Donthi Madhava Reddy | మంత్రుల పర్యటనలో దొంతి మాధవరెడ్డి!

Donthi Madhava Reddy | విధాత, ప్రత్యేక ప్రతినిధి: ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రెండవ పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయన మంత్రుల పర్యటనకు దూరంగా ఉంటున్నారు. మంత్రులేందీ? ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలను కూడా ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో సీఎం రేవంత్, ఇతర మంత్రుల పర్యటనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయనే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. అందరిదీ ఒక లెక్క అయితే ఆయనది ఒక్కలెక్కని కాంగ్రెస్ పార్టీలోనే పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. అలాంటి మాధవరెడ్డి ములుగు జిల్లాలో మంత్రుల బృందం పర్యటించిన సందర్భంగా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. సోమవారం ములుగు జిల్లా దేవాదుల ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అందులో దొంతి మాధవరెడ్డి కూడా ఉన్నారు. దీని వెనుక మతలబు ఉందంటున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రులు, సీఎం పర్యటనకు దొంతి దూరంగా ఉండేందుకు పెద్ద కథే ఉంది. సూటిగా చెప్పాలంటే ఆయన ఈ పర్యటనలకు దూరంగా ఉంటుందే…రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అని చెప్పడం సబబుగా ఉంటోంది.
రేవంత్ యాత్ర జరుగనివ్వలేదు
గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గంలో వ్యక్తిగా దొంతి చెలామణి అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. అయినప్పటికీ దొంతి ఉత్తమ్ వర్గంలోనే కొనసాగుతున్నారు. పీసీసీ అధ్యక్షుడైనప్పటికీ ఒక దశలో రేవంత్ రెడ్డిని నల్లగొండలో అడుగుపెట్టనివ్వని విషయం తెలిసిందే. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గంపైన దొంతిదే ఆధిపత్యం సాగుతోంది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తన అనుచరురాలు ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగుజిల్లా మేడారం సమ్మక్క జాతర నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఆయన పాదయాత్ర ములుగు నుంచి నర్సంపేట మీదుగా మహబూబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఆ సమయంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ములుగు జిల్లాలో యాత్ర ముగించుకుని నర్సంపేటలో ప్రవేశించాల్సి ఉండగా రేవంత్ పర్యటనకు దొంతి మాధవరెడ్డి దూరంగా ఉన్నారు. అసలు ఆయన గురించే పట్టించుకోలేదు. ప్రచారానికి దూరంగా ఉండడమే కాకుండా పార్టీ శ్రేణులను పాల్గొనకుండా దూరం పెట్టారు. ఈ దశలో వివాదాన్ని పెద్దది చేసుకోవడమెందుకని రేవంత్ రెడ్డి ములుగు నుంచి సరాసరి మహబూబాద్ జిల్లాలో యాత్ర కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ పాల్గొనలేదు. తనకున్న ఛానల్ ద్వారా టికెట్ తెచ్చుకుని ఎన్నికల్లో పోటీచేసిన మాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ సీఎం అయ్యారు. అయినా దొంతి పెద్దగా ఆయన వద్దకు వెళ్ళింది లేదు. సీఎం వరంగల్ పర్యటనలే కాకుండా తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ మంత్రి పర్యటించలేదని చెప్పవచ్చు. అలాంటి దొంతి సోమవారం పర్యటనలో పాల్గొనడంతో కాంగ్రెస్ వర్గాల్లో చర్చసాగుతోంది. తన వర్గం నేతగా ఉన్న ఉత్తమ్ ప్రస్తుతం నీటిపారుదల శాఖ హోదాలో ఈ పర్యటనకు వచ్చినందున దొంతి హాజరయ్యారని అంటున్నారు. దీంతో పాటు దేవాదుల నీరు తన నియోజకవర్గంలోని పాఖాల చెరువులోకి వస్తున్నందున సమస్య తమకు సంబంధించినది కావడంతో హాజరయ్యారని చెబుతున్నారు. ఇదిలాఉండగా మాధవరెడ్డి మనసు మార్చుకుని మంత్రుల పర్యటనల్లో పాల్గొనాలని భావిస్తున్నాడా? అనే చర్చ సాగుతోంది.