ప్రస్తుతం ఉన్న తెలంగాణ ఆంధ్రా దోపిడిదారుల తెలంగాణ మాత్రమే అని, నిజమైన తెలంగాణ సాధన కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు పై ఆంధ్ర పాలకుల వైఖరీ దుర్మార్గంగా ఉందని, తెలంగాణ పౌర హక్కులపైన, స్వేచ్చపైన దాడిగా కనిపిస్తుందన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఆంధ్రా పెత్తనం ఎక్కువయిందని, తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేయకపోతే, తెలంగాణ పూర్తిగా ఆంధ్రావాళ్ళ చేతికి వెళ్లిపోతుందని హెచ్చరించారు.
తెలంగాణలో ఆంధ్రా మీడియా మాఫియాలాగా తయారయ్యిందని, వెంటనే ఆంధ్రా మీడియాను తెలంగాణ నుండి తరిమెయ్యాలన్నారు. తెలంగాణలో మీడియా అంతా ఆంద్రోళ్ల చేతుల్లోనే ఉందని, ఆంధ్ర మీడియాను తెలంగాణ నుంచి తరిమివేయాలి, సోషల్ మీడియా మాత్రమే ఇప్పుడు తెలంగాణ ప్రజల తరుపునా ఉందన్నారు.
హెరిటేజ్ పాలను తెలంగాణలో బ్యాన్ చేయాలి
తన హెరిటేజ్ పాల కోసం చంద్రబాబు ఆనాడు విజయ్ పాలను పూర్తిగా తగ్గించేశాడని, హెరిటేజ్ పాలను తెలంగాణ నుంచి తరిమివేయాలని యాదగిరి వ్యాఖ్యానించారు. మరీ ముఖ్యంగా.. తెలంగాణ రాష్ట్రం నుంచి ఫార్మా కంపెనీలను పూర్తిగా తరిమికొట్టాలని, అవన్ని కూడా ఆంద్రోళ్ల చేతుల్లోనే ఉన్నాయని, తెలంగాణను పూర్తిగా కాలుష్యం బారిన పడేస్తున్నారని ఆరోపించారు. బడా ఫార్మా కంపెనీల అధినేత మురళీ కృష్ణ ప్రసాద్ తెలంగాణలో భారీగా ఫార్మా కంపెనీలు పెట్టి ఈ ప్రాంతాన్ని కాలుష్యం పాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు కాలుష్యం ప్రసాదించి తను మాత్రం వేలకోట్లు సంపాదిస్తున్నాడని ఆరోపించారు. ఆంధ్ర ఆధిపత్యం ప్రదర్శించే వారి సినిమాలను కూడా తెలంగాణలో నడనియ్యవద్దన్నారు.
