Marwari Go Back | నో టాక్స్ నో జిఎస్టి ..తెలంగాణలో మార్వాడీ దో నంబర్ దందా!
ముత్యాల షాపులు వాళ్లవే! నగల షాపులు వాళ్లవే! డ్రై ఫ్రూట్స్‌లో వాళ్లే.. ఎలక్ట్రికల్‌లో వాళ్లే.. వస్త్ర దుకాణాల్లో వాళ్లే! కిరాణా సరేసరి.. ప్లాస్టిక్, స్వీట్స్ వాళ్లవేమరి! ఒక్క బీఫ్, మటన్, చికెన్ వ్యాపారాలు తప్పించి.. అంతా మార్వాడీ మయం!

- మోదీ ఆన్‌లైన్ వీరికి పట్టదు! 99% షాపుల్లో క్యాష్ బిల్లింగ్
- గోకుల్ ఛాట్‌లోనూ పైసలే..ఒక్కో ఏరియాలో ఒక్కో దందా
- మూలపడిన వాహనాల పేరిట నకిలీ వే చలాన్ల జారీలు
- తెలంగాణ ‘నగదు’ సర్దేస్తున్న మార్వాడీ వ్యాపారస్తులు
- రాష్ట్రాన్ని ఉద్ధరించేదేమీ లేదు వాపోతున్న స్థానిక వ్యాపారులు
ముత్యాల షాపులు వాళ్లవే! నగల షాపులు వాళ్లవే! డ్రై ఫ్రూట్స్‌లో వాళ్లే.. ఎలక్ట్రికల్‌లో వాళ్లే.. వస్త్ర దుకాణాల్లో వాళ్లే! కిరాణా సరేసరి.. ప్లాస్టిక్, స్వీట్స్ వాళ్లవేమరి! ఒక్క బీఫ్, మటన్, చికెన్ వ్యాపారాలు తప్పించి.. అంతా మార్వాడీ మయం! రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర వ్యాపారులు వెళ్లిపోవడం మరీ బాగా కలిసొచ్చింది. ఇప్పుడు ప్రతి వ్యాపారంలోనూ వాళ్లదే గుత్తాధిపత్యం! రిటైల్ వ్యాపారాలే కాదండోయ్.. హోల్‌సేల్‌కూడా! అందులోనూ పక్కా పైసల దందానే! బిల్లు అడిగితే.. ట్యాక్స్ పడుతుంది.. అంటూ ఎదురు మస్కా! అందుగలరిందులేదను సందేహము వలదు.. వెతకాల్సిన పనికూడా లేదు.. కనిపించే ప్రతిదాంట్లో మర్వాడీలే ఉందురు..! అని మార్చి చెప్పుకోవాల్సిన పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఒక్కో ఏరియాలో ఒక్కో రంగం వ్యాపారానికి హైదరాబాద్ ప్రసిద్ధి. ఆ ప్రతి ఏరియాలో కొనేది తెలంగాణవాడైతే.. అమ్మేది మాత్రం మార్వాడీయే!
హైదరాబాద్, ఆగస్ట్ 23 (విధాత): దేశంలో ఇప్పుడంటే జీఎస్టీ వచ్చింది కానీ.. ఇంతకు ముందు తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో సేల్స్ ట్యాక్స్ ఉండేది. జీఎస్టీ వచ్చి కూడా ఎనిమిదేళ్లు అవుతున్నది. సేల్స్ టాక్స్ ఉన్నప్పుడు మార్వాడీ వ్యాపారులు పన్నులు ఎగ్గొట్టడమే కాకుండా కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జీఎస్టీ అమల్లో ఉన్నా బిల్లులు ఇవ్వడం లేదు. నగదు చెలామణీని తగ్గించేలా ఆన్‌లైన్ విధానంలో చెల్లింపులకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అందరూ ఆన్‌లైన్‌లో చెల్లింపులు స్వీకరిస్తున్నారు.. ఒక్క మార్వాడీ వ్యాపారులు తప్ప. తమ దుకాణాలలో దో నంబర్ లేదా నాసిరకం సరుకులు విక్రయిస్తూ వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారనే ఆరోపణలు మార్కెట్‌లో బలంగానే వినిపిస్తుంటాయి. ఇన్ని మోసాలు పట్టపగలు చేస్తున్నా జీఎస్టీ అధికారులు పట్టించుకోవడం లేదని, తెలంగాణ ప్రభుత్వం అంతకన్నా పట్టించుకోకపోవడం వెనక ఉన్న లోగుట్టు ఏమిటో అర్థం కావడం లేదని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు.
