేతలు తప్పవు
  • నష్టపోయిన వారిని ఆదుకుంటాం
  • రేషన్‌కార్డు ఉన్న అందరికీ ఇందిరమ్మ జీవిత బీమా
  • కేసీఆర్ అప్పుల్లో రూ.3.30 లక్షల కోట్లు తీర్చాం
  • ట్యాపింగ్ కేసులో హరీశ్ కు ఊరట దక్కలేదు
  • కేసీఆర్‌ను నిర్భంధించారని ఫిర్యాదు చేస్తే స్పందిస్తా
  • నియోజకవర్గాల పునర్విభజన తరువాతే జిల్లాల విభజన
  • ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ పై బీజేపీ మౌనం
  • 2034 వరకు సీఎం ఎవరంటే
  • మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్:
CM Revanth Reddy | ‘హైదరాబాద్ మహా నగరంలో మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం ఆగదు. ప్రక్షాళన మినహా మరో మార్గం లేదు. ఈ క్రమంలో నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గండిపేట జలాశయం నుంచి లంగర్ హౌస్ వరకు ఉన్న నాలాకు ఇరువైపులా వంద మీటర్ల చొప్పున బఫర్ జోన్ ఉందని సీఎం చెప్పారు. కిలోమీటర్ వరకు బఫర్ జోన్ ఉండదని, నమస్తే తెలంగాణ దినపత్రిక అలా ప్రచారం చేయడం వారి అవివేకమని దుయ్యబట్టారు. చట్ట పరిధిలోనే మూసీ ప్రక్షాళన కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందిస్తున్నామని తెలిపారు. డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం లభిస్తేనే ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేస్తాయని చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. తాము ప్రజలకు జవాబుదారిగా ఉంటామని సీఎం తేల్చి చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ, కౌన్సిల్‌లో రాష్ట్ర బడ్జెట్ 2026–27 ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో సుదీర్ఘంగా చిట్ చాట్ చేశారు. మూసీ ప్రక్షాళన విషయంలో కేంద్రాన్ని ఒప్పించామని, డిపీఆర్ తయారు చేసి కేంద్ర ఆమోదం కూడా పంపిస్తామన్నారు. డీపీఆర్ కు ఆమోదం లభిస్తే రుణం కూడా లభిస్తుందని తెలిపారు. మూసీ ప్రక్షాళన, గాంధీ విగ్రహం ఏర్పాటు పై ఆయన మనవడు బలం లేని వాదన చేస్తున్నారని రేవంత్ రెడ్డి కొట్టి పారేశారు. తనను జాతిపితగా పిలవొద్దని గాంధీ చెప్పారని, అయినా ప్రజలు జాతిపితగానే గౌరవిస్తున్నారన్నారు.

రేషన్‌కార్డు ఉన్న అందరికీ ఇందిరమ్మ జీవిత బీమా

రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ ఇందిరమ్మ జీవిత బీమా పథకం దేశంలోనే తొలిసారి అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల జీవిత బీమా భరోసా ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత స్వయం సహాయక సంఘాలకు రూ.57వేల కోట్ల రుణాలు ఇప్పించామని, సక్రమంగా కిస్తీలు చెల్లించిన వారికి, పావలా వడ్డీ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ఈ విషయంలో మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు తలాతోక లేకుండా విమర్శలు చేస్తున్నారని, మంత్రి ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని ఆక్షేపించారు.

విద్యా కమిషన్ నివేదికపై కమిటీ వేశాం

జాతీయ స్థాయిలో విద్యా విధానంలో వచ్చే మార్పులకు అనుగుణంగా తెలంగాణ విద్యా విధానం మార్చేందుకు వీలుగా పలువురు విద్యావేత్తలతో కమిషన్ వేయగా నివేదిక సమర్పించిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నివేదికను అధ్యయనం చేసేందుకు, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రభుత్వ సలహాదారుల కే కేశవరావు నాయకత్వంలో కమిటీ వేశామని, కమిటీ సూచనలు పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం విధానం రూపొందిస్తుందని వివరించారు. ఇది సంక్షేమ, అభివృద్ధి సమ్మిళిత బడ్జెట్ అని కితాబునిచ్చారు.

