Employees New health scheme । తెలంగాణ ఉద్యోగులకు ఊరట.. కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీం ప్రతిపాదనలు రూపొందించిన ఉద్యోగ జేఏసీ
చికిత్స కోసం అప్పులు తెచ్చి ఆసుపత్రుల్లో ఖర్చు చేసిన తర్వాత మళ్లీ ఆ డబ్బులను ప్రభుత్వం నుంచి తిరిగి పొందేందుకు (రీయింబర్స్‌మెంట్) ఏడాది నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతున్నది. అప్పటివరకు ఉద్యోగులపై వడ్డీ భారం తప్పడం లేదు. దీనికి తెలంగాణ ఉద్యోగ జేఏసీ చక్కటి పరిష్కారం వెతికింది.

- ఉద్యోగులకు వరం.. ప్రభుత్వానికీ భారం ఉండదు
- రూపొందించిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
- వైద్య శాఖ మంత్రికి సమర్పించిన చైర్మన్ వీ లచ్చిరెడ్డి
- ఆపద సమయంలో ఉద్యోగులపై ఆర్థిక భారం లేకుండా చర్యలు
- అపరిమిత నగదు రహిత సేవలతో ఈహెచ్ఎస్ అమలు
- ప్రభుత్వ ఆమోదంతో తొలగిపోనున్న రీయింబర్స్‌మెంట్ ఇబ్బందులు
Employee health scheme । తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబీకుల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS)ను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (JAC of Telangana Employees) కోరింది. ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నూతన ఈహెచ్ఎస్ విధానం అమలు కోసం ఒక ముసాయిదా(draft)ను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి, పలువురు జేఏసీ నాయకులు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Rajanarsimha)కు బుధవారం అందజేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న హెల్త్ స్కీంలో లోటు పాట్లు, కొత్తగా ప్రతిపాదించిన హెల్త్ స్కీంతో ఉద్యోగులకు, వారి కుటుంబాలకు కలిగే ప్రయోజనాలు(benefits of the newly proposed health scheme), తద్వారా ప్రభుత్వానికి వచ్చే పేరు గురించి మంత్రికి ఈ సందర్భంగా లచ్చిరెడ్డి (Lacchi Reddy) వివరించారు. కొత్త ప్రతిపాదనలతో ప్రభుత్వానికి భారం పడకుండా, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందే వైద్య సేవల గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోతో ఉద్యోగులు పడుతున్న కష్టనష్టాల గురించి కూడా మంత్రికి లచ్చిరెడ్డి ఈ సందర్భంగా వివరించారు. వెంటనే జీవో 317ను రద్దుచేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు.
ఇప్పటివరకు ఉన్న విధానం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబీకులకు నగదు రహిత వైద్య చికిత్స (cashless medical treatment) అందించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (Employees Health Scheme) (ఈహెచ్ఎస్)ను ప్రారంభించాలని అనుకుంది. అప్పటివరకు ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ (reimbursement system) విధానానికి ప్రత్యామ్నాయంగా దీనిని ఉద్దేశించింది. ఇందుకు ఉద్యోగుల నుంచి నెలకు రూ.90, రూ.120 చొప్పున కంట్రిబ్యూషన్‌గా తీసుకోవాలని నిర్ణయించింది. కానీ, ఈ విధానం అమలులోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల నుంచి ఎలాంటి కంట్రిబ్యూషన్ లేకుండానే నగదురహిత వైద్య సేవలు అందించేలా ఈహెచ్ఎస్ అమలు చేసేలా రెండుసార్లు జీవోలు వచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో ఇప్పటికీ మెడికల్ రీయింబర్స్‌మెంట్ (reimbursement system) విధానమే కొనసాగుతున్నది.
ప్రస్తుతం ఉన్న విధానంతో సమస్యలు
ప్రస్తుత మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం వల్ల ఆపద సమయంలో ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు (severe difficulties) ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో ముందుగా ప్రభుత్వం పేర్కొన్న రిఫరెల్ హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. చికిత్స కోసం ఉద్యోగులు ముందుగా హస్పిటళ్లలో డబ్బు కట్టాల్సి వచ్చేది. అందుబాటులో సొమ్ము లేనివాళ్లు అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇంటికి పెద్ద అయిన ఉద్యోగే ఆసుపత్రిలో చేరితే చికిత్స కోసం డబ్బులు సర్దుబాటు చేసేందుకు కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా రీయింబర్స్‌మెంట్ విధానాన్ని రూ.2 లక్షలకే పరిమితం (ceiling) చేశారు. చికిత్సకు అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే రిలాక్సేషన్ పొందేందుకు స్టాండింగ్ కమిటీ(Standing Committee)ని ఆశ్రయించాల్సి వస్తుంది. చికిత్స కోసం అప్పులు తెచ్చి ఆసుపత్రుల్లో ఖర్చు చేసిన తర్వాత మళ్లీ ఆ డబ్బులను ప్రభుత్వం నుంచి తిరిగి పొందేందుకు (రీయింబర్స్‌మెంట్) ఏడాది నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతున్నది. అప్పటివరకు ఉద్యోగులపై వడ్డీ భారం తప్పడం లేదు.