ఇలా వచ్చారు..
నిజాం హయాంలో వాణిజ్య కార్యకలాపాల విస్తరణ కోసం ఉత్తరాది రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్ నుంచి వ్యాపారులను ఆహ్వానించి.. చార్మినార్, బేగం బజార్, ఉస్మాన్ గంజ్ వంటి ప్రాంతాల్లో దుకాణ సముదాయాలను కేటాయించారు. ఇలా వచ్చిన వారు మొదట్లో వస్త్ర, బంగారం, ముత్యాలు, డ్రై ఫ్రూట్స్ వ్యాపారాలను ప్రారంభించారు. ఆ తరువాత వచ్చిన వారు ఇతర రంగాలకు విస్తరించి పెద్ద ఎత్తున హోల్ సేల్ వ్యాపారాలు మొదలు పెట్టి.. నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత ఆంధ్రా ప్రాంత వ్యాపారులు ఇక్కడి నుంచి వెళ్లిపోవడం వీరికి బాగా కలిసి వచ్చింది. ఇక అప్పటి నుంచి రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి రాక బాగా పెరిగిందని, చెంబు, తాంబాళం, కంచం పట్టుకుని తెలంగాణలో వాలిపోతున్నారని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. 2014 వరకు వచ్చిన వారితో పోల్చితే ఆ తరువాత పది రెట్లు వచ్చారని అంచనా. గాడీ వెళ్లే ఊరుకు మార్వాడీ వెళతాడనే నానుడి ఊరికే రాలేదు. నగరం దాటి, పట్టణాలు దాటి.. గ్రామస్థాయి వరకు తమ వ్యాపారాలను విస్తరించుకున్నారు. ఇప్పటికీ ఓ మోస్తరు గ్రామాల్లో స్వీట్‌షాపు ఎవరిదంటే మార్వాడీదేననే సమాధానం వస్తుంది. అంతగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో పాతుకుపోయారని విశ్లేషకులు చెబుతున్నారు.
ముంబై సరుకు.. హైదరాబాద్‌లో దందా
ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీలో కంపెనీల నుంచి హైదరాబాద్‌కు సరుకు తీసుకువచ్చి, హోల్ సేల్ లో విక్రయిస్తున్నారు. హోల్ సేల్‌లో కొనుగోలు చేసి తిరిగి జిల్లా కేంద్రాలు, మండలాలు, గ్రామాలలో రిటైల్‌లో విక్రయిస్తున్నారు. ముంబై మొదలు గ్రామస్థాయి వరకు మార్వాడీలే ఉంటున్నారని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. తయారీ మొదలు చివరగా వినియోగదారుడికి విక్రయించే స్థాయి వరకు మార్వాడీలే ఉండటంతో ఏక్ నంబర్ సరుకు ఏదో.. దో నంబర్ సరుకు ఏదో వారికే స్పష్టంగా తెలుస్తుందని చెబుతున్నారు. ఈ పద్మవ్యూహంలోకి మార్వాడీలు మూడో వ్యక్తిని అనుమతించరని వారి వ్యాపారాలపై గట్టి అవగాహన ఉన్న ఒక స్థానిక వ్యాపారుల సంఘం నాయకుడొకరు చెప్పారు. ఒకవేళ అనుమతించినా సదరు వ్యాపారికి ఎక్కువ ధరకు సరకులు విక్రయిస్తుంటారని తెలిపారు. తమవాడు అయితే ఒక ధర, బయటివాడు అయితే మరో ధర అమల్లో ఉంటుందని చెబుతున్నారు.
తెలంగాణలో అన్నింట్లో వారే
తెలంగాణలో ఈ రంగం ఆ రంగం అనే తేడా లేకుండా అన్నింట్లోను మార్వాడీలను చూడవచ్చు. గొర్రె, పొట్టేలు మాంసం, బీఫ్ దుకాణాలు, వైన్ షాపులు, పంక్చర్ షాపులలోకి మాత్రం వీళ్లు ప్రవేశించ లేదు. మాంసం దుకాణాల్లోకి వీళ్లు అడుగు పెట్టకపోవడానికి ప్రధాన కారణం వీరు శాకాహారులు. మాంసం తీసుకునే వారిని అంటరానివారిగా, శత్రువులుగా చూస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో మద్యం తాగే, మాంసం తినేవారిని దూరంగా పెడతారని అంటుంటారు. ఒకప్పుడు కొన్ని రకాల వ్యాపారాలు, హోల్ సేల్ వ్యాపారాలకే పరిమితమైన మార్వాడీలు ఇప్పుడు ప్రతి రంగంలోకి ప్రవేశించారు. కిరాణా, హార్డ్ వేర్, సిమెంట్, శానిటరీ వేర్, ఐరన్ అండ్ స్టీల్, స్వీట్స్, ప్లాస్టిక్, ఎలక్ట్రికల్, రైస్ మిల్స్, వెజిటేరియన్ హోటళ్లు, ట్రాన్స్ పోర్టు ఇలా అన్ని వ్యాపారాల్లో హోల్ సేల్ నుంచి డీలర్, రిటేయిల్ వరకు విస్తరించి పాతుకుపోయారు.
ఒక్కో ఏరియాలో ఒక్కో సరుకు
హైదరాబాద్ నగరంలో ఒక్కో రకం వ్యాపారాలకు ఒక్కో ప్రాంతం ప్రసిద్ధి. సిద్ది అంబర్ బజార్‌లో బంగారం, కిరాణా, ముత్యాలగంజ్ పప్పులు, ఉప్పులు, ఉస్మాన్ గంజ్ కిరాణా సరుకులు, అల్లం, వెల్లుల్లి, ట్రాన్స్ పోర్టు, బేగంబజార్‌లో డ్రై ఫ్రూట్స్, కిరాణా, బర్తన్ బజార్‌లో వంట సామాన్లు, ఫీల్ ఖానాలో గాజులు, ముత్యాలు, ఆబిడ్స్, చార్మినార్ ప్రాంతాల్లో బంగారం, చార్మినార్ వద్ద ప్రత్యేకంగా వస్త్ర వ్యాపారం, ట్రూప్ బజార్‌లో ఎలక్ట్రికల్ గూడ్స్, కోఠిలో ఎలక్ట్రానిక్స్ షాపులు, సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో వస్త్ర వ్యాపారం, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ షాపులు, రాణిగంజ్‌లో ఎలక్ట్రికల్, జనరల్ బజార్‌లో వస్త్ర దుకాణాలు, మలక్ పేట మహబూబ్ మెన్షన్ మిర్చీ, పప్పులు, వంట నూనెలు, దినుసుల దుకాణాలు నడుపుతున్నారు. వీటికి అనుబంధంగా నగరంతో పాటు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామ స్థాయి వరకు అన్ని దుకాణాలను మార్వాడీలే నిర్వహిస్తున్నారు. అందులోనూ అక్రమాల పాళ్లు ఎక్కువేనని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక సరుకు ధర హోల్ సేల్ లో రూ.10 ఉంటే గ్రామ స్థాయికి వెళ్లే సరికి రూ.20కి పెంచి విక్రయాలు చేస్తారని అంటున్నారు. మార్వాడీలు కాకుండా తెలంగాణ వాళ్ళు ఈ సరుకును హోల్ సేల్ లో కొనుగోలు చేస్తే రూ.15కు విక్రయిస్తారని చెబుతున్నారు. దీన్ని గ్రామాల్లో రూ.20కి విక్రయిస్తే లాభం అంతగా ఉండదు. మార్వాడీకి రూ.10 లాభం వస్తే, తెలంగాణ వ్యాపారికి రూ.5 మాత్రమే మిగులుతాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
బిల్లు ఎందుకు.. ట్యాక్స్ కట్టాలి..
