ఆపరేషన్ కగార్: రక్తమోడుతున్న అడవుల్లో ఆదివాసీల అల్లకల్లోల జీవనం

ఆపరేషన్ కగార్: రక్తమోడుతున్న అడవుల్లో ఆదివాసీల అల్లకల్లోల జీవనం
  • అల్లకల్లోలంగా ఆదివాసీల జీవనం
  • రక్తమోడుతున్న పచ్చని అడవులు
  • ఆపరేషన్ కగార్ పైన తీవ్ర ఆగ్రహం
  • కేంద్ర ప్రభుత్వ అణచివేతపై నిరసన
  • ఇన్ఫార్మర్ హత్యలపై అభ్యంతరం
  • ప్రాణాలు కోల్పోతున్న ఆదివాసీ బిడ్డలు
  • చర్చల ప్రతిపాదనతో పెరిగిన ఆత్మస్థైర్యం
  • రాజ్యాంగ హక్కుల కోసం సంఘటితం
  • రాష్ట్రపతి దృష్టికి తెచ్చేందుకు యత్నం

 

విధాత ప్రత్యేక ప్రతినిధి:
మావోయిస్టుల సమూల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అటవీప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ కగార్ పై ఆదివాసీల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. అడవిని నమ్ముకున్న తాము క్షణం క్షణం బిక్కుబిక్కుమంటూ జీవితాలు వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొందని ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక్కరొక్కరొక్కరుగా గిరిజనం గళమెత్తుతూ తమకు రాజ్యంగం ప్రసాదించిన ప్రత్యేక హక్కుల హననంపై నిరసనలు చేపడుతున్నారు. ఒక వైపు వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల ఉనికిలేకుండా అణచివేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పదేపదే ప్రకటనలు చేస్తున్న సమయంలో ఆదివాసీ సంఘాలు ఐక్యంగా రాజ్యాంగంలో పొందుపరిచిన తమ హక్కులను కాలరాస్తున్న తీరుపై గొంతెత్తడంతో కొత్త సమస్య తలెత్తుతోంది. నిన్నమొన్నటి వరకు ఏకపక్షంగా వ్యవహరించిన సర్కార్, కేంద్ర బలగాలకు ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడనున్నది. గోదావరి పరివాహక ప్రాంతంలో నిరసనోద్యమం తీవ్రమవుతోంది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మంతో పాటు పొరుగురాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రపదేశ్‌లో సైతం గిరిజనం సంఘటితం అవుతున్నారు.

 

సాయుధ పదఘట్టనల్లో గూడేలు

మావోయిస్టులు, సాయుధ బలగాల తుపాకుల నీడలో తమ జీవితాలు ఛిద్రమవుతున్నాయని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఆపరేషన్ కగార్ పేరుతో నిత్యం వేల మంది సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఛత్తీస్‌గఢ్‌ సాయుధ దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని మావోయిస్టుల కోసం అడవులను, కొండలను, గుట్టలను జల్లెడపడుతున్నారు. నిత్య కూంబింగ్, ఎన్ కౌంటర్లతో పచ్చని అడవి నెత్తురోడుతోంది. పదుల సంఖ్యలో మావోయిస్టులు విగతజీవులుగా మారుతున్నారు. అక్కడక్కడ సాయుధ బలగాల్లో కూడా ప్రాణ నష్టం సంభవిస్తోంది. మావోయిస్టులు ఇన్మాఫార్మర్ల పేరుతో చేస్తున్న హత్యలతో భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ మొత్తం యుద్ధకాండలో ఎక్కువగా ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారు.

అల్లకల్లోలంగా గిరిజన జీవనం

సాయుధ బలగాల నిత్య పహారా, నిఘాతో గిరిజన పల్లెలు, గూడేల్లో రోజువారీ పనులు స్తంభించిపోతున్నాయి. అడవితో పెనవేసుకున్న వారి జీవితం ఆగమవుతోంది. అటవీ ఉత్పత్తుల సేకరణ పై ఆధారపడి జీవించే వారు సాయుధ బలగాల నిఘాతో అడుగు ముందుకేయలేని దుస్థితి ఎదుర్కొంటున్నారు. అనుమానితుల పేరుతో వందలాది మంది అరెస్టులు, నిత్యం యువకుల ఇంటారాగేషన్లు, లొంగుబాట్లు ఒక వైపు ఇబ్బందులపాలు చేస్తుండగా మరోవైపు పోలీసు ఇన్ఫార్మర్ల పేరుతో దాడులు ప్రాణసంకటరంగా మారింది. ఆదివాసీలు తమ రోజువారీ జీవితంలో భాగంగా ఇప్పపూల సేకరణ, తునికిపండ్లు, చేపలవేట, తునికాకు సేకరణ, కాయగడ్డ తెచ్చుకోవడం, ఆఖరికి పొయ్యిల కట్టెలు, మంచినీరు తెచ్చుకునేందుకు కూడా అవస్థలపాలవుతున్నారు. గత కొన్నేళ్ళుగా మావోయిస్టులపై అణచివేత కొనసాగినప్పటికీ తాజాగా కగార్ ఆపరేషన్ తో ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన పెరుగుతోంది.