పీఆర్సీ 2018లో చేసిన సిఫార్సు
మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానంలో ఈ ఇబ్బందుల నేపథ్యంలో ఈహెచ్ఎస్ అమలు కోసం 2018 పీఆర్సీ (PRC) ఒక ప్రతిపాదన చేసింది. ఈహెచ్ఎస్ కోసం ఉద్యోగుల, పెన్షనర్ల బేసిక్ పే నుంచి ఒక శాతాన్ని వసూలు చేయాలని సూచించింది. అయితే, కొన్ని ఉద్యోగ సంఘాలు, కొందరు ఉద్యోగులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అధిక వేతనం ఉన్న వారి నుంచి 1 శాతం వసూలు చేయడం చాలా ఎక్కువ అని కొందరు అన్నారు. కుటుంబసభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. అదనపు వైద్య సేవలు, సదుపాయాలు ఉండాలని ఇంకొందరు తెలిపారు.
తెలంగాణ ఉద్యోగుల ఐకాస ప్రతిపాదన
ఈ అన్ని అంశాలతోపాటు ఉద్యోగులు (employees), పెన్షనర్లు(pensioners), వారి కుటుంబసభ్యులు (family members) ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) కోసం తెలంగాణ ఉద్యోగుల ఐకాస ఒక కొత్త విధానానికి (a new policy for the Employees Health Scheme) రూపకల్పన చేసింది. పలు ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులతో చర్చించి దీనిని రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది.
- ప్రతిపాదనలోని కీలక అంశాలు
- తెలంగాణలో ప్రస్తుతం 3,06,000 ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 2,88,415 పెన్షనర్లు ఉన్నారు.
- ప్రభుత్వం ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం ప్రస్తుతం దాదాపు నెలకు రూ.40 కోట్ల మేర ఖర్చు చేస్తున్నది.
- నూతన ఈహెచ్ఎస్‌లో ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వం ఎంపానెల్ చేసిన ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి నగదురహిత వైద్యం అందించాలి.
- వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుపై ఎలాంటి పరిమితి(సీలింగ్) విధించవద్దు.
- అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, సొసైటీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ విధానం అమలు చేయాలి.
- ప్రధాన కార్డుదారు సహా ఆరుగురు కుటుంబసభ్యులకు ఈహెచ్ఎస్ సదుపాయం కల్పించాలి.
- ఈహెచ్ఎస్ కోసం మొత్తం ఎంత ఖర్చు అవుతుందో ఈహెచ్ఎస్ లేదా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఏహెచ్‌సీటీ) ఖరారు చేయాలి.
- ఈ మొత్తంలో 50 శాతం ప్రభుత్వం భరించాలి. మిగతా 50 శాతం ఉద్యోగులు, పింఛనర్ల నుంచి తీసుకోవాలి.
- ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చెల్లించే మొత్తం వారి పే స్లిప్ లేదా పింఛన్ స్లిప్‌లో ‘డిడక్షన్స్’గా నమోదు కావాలి. అలాగే, ప్రభుత్వం చెల్లించే మొత్తం కూడా ‘ఎర్నింగ్స్’లో నమోదు చేయాలి.
- సంబంధిత డీడీవో లేదా పీఆర్వో ఈ మొత్తాన్ని ప్రతినెల ఈహెచ్ఎస్ ఖాతాలో జమ చేయాలి.
- సమాన చెల్లింపు, సమాన సదుపాయాలు అనే పద్ధతి ఆధారంగా ఈ విధానం పని చేస్తుంది. ఎవరైన ఉద్యోగికి అదనపు, ప్రత్యేక వైద్య సేవలు, సదుపాయాలు కావాలని అనుకుంటే వారి వాటాకు అదనంగా చెల్లించాలి.
- ప్యాకేజ్‌లు, చికిత్సలకు అయ్యే ధరలను ఆసుపత్రులకు చెందిన సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలతో ఈహెచ్ఎస్ చర్చించి ఖరారు చేయాలి.
- ప్రభుత్వం ఆమోదించిన అన్ని ఎన్‌పానెల్డ్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్య పరీక్షలు మొదలుకొని మందుల వరకు ఇన్-పేషెంట్, ఔట్-పేషెంట్ సేవలను పూర్తి నగదురహితంగా అందించాలి.
- రాష్ట్రం బయట చికిత్స పొందేందుకు ముందుగా ఈహెచ్ఎస్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన, అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడిన స్టీరింగ్ కమిటీ ఈహెచ్ఎస్ అమలును పర్యవేక్షించాలి.
- లబ్ధిదారులు అందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
- ఆసుపత్రుల సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలతో సంప్రదింపులు జరిపి ఈ విధానం అమలు కోసం మార్గదర్శకాలను వైద్య శాఖ జారీ చేయాలి.
- కొత్త విధానం అమలులోకి వచ్చిన నాటి నుంచి ఏడాది వరకు ప్రస్తుత మెడికల్ రీయింబర్స్ మెంట్ విధానం కూడా అమలులో ఉండాలి. ఆరు నెలల తర్వాత రెండు విధానాల అమలును స్టీరింగ్ కమిటీ సమీక్ష జరపాలి.
ఈ కార్యక్రమంలో TGE JAC నాయకులు డా.నిర్మల, కె.రామకృష్ణ, డా.కత్తి జనార్దన్, దర్శన్ గౌడ్, ఎస్.రాములు, డా.వంశీకృష్ణ, దశరథ్, జయమ్మ, రమేష్ పాక, రామ్ ప్రతాప్ సింగ్, గోవర్ధన్. పాండు, దీపక్, తదితరులు పాల్గొన్నారు.