జీఎస్టీ, మైనింగ్‌లో పెరిగిన ఆదాయం

జీఎస్టీ, మైనింగ్ పన్నుల విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని, దీంతో ఆదాయం కూడా తక్కువగా వస్తున్నదని వివరించారు. ఈ రెండు విభాగాలలో లీకేజీలను సరిచేయడం మూలంగా రెండు మూడు నెలలుగా ఆదాయం పెరిగిందని, ఒక్క మైనింగ్ విభాగంలోనే 16 శాతం ఆదాయం పెరిగిందన్నారు. ప్రజల కోణంలో ఆలోచించి ఇలాంటి లీకేజీలను సరిచేస్తున్నామని, తెలంగాణ జీడీపీ ఇండియా జీడీపి కన్నా ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇంకా రెండు బడ్జెట్ లను తమ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని, అసెంబ్లీ పొడిగిస్తే మరో బడ్జెట్ కూడా తమ ప్రభుత్వమే ప్రవేశపెడుతుందని, బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మవద్దని అన్నారు. ఆరు గ్యారెంటీల అమలు గురించి తమకు ప్రణాళికలు ఉన్నాయని, హరీశ్ రావు మాటలకు స్పందించాల్సిన అవసరమే లేదన్నారు.

కేసీఆర్ అప్పుల్లో రూ.3.30 లక్షల కోట్లు తీర్చాం

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పుల్లో తమ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3.30 లక్షల కోట్లు తీర్చిందని రేవంత్ రెడ్డి వివరించారు. పాత అప్పులు తీర్చేందుకు తక్కువ వడ్డీతో రూ.3.47 కోట్లు వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకున్నామని, ఇందులో రూ.17వేల కోట్లు మాత్రమే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకున్నామని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అప్పుల మీద అప్పులు తెస్తున్నారని దుష్ర్పచారం చేస్తున్నారని, వాటిని మీడియా పెద్దగా చూపిస్తూ బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో తెచ్చిన అప్పులు ఎన్ని, తీర్చిన పాత అప్పులు ఎన్ని అనే విషయం కూడా తెలుసుకోకపోవడం విచారకరమన్నారు. తీసుకుంటున్న అప్పులు, తీరుస్తున్న అప్పులు వివరాలను రాష్ట్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసిందో ఒక్కనాడూ చెప్పలేదన్నారు. తమ ప్రభుత్వం ప్రతి విషయాన్ని ప్రజలముందు పెడుతున్నామని, వారి మాదిరి దాచడం లేదని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతో రెండున్నరేళ్లుగా ఒక్క చుక్కనీరు కూడా వాడుకోవడం లేదని, అయినప్పటికీ తమ ప్రభుత్వ హయాంలో రూ.44 వేల కోట్లు కాళేశ్వరం అప్పులకే చెల్లించామని తెలిపారు.

కుంభకోణాలపై కుమ్మక్కు కాలేదు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు కేసులో ప్రతిపక్ష బీఆర్ఎస్‌తో చేతులు కలిపారని, అందుకే విచారణ అనుకున్నంత వేగంగా జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా… రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ వార్తలు తాను కూడా వింటున్నానని, చట్ట పరిధిలో విచారణ జరుగుతోందని, దీనివల్ల సుదీర్ఘ సమయం తీసుకుంటుందన్నారు. ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావును విదేశాల నుంచి ఇండియాకు రప్పించడానికి 20 నెలల సమయం పట్టిందని గుర్తు చేశారు. ఈ కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని పాత్రను నిర్ధారించడం ఒక ఎత్తు కాగా, వారికి నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచి సమాచారం సేకరించడం మరో ఎత్తు అన్నారు. వారి స్టేట్ మెంట్ రికార్డు చేసుకుని నిర్థారణకు రావాల్సి ఉంటుందని, నిబంధనలు పాటించకుండా కేసును కొనసాగిస్తే వీగిపోతుందన్నారు. తమను విచారించకుండా నిందితులుగా చిత్రీకరిస్తున్నారని కోర్టుకు వెళ్తే కేసు కొట్టివేస్తారన్నారు.

