Musi River Overflows | మూసీకి పోటెత్తిన వరద: హైదరాబాద్ లో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా మూసీ నది పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎంజీబీఎస్‌లో వరదనీరు చేరడంతో ప్రయాణీకులను తరలించారు.

హైదరాబాద్ లో మూసీ నదికి వరద పోటెత్తింది. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలు హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగాయి. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లోకి శుక్రవారం రాత్రి మూసీ వరద నీరు చేరింది.
దీంతో ఈ బస్టాండ్ లో ఉన్న ప్రయాణీకులను హైడ్రా, పోలీసులు, ఎస్ డీ ఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీసుకు వచ్చారు. ప్రయాణీకులు ఎవరూ కూడా ఎంజీబీఎస్ కు రావద్దని ఆర్టీసీ ఎంపీ వీసీ సజ్జనార్ సూచించారు. నల్గొండ వైపు వెళ్లే ప్రయాణీకులకు ఎల్ బీ నగర్ నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్లే ప్రయాణీకులు ఆరాంఘర్ , కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణీకులు జేబీఎస్ నుంచి వరంగల్ వైపు వెళ్లే ప్రయాణీకులు ఉప్పల్ నుంచి బస్సులు నడుస్తున్నాయి.
ఎంజీబీఎస్ కు ఎదురుగా ఉన్న సిటీ బస్సు స్టాప్ నుంచి ఆయా బస్టాప్ లకు వెళ్లే బస్సులను ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతోంది. ఎంజీబీఎస్ లోకి బస్సులను అనుమతించడం లేదు. భారీ వర్షాలతో మూసీ ఉగ్ర రూపం దాల్చింది. మూసీ పరివాహక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. పూరానాపూల్, మూసారాంబాగ్ పాత బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పురానాపూల్ వద్ద శివాలయం చుట్టూ వరద నీరు ప్రవహిస్తోంది. ఈ శివాలయంపైనే పూజారి కుటుంబం ఉంటుంది. హైడ్రా సిబ్బంది శనివారం ఉదయం టిఫిన్ అందించారు. ఈ కుటుంబాన్ని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్ లోని బాపూఘాట్ నుంచి ఉప్పల్ వరకు మూసీ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాలైన మూసా నగర్, రసూల్ పుర, శంకర్ నగర్, వినాయక వీధి, చాదర్ ఘాట్ లో పలు కాలనీలు నీట మునిగాయి. మలక్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆరు పునరావాస కేంద్రాలకు తరలించారు.
మూసారాంబాగ్ పాత బ్రిడ్జి వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంగా హైడ్రా సిబ్బంది తాడును కట్టారు. అయితే వరద నీటిలో ఐదు కార్లు, ఓ ట్రావెల్స్ బస్సును ఈ తాడు నిలిపివేసింది. ఇదే ప్రాంతంలో నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జి నిర్మాణ సామాగ్రి వరదలో కొట్టుకుపోయింది. అయితే కొత్త బ్రిడ్జికి ఎలాంటి నష్టం జరగలేదని జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటించారు.
అంబర్ పేట నుంచి మూసారాంబాగ్ వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గోల్నాక వైపు నుంచి వాహనాలను మళ్లించారు. శుక్రవారం రాత్రి చాదర్ ఘాట్ నుంచి మలక్ పేట టీవీ టవర్ వరకు వాహనాలు రోడ్డుపై గంటల పాటు నిలిచిపోయాయి. 30 ఏళ్ల తర్వాతే మూసీకి ఇంత పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.