శాంతి ప్రతిపాదనతో ఆత్మస్థైర్యం

మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరుపాలంటూ తెలంగాణ కేంద్రంగా ప్రారంభమైన ప్రయత్నం ఆదివాసీల్లో సైతం తీవ్ర చర్చకు తెరతీసింది. గిరిజన సంఘాల చొరవతో క్రమంగా ఆత్మస్థైర్యం పెరుగుతోంది. శాంతి చర్చల ప్రతిపాదనకు మావోయిస్టుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఇదే సమయంలో ఆపరేషన్ కర్రెగుట్టల ఎపిసోడ్ తాజా పరిస్థితిని తీవ్రం చేసింది. గత 12 రోజులుగా కర్రెగుట్టల ఎపిసోడ్ ఎడతెగకుండా సాగుతోంది. పౌరసమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా తమతమ స్థాయిలో నిరసన తెలియజేస్తూ మదనపడుతున్న ఆదివాసీ, గిరిజన, ప్రజా, పౌర, ప్రజాస్వామిక సంఘాలు ఒక్కసారిగా గొంతు విప్పాయి. మరీ ముఖ్యంగా ఆదివాసీ సంఘాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. శాంతి చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నాయి. శాంతి నెలకొంటే ఆదివాసీలు ఆందోళనకర జీవితం నుంచి బయటపడుతామనే ఆశాభావంతో ఉన్నారు.

గిరిజనుల రాజ్యంగ హక్కులు గల్లంతు

శాంతి చర్చలతో పాటు తాజాగా ఆదివాసీలకు రాజ్యంగం ప్రత్యేకంగా కల్పించిన హక్కులు ఈ సందర్భంగా తెరపైకి వచ్చాయి. ఇంతకాలం మౌనం వహిస్తూ తమకున్న ప్రత్యేక ఈ హక్కులను కోల్పోతున్న ఆదివాసీల్లో ఆగ్రహం పెరుగుతోంది. ముఖ్యంగా రాజ్యంగంలోని ఐదవ షెడ్యూల్ లోని హక్కులను ప్రస్తావిస్తున్నారు. పీసా చట్టం, ఆదివాసీలకున్న స్వయం ప్రతిపత్తి అంశాలను లెవనెత్తుతున్నారు. ఆపరేషన్ కగార్ ఫలితంగా తమ హక్కులు హరిస్తున్నారనే ఆందోళన పెరుగుతోంది. రాజ్యాంగం కల్పించిన హక్కుల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండాల్సి ఉండగా వారే తమను ఇబ్బందులపాలు చేస్తున్నారనే అభిప్రాయం పెరుగుతోంది. తక్షణం వీటిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. గిరిజన హక్కుల పరిరక్షణకు రాష్ట్రపతి దృష్టికి తెస్తామంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తెస్తామంటూ ప్రకటిస్తున్నారు. ముర్ము కూడా గిరిజన తెగకు చెందిన వ్యక్తికావడమే కాకుండా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ బాధ్యత కూడా రాష్ట్రపతిగా తనపై ఉందంటున్నారు. ఇదే విషయాన్ని ఆదివాసీ సంఘాలతో పాటు, రాష్ట్ర మంత్రి, ఆదివాసీ బిడ్డ సీతక్క ఇప్పటికే స్పష్టం చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో, షెడ్యూళ్ళు ఏరియాలో తమ హక్కులను కాలరాస్తే సహించేది లేదంటున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజ సంపదపై కన్నేసిన కేంద్రం ఈ అణచివేతకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రక్తపాతం, ఆణచివేత వెనుక కార్పొరేట్లకు అటవీభూములను ధారాదత్తం చేసే కుట్ర దాగుందనే ఆరోపణలు చేస్తున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలెన్నిన్నా ఆదివాసీలు శాంతియుతజీవనాన్ని కోరుకుంటున్నారు.

 

ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టలు కొన్నేళ్ళుగా మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా పనికొస్తున్నాయనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ నేత హిడ్మా, ముఖ్యనాయకులతో పాటు వందల సంఖ్యలో ఈ గుట్టల్లో తలదాచుకున్నారని దాదాపు 20వేల సాయుధ బలగాలు చుట్టుముట్టాయనే సమాచారం తెలిసిందే. సాయుధ బలగాలు ఆధునిక తుపాకులు, బాంబులను, ఆధునిక సమాచార వ్యవస్థను వినియోగిస్తున్నారు. గంటల్లో సెల టవర్లు నిర్మిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా లైట్ బాంబులను వినియోగిస్తున్నారు. గుట్టపైకి చేరేందుకు సైనిక హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. డ్రోన్లతో కదలికలను కనిపెడుతున్నారు. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా, అడుగు వేసినా తమ డేగ కళ్ళ నిఘా నుంచి తప్పిపోకుండా సాయుధ బలగాలు అణచివేతను కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌తో పాటు మిగిలిన అటవీప్రాంతాల్లో తమ ఆధిపత్యాన్ని సాధిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఆదివాసీలు తీవ్ర భయాందోళనలో జీవిస్తున్నారు. కరువమంటే కప్పకు కోపం, విడమంటే పాముకు కోపం అన్నట్లుగా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఈ భయానక పరిస్థితి నుంచి ప్రాణాలు దక్కించుకుంటె చాలనే భావనతో స్థానిక గిరిజనులు, ముఖ్యంగా యువత పల్లెలను వీడి పారిపోతున్నారు. దీంతో ఒక్కసారిగా వారి జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. ఇక మాజీలకైతే కంటి మీద కునుకులేని పరిస్థితి ఉంది. ఆదివాసీ పల్లెల్లో ముసలి,ముతక తప్ప యువత జాడలేకుండా పోతున్నది. దీంతో గూడాలు, పల్లెలు కళ తప్పి కలకలానికి నిలయంగా మారాయి. మరో వైపు ఎన్ కౌంటర్లలో తమ బిడ్డలను కోల్పోయి నిత్యం ఏదో ఒక గూడెంలో అంత్యక్రియలతో అట్టుడుకుతోంది. సంచలనం సృష్టించిన కర్రెగుట్టల ఆపరేషన్ కగార్ లో భాగంగా ఇంకా సాగుతూనే ఉంది.