అజారుద్దీన్‌కు విశిష్టమైన స్థానం దక్కాలి: రఫీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తుల్లో అజారుద్దీన్‌ ఒకరు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది.

  • By: Subbu |    telangana |    Published on : Oct 15, 2025 11:04 PM IST
అజారుద్దీన్‌కు విశిష్టమైన స్థానం దక్కాలి: రఫీ

హైదరాబాద్, అక్టోబర్ 15(విధాత): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తుల్లో అజారుద్దీన్‌ ఒకరు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌కు సంఘీభావం తెలుపుతూ సినీ దర్శకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ రఫీ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ.. ఫిల్మ్ మేకర్‌గా, తెలంగాణ ఉద్యమకారుడిగా, జూబ్లీహిల్స్ ఓటరుగా, సమాజ రాజకీయ అంశాలపై రచయితగా రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో, కాంగ్రెస్ నాయకత్వానికి ఒక లేఖ ద్వారా నా సూచనను తెలియజేశాన్నారు.

ఆ లేఖలో, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా అజారుద్దీన్‌ ని పరిగణనలోకి తీసుకోవాలని వినమ్రంగా అభ్యర్థించాను. క్రికెట్‌లో భారత జాతీయ జట్టుకు మాజీ కెప్టెన్‌గా ఆయన సాధించిన ఖ్యాతి, ఆయన స్వచ్ఛమైన, మతనిరపేక్ష ప్రజా ప్రతిష్ట, అన్ని వయస్సుల, వర్గాల ప్రజల మధ్య ఆయనకు ఉన్న ఆదరణ, ఇవన్నీ ఆయనను జూబ్లీహిల్స్ లాంటి భిన్నాభిప్రాయాల సమాహారమైన్న నియోజకవర్గానికి అనువైన నాయకుడిగా చేస్తాయి.

హైదరాబాద్ నగరంతో ఆయనకున్న బలమైన అనుబంధం, ఎంపీగా ఆయనకు ఉన్న అనుభవం, మైనారిటీలతో పాటు యువత, మధ్య తరగతి ఓటర్ల మధ్య ఆయనకు ఉన్న గౌరవం ఇవన్నీ పార్టీకి వ్యూహాత్మక ప్రయోజనాలుగా మారతాయి. ఆయన అభ్యర్థిత్వం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపగలదు. ప్రజల్లో, మీడియాలో ఆసక్తిని రేకెత్తించగలదు. కాంగ్రెస్ నాయకత్వ పునరుజ్జీవనానికి, మతసామరస్యానికి, విశ్వసనీయతకు ఇది బలమైన సందేశంగా నిలవగలదు అని లేఖలో ప్రస్తావించానన్నారు.

తరువాత, ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసినట్లు ప్రకటించారు. కానీ అది గవర్నర్ ఆమోదం కోసం ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. దీంతో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాదని స్పష్టమైందన్నారు. ఈ నామినేషన్ ఒక గుర్తింపుగా మేము అంగీకరిస్తున్నాము. కానీ అజారుద్దీన్ స్థాయికి కేవలం ఎమ్మెల్సీ పదవి సరిపోదని భావిస్తున్నామన్నారు.

ఇప్పటివరకు తెలంగాణ మంత్రివర్గంలో మైనారిటీలకు ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు మంత్రివర్గ విస్తరణ జరిగి ఉంటే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అది కాంగ్రెస్‌కు ఒక బలమైన అస్త్రంగా ఉండేదే. ఉపఎన్నిక అనంతరం కూడా మంత్రివర్గంలో మైనారిటీ ప్రాతినిధ్యం కల్పించకపోతే, స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనారిటీ ఓట్లను ఆకర్షించడం పార్టీకి సవాలుగా మారుతుంది అని తెలిపారు. ఈ నేపథ్యంలో, నేను మొహమ్మద్ అజారుద్దీన్ తో సమావేశమయ్యాను. ఆయనకు తెలంగాణ ప్రభుత్వంలో మరింత విశిష్టమైన స్థానం దక్కాలని నా ఆశాభావాన్ని వ్యక్తపరిచాను. మేము ఆయనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము అని రఫీ వెల్లడించారు.