బీజేపీ వైపు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చూపు ? హస్తినలో కమలనాథులతో భేటీ

పటాన్ చెరు బీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లడం గులాబీ దళానికి షాక్ ఇచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ ..బీఆరెస్‌ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేసిన రోజునే మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది

బీజేపీ వైపు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చూపు ? హస్తినలో కమలనాథులతో భేటీ

విధాత, హైదరాబాద్‌ : పటాన్ చెరు బీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లడం గులాబీ దళానికి షాక్ ఇచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ ..బీఆరెస్‌ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేసిన రోజునే మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ లో చేరేందుకే ఢిల్లీ వెళ్లినట్లు ప్రచారం సాగినా…ఆయన మాత్రం పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. కేసీఆర్ ఎమ్మెల్యేలతో ఫామ్‌హౌస్‌లు సమావేశాలు నిర్వహిస్తున్న సమాచారం తనకు అందలేదని, తాను ఈడీ కేసులకు సంబంధించి న్యాయవాదులతో చర్చించే నిమిత్తం ఢిల్లీకి రావడం జరిగిందని మహిపాల్‌రెడ్డి తెలిపారు. అయితే ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. అటు బీజేపీ నేతలతో కూడా మహిపాల్‌రెడ్డి టచ్‌లోకి వెళ్లారని తెలుస్తుంది. తాజాగా మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూధన్‌రెడ్డిలపై ఈడీ కేసులు నమోదైన నేపథ్యంలో బీజేపీ నేతలతో ఆయన టచ్‌లోకి వెళ్లారని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో గణనీయంగా పుంజుకున్న బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సాధనే లక్ష్యంగా రాష్ట్ర రాజకీయాల్లో బలం పెంచుకునేందుకు పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి సాగుతున్న వలసల క్రమంలో బీజేపీ వైపు కూడా కొంత మంది బీఆరెస్ ఎమ్మెల్యేలను లాక్కోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని రాజకీయ విశ్లేషకుల కథనం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆరెస్ ఎమ్మెల్యేలను బీజేపీ వైపు ఆకర్షించే వ్యూహాలకు కమలనాథులు పదును పెడుతున్నారని, ఇందులో భాగంగా ఈడీ కేసులతో సతమతమవుతున్న మహిపాల్‌రెడ్డికి బీజేపీ గాలం వేసిందన్న ప్రచారం వినిపిస్తుంది.