ట్యాపింగ్ కేసులో హరీశ్ కు ఊరట దక్కలేదు

మాజీ మంత్రి టీ హరీశ్ రావు పై సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ పోలీసు స్టేషన్‌లో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, పోలీసులతో బలవంతపు వేధింపులకు గురి చేశారని ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తుండగా, దీన్ని సవాల్ చేస్తూ హరీశ్ రావు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ కేసుకు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధం లేదని, అయినా మీడియాలో హరీశ్ రావుకు ట్యాపింగ్ కేసులో ఊరట, క్లీన్ చిట్ అంటూ అడ్డదిడ్డంగా వార్తలు రాస్తున్నారని కొంత చిరాకు పడ్డారు. ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ జరుగుతోందని, ఈ కేసులో హరీశ్ రావుకు ఊరట లభించలేదన్నారు. గత ప్రభుత్వం ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మావోయిస్టుల పేరుతో చట్టవిరుద్ధంగా ప్రముఖుల కు చెందిన సుమారు ఆరు వేల ఫోన్లను ట్యాపింగ్ చేసిందని వివరించారు. తన ఫోన్లను, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని అంటున్నారు, సిట్ నోటీసులు ఇచ్చినప్పుడు ఆ విషయాన్ని వెల్లడిస్తానని అన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో తన ఫోన్ల ట్యాపింగ్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడ్డం సరికాదని స్పందించారు.

కేసీఆర్‌ను నిర్భంధించారని ఫిర్యాదు చేస్తే స్పందిస్తా

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఉంటున్నారని, కాని వాస్తవంగా గృహ నిర్భంధం అంటున్నారని ఒక మీడియా ప్రతినిధి ప్రస్తావించగా, నిర్బంధించారని ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే తప్పకుండా పరిశీలిస్తామని బదులిచ్చారు. కేసీఆర్ సభకు రాకుండా జీత భత్యాలు తీసుకుంటున్నారని సభలో వివరించారు కదా, ఏమైనా రికవరీ చేసే ఆలోచన ఉందా అని అడగ్గా, అలాంటి ఆలోచన లేదని, ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో సభలో వివరించడం జరిగిందన్నారు. గతంలో కేసీఆర్ సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి ప్రవర్తించారని, ఢిల్లీలో సీఎం లకు ప్రభుత్వం గెస్టు హౌస్ ఇస్తుందని, సమస్యల పరిష్కారం కోసం ఆ వసతిని సీఎంలు వినియోగించుకుంటారన్నారు. కేసీఆర్ కేంద్రం పెద్దలను కలిసి రాష్ట్రానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించకపోవడం మూలంగా చాలా నష్టపోయామని అన్నారు. తాను పైరవీల కోసం ఢిల్లీ వెళ్లడం లేదని, అందరి చుట్టూ తిరిగి రుణాలను తక్కువ వడ్డీతో రీ షెడ్యూల్ చేయించాని, పెండింగ్ పనులకు అనుమతులు తెచ్చుకున్నామన్నారు.

ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులు వస్తాయి

రాష్ట్ర గవర్నర్ కోటాలో మహ్మద్ అజారుద్దీన్, ఎం కోదండరామ్‌లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసే విషయంపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చిందని, దీనిపై మరోసారి గవర్నర్‌కు మంత్రి మండలి తీర్మానం చేసి పంపించాలని ఆదేశించిందన్నారు. గవర్నర్ మంత్రి మండలి తీర్మానం ఆమోదించని పక్షంలో హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటు సుప్రీంకోర్టు కల్పించిందని అన్నారు. అజారుద్దీన్ పదవీ కాలం వచ్చే నెలాఖరుకు ముగుస్తుందని, అప్పటికల్లా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అజారుద్దీన్ తో పాటు కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి వస్తుందని, ఒక్కరినే గవర్నర్ ఆమోదించరని, కనీస అవగాహన లేకుండా ప్రశ్న వేస్తున్నావంటూ ఒక మీడియా ప్రతినిధికి రేవంత్ రెడ్డి చురక అంటించారు.

హిల్ట్ పాలసీపై కేటీఆర్, హరీశ్ బురద రాజకీయం

హిల్ట్ పాలసీ పై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు బురద జల్లుతున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మొత్తం 9వేల ఎకరాల పారిశ్రామిక భూములు ఉండగా, అందులో నాలుగు వేల ఎకరాలు మాత్రమే భూవినియోగ మార్పిడి జరుగుతోందన్నారు. భూ వినియోగ మార్పిడి మూలంగా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తోందన్నారు. పారిశ్రామిక వినియోగం నుంచి మల్టీ జోన్ కు మార్చుతున్నామని తెలిపారు. ఒక్క ఎకరా భూమి రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటుందని, ఇందులో రూ.5 లక్షల కోట్ల అవినీతి ఎక్కడ ఉందో మీరే లెక్కలు చెప్పాలంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీరందరూ బీఆర్ఎస్ వాళ్లు అర్థపర్థం లేకుండా చెబుతున్న విషయాలను ప్రసారం చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకోవడం లేదని విసుక్కున్నారు. టీడీఆర్, హిల్ట్ పాలసీలపై బావ, బామ్మర్ది ముందుకు వచ్చి ఏ విచారణ కోరితే ఆ విచారణ చేయించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

జనగణన అధికారులది పసలేని వాదన

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విస్తరించి 300 డివిజన్లను ఏర్పాటు చేశామని, ఈ ప్రక్రియ డిసెంబర్ 31వ తేదీ 2025 నాటికే పూర్తి చేశామన్నారు. జన గణన అనేది మూడు వందల డివిజన్ల పరిధిలో జరుగుతుందని, విభజించిన మూడు కార్పొరేషన్ల వారీగా జరగదని ఆయన స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ల ఏర్పాటపై జన గణన అధికారులు పస లేకుండా మాట్లాడుతున్నారని ఆయన కొట్టి పారేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ లను రద్దు చేయడం అంత సులువు కాదని, రాజ్యాంగపరంగా లభించిన పదవులను రద్దు చేయడం పార్లమెంటులో సాధ్యమవుతుందన్నారు. ఆ ఆలోచన తమకు లేదని స్పష్టంగా వివరించారు.

నియోజకవర్గాల పునర్విభజన తరువాతే జిల్లాల విభజన

రాష్ట్రంలో జన గణన ప్రక్రియ మొదలైందని, పూర్తయిన తరువాత అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. జనాభా లెక్కలు తేలిన తరువాత రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారన్నారు. అప్పటి వరకు నియోజక వర్గాలు, జిల్లాలు, మండలాల సరిహద్దులు మార్చడానికి చట్టం అనుమతించదన్నారు. అందుకే జనాభా లెక్కలు పూర్తయినట్లు ప్రకటించిన తరువాతే తెలంగాణలో జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల పునర్విభజన, సర్ధుబాటు మొదలు పెడ్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దేందుకు రిటైర్డు హైకోర్టు జడ్జి నాయకత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి అసంబద్ద జిల్లాల పునర్విభజనను సరిదిద్దుతామని ఆయన ప్రకటించారు.

