అప్పుడు కర్రెగుట్టల్లో అసలేం జరిగింది!?

కర్రెగుట్టలు పేరు ఇప్పుడు అందరికీ సుపరిచితమైపోయాయి. సర్కారు సాయుధ బలగాలు, మావోయిస్టుల మధ్య కర్రెగుట్టలు కేంద్రంగా యుద్ధాన్ని మరిపించే విధంగా 21 రోజుల పాటు సాగిన భీకరపోరుతో కర్రెగుట్టలు మారుమోగాయి. చత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ములుగు జిల్లా అటవీప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఈ గుట్టలు మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్నాయి

అప్పుడు కర్రెగుట్టల్లో అసలేం జరిగింది!?
  • 21 రోజుల పాటు సాగిన ఆపరేషన్ కర్రెగుట్టలు
  • దాదాపు ఐదునెలల తర్వాత వెలుగులోకి
  • మావోయిస్టుల ప్రకటనతో మరో కోణం
  • 16 రోజులపాటు బలగాలను అడ్డుకున్నాం
  • ‘మూకాల్’ ద్రోహిగా మారడంతోనే నష్టం
  • శత్రువుకు భారీ నష్టం వాటిల్లినా దాచిపెట్టారు
  • మావోయిస్టలుపై సర్కారు మానసిక యుద్ధం

విధాత ప్రత్యేక ప్రతినిధి: కర్రెగుట్టలు పేరు ఇప్పుడు అందరికీ సుపరిచితమైపోయాయి. సర్కారు సాయుధ బలగాలు, మావోయిస్టుల మధ్య కర్రెగుట్టలు కేంద్రంగా యుద్ధాన్ని మరిపించే విధంగా 21 రోజుల పాటు సాగిన భీకరపోరుతో కర్రెగుట్టలు మారుమోగాయి. చత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ములుగు జిల్లా అటవీప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఈ గుట్టలు మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన ప్రారంభమైన ఈ ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ 21 రోజులు 25వేల మందికి పైగా సాయుధ బలగాలు సుదీర్ఘ ఆపరేషన్ నిర్వహించాయి. మావోయిస్టు పార్టీ పీఎల్జీఎ మొదటి బెటాలియాన్ కమాండర్ హిడ్మాతో పాటు మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.

మారుమూల అటవీప్రాంతంలోని ఈ గుట్టల ఆపరేషన్కు సైనిక హెలికాప్టర్లు, డ్రోన్లు, లైట్ బాంబులు, గ్రెనేడ్లు, రాకెట్ లాంచర్లతో పాటు ఆధునిక ఆయుధ సామాగ్రిని వినియోగించారు. ఈ సంఘటనలో 21 సార్లు ఎన్కౌంటర్లు జరిగినట్లు ఇందులో 26 మంది మావోయిస్టులు చనిపోయారని అప్పట్లో వార్తలు వెలువెడ్డాయి. ఇందులో మావోయిస్టు ముఖ్యనేతలున్నారని భావించినప్పటికీ ఈ అంశం దృవీకరించలేదు. ఈ ఆపరేషన్ సందర్భంగా సాయుధ బలగాలు కర్రెగుట్టలపై జాతీయ జెండాను ఎగురవేసి వాటిని స్వాధీనం చేసుకున్నట్లుగా సంబురాలు నిర్వహించారు. అప్పట్లో దీనిపై విమర్శలు వచ్చాయి. అదే సమయంలో పాకిస్తాన్, ఇండియా యుద్ధ నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత తగ్గిపోయింది.

అప్పుడు కర్రెగుట్టల్లో అసలేం జరిగింది?

21 రోజుల పాటు జరిగిన యుద్ధంలో అప్పుడు ఈ కర్రెగుట్టల్లో ఏం జరిగిందనేది సర్కారు సాయుధ బలగాలు, ఇతరత్రా పాక్షిక సమాచారం ద్వారా మాత్రమే కొన్ని విషయాలు తెలిశాయి. ఈ సందర్భంగా కర్రెగుట్టల పై సాయుధ బలగాలు పట్టు సాధించాయని ప్రకటిస్తూ మావోయిస్టుల నుంచి ఒకటి, అర ప్రకటనలు విడుదలైనప్పటికీ పూర్తి సమాచారం అప్పట్లో వెలువడలేదు. తాజాగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ విడుదల చేసిన 10 పేజీల సర్క్యులర్ లో ఈ ‘కర్రెగుట్ట’ల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలగాల దాడిలో ఏం జరిగిందనేది పేర్కొన్నారు. దీంతో నాణేనానికి అటువైపుగా ఉన్న అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

16 రోజులపాటు బలగాల నియంత్రణ

ఏప్రిల్ 22 నుంచి మే 12 తేదీ వరకు 21 రోజుల పాటు సాగిన సర్కారు సాయుధ బలగాల కర్రెగుట్టల ఆపరేషన్ సందర్భంగా తొలి16 రోజుల పాటు అనగా మే 7వ తేదీ వరకు బలగాలను పూర్తిగా నియంత్రించినట్లు మావోయిస్టులు ప్రకటించారు. మే 8వ తేదీన సాయుధ బలగాలు చుట్టుముట్టి దాడిచేసిన తర్వాత నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేలాది బూబీ ట్రాపుల్ని అమర్చడంలో బలగాలు అడ్వాన్స్ కాలేకపోయాయని పేర్కొన్నారు.

ద్రోహి మూకాల్ సమాచారంతో దాడి

ఇరువర్గాల మధ్య భీకర పోరు సాగుతున్న సమయంలో మావోయిస్టు పార్టీకి చెందిన ‘మూకాల్’ అనే వ్యక్తి పారిపోయి శత్రుకు సరెండరయ్యారని ప్రకటించారు. ఈ వ్యక్తి ప్రభుత్వ బలగాలకు గైడ్గా వ్యహరించి దాడులు చేయించడంతో తమకు నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ యుద్ధంలో శత్రువుకు భారీగా నష్టం వాటిల్లినప్పటికీ వాటిని దాచిపెట్టి మావోయిస్టుల వైపు నష్టపోయినట్లు ప్రచారం చేస్తూ మానసిక యుద్ధం చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా దాదాపు 110 చోట్ల బూబీట్రాపులు పేలి సాయుధ బలగాల్లో 45 – 50 మంది చనిపోగా, 70 – 80 మంది గాయపడ్డారని వివరించారు.

మే 8న జరిగిన ప్రతిఘటనలో 5 గ్రేహౌండ్స్ కమాండోలు చనిపోగా, మరో నలుగురు కమాండోలు గాయపడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా ఒక ఏకే, ఎస్ఎల్ఆర్, 150 తూటాలు తదితర సామాన్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ వాస్తవాలను కప్పిపుచ్చి క్రాస్ ఫైరింగ్ లో గ్రేహౌండ్స్ పోలీసులు చనిపోయారని ప్రకటించారని పేర్కొన్నారు. అదే విధంగా ముర్దొండ వద్ద జూలై 8న జరిగిన అంబుష్ లో 11 మంది సాయుధ బలగాలకు చెందిన వారు మృతి చెందారని వివరించారు. శత్రువు చేస్తున్న సాయుధ, మానసిక దాడుల నుంచి పార్టీని కాపాడుకుంటూ ముందుకు సాగుదామంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది.