Parliament Monsoon Session| రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు..ప్రారంభమైన ఆల్ పార్టీ మీటింగ్

Parliament Monsoon Session| రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు..ప్రారంభమైన ఆల్ పార్టీ మీటింగ్

న్యూఢిల్లీ : రేపటి(సోమవారం)నుంచి పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 21వరకు 21రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇక ప్రతిపక్షాల ఆరోపణలు..విమర్శలను అంతే ధీటుగా తిప్పికొట్టేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కూడా కసరత్తు చేస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వతా జరుగుతున్న ఈ పార్లమెంటు సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలతో సాగనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రతిపక్షాలు ఎనిమిది అంశాలపై మోదీ సర్కార్ ను నిలదీయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ఇండియా కూటమిలోనేి 24పార్టీలు శనివారం వర్చువల్ గా సమావేశమై పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాయి.  పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రకటన, ట్రంప్ భారత్ పై విధించిన వాణిజ్య ఆంక్షలు, ఇరుదేశాల మధ్య వాణిజ్య వ్యవహారాలు, బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో సాగుతున్న ఓటర్ల తొలగింపు, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, నియోజవర్గాల పునర్విభజన సహా పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమగ్ర చర్చలకు, వివరణకు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.

ప్రారంభమైన ఆల్ పార్టీ మీటింగ్

రేపటి నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఉభయ సభలలోని అన్ని రాజకీయ పక్షాల నేతలతో న్యూఢిల్లీలో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు ఆధ్వర్యంలో పార్లమెంట్ అనుబంధ భవనంలో ఈ సమావేశం కొనసాగుతుంది. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు, అజెండాను కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షం ముందుంచింది. సమావేశాలకు సహకరించాలని కోరింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్‌, గౌరవ్ గొగోయ్, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్‌, గురుమూర్తి, బీఆర్ఎస్ నుంచి సురేష్‌రెడ్డి, జనసేన నుంచి బాలశౌరి హాజరయ్యారు.

కీలక బిల్లులను ప్రవేశ పెట్టనున్న కేంద్రం

రేపటి నుంచి 21రోజుల పాటు కొనసాగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ఆగస్టు 12 నుంచి 18 వ తేదీ వరకు సెలవు ఇచ్చారు. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం ఏడు పెండింగ్ బిల్లుల తో పాటు, కొత్తగా మరో ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ సవరణ బిల్లు, జాతీయ క్రీడల బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లు, గనులు, ఖనిజాల అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణ సవరణ బిల్లు, కొత్తగా గౌహతిలో ఐఐఎమ్ ఉన్నత విద్యాసంస్థ ఏర్పాటు సహా ఇతర బిల్లులను ప్రవేశపెట్టనున్నది. వాటితో పాటు పెండింగ్ లో ఉన్న పలు బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదం కోసం రానున్నాయి. ది ఇండియన్ పోర్ట్స్ బిల్లు, ది మర్చంట్ షిప్పింగ్ బిల్లు లోక్ సభ ఆమోదం కోసం, ది కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, ది బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లు లు రాజ్య సభ ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నించనుంది. లోక్ సభ సెలెక్ట్ కమిటీ పరిశీలన ఉన్న ది ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును కూడా ఆమోదించేందుకు కేంద్రం ప్రయత్నించనుంది.