ఆనాటి చత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌ను విచారించాలి
అనుమతిలిచ్చిన కేంద్ర సంస్థల అధికారులను పిలవాలి
రైతు రుణమాఫీతో ముడిపెట్టకుండా రైతుబంధు ఇవ్వాలి
లీక్‌లు తప్ప హామీల అమలు లేదని మండిపాటు
విధాత : చత్తీస్ గఢ్ విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలపైఏ విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నుంచి నాకు లేఖ అందిందని, వారం రోజుల్లో కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని లేఖ పంపించారని తెలంగాణ విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. లేఖలో విచారణకు హాజరైన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయవచ్చు అని కూడా చెప్పారని, అందరినీ విచారిస్తేనే కమీషన్ కు సమగ్ర సమాచారం వస్తుందని, తాను అందరిని విచారించాలని కోరుతానని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్తు కమిషన్‌కు నా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇస్తానని, కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులు బయటపెడుతానన్నారు. విచారణ కమిషన్ చత్తీస్‌గఢ్ ఆనాటి సీఎం రమణ్‌సింగ్ సహా ఆ రాష్ట్ర విద్యుత్తు అధికారుల నుంచి సమాచారం తీసుకోవాలని కోరుతానన్నారు. ఈఆర్సీపై ఎన్టీజీ స్టే ఇచ్చిందని, ఎన్టీజీటీని కూడా విచారణకు పిలుస్తారా అని, పర్యావరణ అనుమతులిచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులను కూడా ప్రశ్నిస్తారా అని, అందరిని విచారణకు పిలువకపోతే కమిషన్ విచారణ సమగ్ర విచారణ కిందకు రాదన్నారు. కమీషన్ చైర్మన్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడిన తర్వాత ఆరు వేల కోట్ల నష్టం జరిగినట్లు సమాచారాన్ని ప్రజలకు తెలిపారని, సమాచారాన్ని తెలిపిన వారిని కమీషన్ చైర్మన్ విచారణకు పిలవాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. కమీషన్ ఏర్పాటు చేసి లీకులు ఇస్తే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లేనని, మేము లేవనెత్తిన అంశాలపై కమిషన్ విచారణ చేయాలని, లేకుంటే కమీషన్ చైర్మన్ బాధ్యతగా తప్పుకోవాలని కోరుతానని స్పష్టం చేశారు.
లీకులు తప్ప హామీల అమలు లేదు
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో వారు ఇచ్చిన హామీల అమలు చేయకుండా బీఆరెస్ ప్రభుత్వం అక్రమాలు చేసిందంటూ లీక్‌లతో కాలం వెళ్లదీస్తుందని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీతో సంబంధం లేకుండా రైతుబంధును వెంటనే రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా 15వేలు ఇస్తామని చెప్పి ఇప్పడు కేబినెట్ సబ్ కమిటీ వేయడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. రైతులను మోసం చేసేందుకే సబ్ కమిటీ వేశారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు సాయాన్ని ఆపడానికి వీలులేదన్నారు. యాసంగిలో రైతులకు ఏ విధంగా రైతుబంధు ఇచ్చారో ఇప్పుడు అట్లాగే ఇవ్వాలని, బీఆరెస్ హయాంలో జూన్ నెలాఖరు లోగా రైతుల ఖాతాల్లో రైతు బంధు వచ్చేదన్నారు. మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం 4వేల పింఛన్‌పై మాట్లాడటం లేదని, విద్యుత్ బిల్లుల మాఫీ రాష్ట్రంలో అమలు కావడం లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని, పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని, వీధి కుక్కలు సైతం మహిళలపై దాడులు చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉందా లేదా అనేది అర్ధం కావడం లేదని, రాష్ట్రంలో ఏ జిల్లాలోను శాంతిభద్రతలు బాగలేవన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫీయా నదులను తోడేస్తున్నారని, దారిదోపిడీ లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.