భూముల అమ్మకాలను వ్యతిరేకించలేదు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పీసీసీ అధ్యక్షుడిగా తను ప్రభుత్వ భూముల విక్రయాలను వ్యతిరేకించలేదని, వాటి ద్వారా సమకూరే సొమ్ములను ఆస్తులు సృష్టించేందుకు వినియోగించాలని డిమాండ్ చేశారన్నారు. గత ప్రభుత్వం మాదిరే తాము కూడా భూములు విక్రయిస్తున్నామని, ఆ సొమ్మును ప్రభుత్వ ఆస్తులు సృష్టించేందుకు వినియోగిస్తున్నామన్నారు. దావత్ లు చేసుకోవడానికి, పౌడర్లు, రంగులు వేసుకోవడానికి గత ప్రభుత్వం ఈ సొమ్మును వినియోగించిందన్నారు. ఇలా అడ్డదిడ్డంగా, ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకునేవాళ్లను ఊరు బయట వంగబెట్టి బడితె పూజ చేస్తారని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ పై బీజేపీ మౌనం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ పై బీజేపీ నేతలు నోరు మెదపడం లేదని, ఈ కేసులో బీఆర్ఎస్ నేతలు ఉండడం మూలంగానే మాట్లాడడం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు జీ.కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్.రామచందర్ దుర్ఘటనను ఖండించకపోవడం విడ్డూరమన్నారు. స్థానిక పోలీసులు ఫామ్ హౌస్ లోనికి వెళ్తే కాల్పులకు తెగబడ్డారని, అయినా పట్టింపులేదన్నారు. బీజేపీ నాయకులు సీబీఐ విచారణకు ఎందుకు అడగడం లేదనేది వీరిద్దరి మధ్యనున్న బంధాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో రుజువు అయ్యిందని, నేను బీఆర్ఎస్ ను విమర్శిస్తే బండి సంజయ్ స్పందించడం చూస్తుంటే బంధంగ ఎంత గట్టిగా ఉందో తేలిపోయిందన్నారు.

2034 వరకు సీఎం ఎవరంటే

ఈ మధ్య 2034 వరకు సీఎం నేనే అని మీరు ప్రకటించుకుంటున్నారు, దీనిపై మీ సహచర మంత్రులు కఠినంగా స్పందించకుండా ముసి ముసిగా నవ్వుతున్నారని అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఏం మాయ చేసి వారి బుట్టలో వేసుకున్నారని, కనీసం వ్యతిరేకించడం లేదని అడగ్గా… అందుకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. తమ పార్టీ నిర్ణయం మేరకు సీఎల్పీ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో సభా నాయకుడిని నిర్ణయిస్తారని, అందువల్లే తను సీఎం అయ్యానని చెప్పుకొచ్చారు. 2028 లేదా 2029 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటి సీట్లు దక్కించుకుంటుందని, ఆ తరువాత జరిగే సీఎల్పీ సమావేశంలో సభా నాయకుడిని ఎన్నిక చేస్తారని అన్నారు. అప్పటి వరకు వేచి ఉండాలని, కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం దే తుది నిర్ణయమని, ఎవరైనా పదవులు పొందవచ్చన్నారు. ఎవరైనా తమకు సీఎం పదవి కావాలని అడగవచ్చని, ఈ స్థాయిలో స్వేచ్ఛ ఉండడం మూలంగానే కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలుగా మనగలుగుతున్నదన్నారు. మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు బీ.మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మీనాక్షీ నటరాజన్ చర్చిస్తున్నారని అన్నారు. ఆపరేషన్ కగార్ ఈ నెలాఖరుకు ముగించాలని కేంద్ర ప్రభుత్వం గడువుగా పెట్టుకుందని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. జనజీవన స్రవంతిలోకి రావాలని, ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని మావోయిస్టులకు పిలుపునిస్తున్నామని, ఈ పిలుపుతో చాలామంది పెద్ద నాయకులు లొంగిపోతున్నారన్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతి ఆలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు ఎప్పుడు లొంగిపోతారనే విషయం తమ ప్రభుత్వ దృష్టికి రాలేదని, అలాంటి విషయం ఉంటే బహిరంగంగా ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.