రెండోరోజు కురియన్ కమిటీ పోస్టుమార్టమ్‌ … ఎంపీ ఎన్నికల ఓటమి పై జిల్లాల వారిగా అభిప్రాయాల సేకరణ

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన సీట్లు సాధించకపోవడానికి, ఓడిన సీట్లలో ఓటమికి కారణాలపై విచారణకు ఏఐసీసీ నియమించిన ముగ్గురు సభ్యుల కురియన్ కమిటీ రెండో రోజు శుక్రవారం జిల్లాల వారిగా పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించింది.

రెండోరోజు కురియన్ కమిటీ పోస్టుమార్టమ్‌ … ఎంపీ ఎన్నికల ఓటమి పై జిల్లాల వారిగా అభిప్రాయాల సేకరణ

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన సీట్లు సాధించకపోవడానికి, ఓడిన సీట్లలో ఓటమికి కారణాలపై విచారణకు ఏఐసీసీ నియమించిన ముగ్గురు సభ్యుల కురియన్ కమిటీ రెండో రోజు శుక్రవారం జిల్లాల వారిగా పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు కరీంనగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, నల్లగొండ జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించింది. కరీంనగర్‌లో ఓటమికి ఎన్నికలకు కేవలం 16రోజుల ముందు పార్టీ అభ్యర్థిని ప్రకటించడం, బీజేపీ ప్రధాని మోదీ సభతో నాలుగు నెలల ముందే ప్రచారం ప్రారంభించడం, శ్రీరాముడి అక్షితల పంపిణీ వంటి అంశాలు పార్టీ ఓటమికి కారణమని ఆ జిల్లా నేతలు కురియన్ కమిటీకి వివరించారు. కురియన్ కమిటీతో భేటీ అనంతరం నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయని అడిగారరని, నియోజకవర్గాల వారీగా వివరాలు అందజేశానని, ఏడుగురు అభ్యర్థులు గెలవడానికి కారణం అడిగారని తెలిపారు. కోదాడ ఎమ్మెల్యే ఎన్‌. పద్మావతి ఉత్తమ్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కమిటీ సభ్యులు ప్రశ్నలు వేశారని, బూత్‌ల వారిగా ఫలితాల వివరాలను అందించానని తెలిపారు. కోదాడ నియోజకవర్గం లో మెజారిటీ రావడం పట్ల అభినందనలు తెలిపారని, మెజారిటీ రావడానికి కారణం అడిగారని, బీఆరెస్ పట్ల వ్యతిరేకత కలిసి వచ్చిందని చెప్పడం జరిగిందని పేర్కోన్నారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కురియన్ కమిటీతో ఇబ్రహీమ్ పట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో కాంగ్రెస్ బలహీనంగా ఉందని, మంత్రివర్గంలో ఏడు జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించి, 43శాతం ప్రజలున్న గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదని, బీజేపీ, బీఆరెస్‌లను ఎదుర్కోనేందుకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని కోరినట్లుగా చెప్పారు. బీఆరెస్ ఓట్లను బీజేపీవైపు ట్రాన్స్‌ఫర్ చేయడం కూడా ఎంపీ ఎన్నికల్లో ఓటమికి కారణమైందని వివరించినట్లుగా చెప్పారు. కాగా కురియన్ కమిటీ మూడు రోజుల పర్యటన శనివారంతో ముగియనుండగా, అనంతరం తాము సేకరించిన అభిప్రాయాలను అనుసరించి ఏఐసీసీకి నివేదిక సమర్పించనుంది.