ఈ ప్రాంతాల్లో ఎక్కడకు వెళ్లి షాపింగ్ చేసినా బిల్లులు ఇవ్వరనే విమర్శలు ఉన్నాయి. ఒక వేళ బిల్లులు కావాలని అడిగితే అదనంగా ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందని చెబుతూ.. అనవసరంగా ట్యాక్స్ ఎందుకు చెల్లించాలంటూ మనకే హితవు పలుకుతారు. అదేదో మనకు లాభం చేసినట్టు! తెల్ల కాగితంపై రాజస్థానీ లేదా గుజరాతీ భాషలో సరుకుల పేర్లు, ధరలు రాసి కొనుగోలు దారుల చేతుల్లో పెడతారు. వేయి రూపాయల బిల్లు చేసినా పాతిక వేలు బిల్లు చేసినా ఇదే తెల్ల కాగితంపై బిల్లులు ఇస్తారు. ఉదాహరణకు బేగం బజార్‌లో డ్రై ఫ్రూట్స్ తక్కువ ధరకు వస్తాయని జనాలు పరుగెత్తుకుని వెళ్లి ఖరీదు చేస్తారు. చాలా వరకూ నగదు వ్యాపారమే. కానీ ఇక్కడ మూడో రకం తెచ్చి చౌక ధరకు విక్రయిస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. ‘పెళ్లిళ్లు, పేరంటాలు, విందు భోజనాలు, ఫంక్షన్లు నిర్వహించే వారు ఇక్కడికే వస్తుంటారు. బేగం బజార్‌లో చౌక ధరకు లభించాయని కొనుగోలు చేసిన మహిళలు, కుటుంబ సభ్యులు మహా సంబురపడుతారు. కానీ నాసిరకం, థర్డ్ గ్రేడ్ సరుకులు తీసుకున్నామనే విషయం తెలియదు. ఇదొక్కటనే కాదు ఏ వ్యాపారంలో అయినా నంబర్ వన్ లేదా క్వాలిటీ సరుకు వీరి వద్ద లభ్యం కాదు’ అని స్థానిక వ్యాపార సంఘం నాయకుడొకరు చెప్పారు. ఆహార కల్తీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, పౌర సరఫరాల అధికారులు, తూనికలు, కొలతల విభాగం, జీహెచ్ఎంసీ, పన్నుల అధికారులు తనిఖీలు నిర్వహించరని ఆయన అన్నారు. సంవత్సరానికి మూడు నాలుగు సార్లు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి మామూళ్లు జేబులో వేసుకుంటారనే విమర్శలు ఉన్నాయి. ఆన్ లైన్ విధానం అమలు చేయాలని ఏ దుకాణదారుడినీ ఒత్తిడి చేయరని చెబుతారు. ఆన్ లైన్ లేదా కార్డ్ పేమెంట్ విధానం అమలు చేస్తే ఆ డబ్బులు తమ ఖాతాలో వచ్చి చేరతాయి. వాటికి కచ్చితంగా లెక్కలు చూపించంతో పాటు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కోట్లలో పన్నులు చెల్లించే బదులు లక్షల్లో పన్నుల అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టచెబుతారనే విమర్శలు ఉన్నాయి.
ట్రాఫిక్, పోలీసులకు లక్షలే లక్షల ఆదాయం
ఈ ప్రాంతాల్లో పనిచేసే లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులకు ప్రతినెలా మామూళ్లు అందుతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ వాహనాలు ఆపకుండా ఉండడానికి, తనిఖీలు చేయకుండా ఉండడానికి ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులకు లక్షల రూపాయలు చెల్లిస్తుంటారని సమాచారం. ఎక్కువగా రాత్రి వేళల్లో ఇతర రాష్ట్రాల నుంచి సరుకులతో ఉన్న లారీలు, వ్యాన్లు వస్తుంటాయి. తెల్లవారే సరికల్లా మొత్తం దిగిపోతాయి. ఈ ప్రాంతాల్లో ఏసీపీ, సీఐ పోస్టులకు డిమాండ్ అధికంగా ఉంటుంది. సంబంధిత ఎమ్మెల్యేకు నెలవారీ ముట్టచెబితే తప్ప పోస్టింగ్ లభించడం కష్టమనే వాదనలు ఉన్నాయి. దీంతో దో నెంబర్, తీన్ నెంబర్ సరకులు వరదలా చేరిపోవడం, విక్రయించడం కూడా జరిగిపోతుందని సమాచారం.
ఇదో కొత్త దోపిడీ, రివర్స్ ట్యాక్స్
గత నెల ఎంఎస్ కీషాన్ ఇండస్ట్రీస్ ఎల్‌ఎల్‌పీకి చెందిన కార్పొరేట్ ఆఫీసు, సికింద్రాబాద్ బన్సీలాల్ పేట గోదాం, మెడక్ కాల్లకల్ ఆటోమోటివ్ పార్క్, ముప్పిరెడ్డి పల్లిలోని తయారీ యూనిట్లలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ సంస్థ కాపర్ తయారు చేయకుండా, విక్రయించకుండానే పన్నుల వే బిల్లులు జారీ చేసినట్లు తేలింది. వాస్తవానికి ఖాళీ వాహనాలను తెలంగాణ నుండి మహారాష్ట్రకు పంపించగా, డాక్యుమెంట్లలో మాత్రం భారీ సరుకుల రవాణా జరిగినట్టు చూపించారు. మోసపూరిత బిల్లుల మొత్తం విలువ రూ.100 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనాకు వచ్చారు. ఈ మోసం జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ద్వారా అందిన టోల్ గేట్ డాటా విశ్లేషణ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత సంస్థ సుమారు రూ. 33.20 కోట్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) ను క్లెయిమ్ చేసింది. అధికారులు అప్రమత్తంగా లేనట్లయితే ఈ మొత్తం సదరు సంస్థకు అప్పనంగా చెల్లించాల్సి ఉండేది. ఇది తెలంగాణలో ఇది పన్ను ఎగవేతలో ఓ కొత్త, ప్రమాదకర ధోరణి అని అధికారులు తెలిపారు. తనిఖీల తరువాత డైరెక్టర్లు వికాష్ కుమార్ కీషాన్, రజనీష్ కీషాన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీసీఎస్ డీసీపీ కి ఫిర్యాదు చేశారు. ఇదే కాకుండా చార్మినార్ డివిజన్ మెహదీపట్నం–1 సర్కిల్‌కు చెందిన డీఎస్టీవో మజీద్ హుస్సేన్ మరో మోసాన్ని గుర్తించారు. ఏపీ 29 టీఏ 7213 అనే వాహనం జూన్ 2025 నుండి కదలకుండా ఉన్నప్పటికీ, దానిలో సరుకులు పంపినట్లు అనేక ఈ-వే బిల్లులు జారీ అయ్యాయి. ప్రాథమిక విచారణ తరువాత వాహన యజమానిపై సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇలాంటి మోసాలు కూడా ఎక్కువగా మార్వాడీలే ఎక్కువగా చేస్తున్నారని వాణిజ్య పన్నుల అధికారి ఒకరు తెలిపారు. తనిఖీలకు వెళ్తే పై స్థాయి సిఫారసులు వస్తాయని, వినకపోతే బెదిరింపులకు గురిచేస్తారని వాపోయారు. ఎవరి మాట విన్పించుకోకపోతే బదిలీలు చేయిస్తారని, లేదంటే ఏసీబీకి చెప్పి పట్టిస్తారని మరో అధికారి వ్యాఖ్యానించారు.