Gandhi Hospital | హైదరాబాద్ : ఆ దంపతులకు వివాహమై 14 ఏళ్లు అవుతుంది. సంతానం కోసం అనేక ఆస్పత్రులను సందర్శించారు ఆ రైతు దంపతులు. లక్షల రూపాయాలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్ చికిత్స కూడా చేయించుకున్నారు. కానీ వారికి సంతానం కలగలేదు. చివరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్‌లో ఆ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన గవ్వల సతీశ్(36), గవ్వల నవీనకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. కానీ పిల్లలు పుట్టలేదు. ఈ క్రమంలోనే అనేక ఆస్పత్రులను సందర్శించారు. అధునాతన చికిత్సలను కూడా తీసుకున్నారు. ఐవీఎఫ్ చేయించుకున్నప్పటికీ మూడుసార్లు విఫలమయ్యారు.
చివరకు గాంధీ ఆస్పత్రిలోని ఐవీఎఫ్ సెంటర్‌ను సందర్శించారు. అప్పటికే ప్రయివేటు ఆస్పత్రుల్లో మూడుసార్లు ఐవీఎఫ్ చేయించుకుని విఫలమైన వారికి.. గాంధీ ఆస్పత్రిలో మాత్రం నాలుగో ఐవీఎఫ్ వారికి కలిసొచ్చింది. ఐవీఎఫ్ ద్వారా పండంటి ఆడబిడ్డకు రైతు దంపతులు జన్మనిచ్చారు. పసిబిడ్డ బరువు 3 కేజీలు అని వైద్యులు తెలిపారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. తమకు ఆడబిడ్డ జన్మించడంతో సతీశ్, నవీన దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
