ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలోని హనుమకొండ పర్యటనకు వచ్చారు. తన పర్యటనలో భాగంగా అంతుచిక్కని వ్యాధితో మంచానికే పరిమితమైన తన అభిమాని.. 17 ఏళ్ల నిరంజన్‌ను ఈ సందర్భంగా ఆయన పరామర్శించారు. “డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ” అనే అరుదైన జన్యుపరమైన నరాల వ్యాధితో నిరంజన్ బాధపడుతున్నాడు. ఆరు సంవత్సరాల వరకు బాగానే ఉన్న బాలుడు ఆ తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. తన అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ ను ఒక్కసారైనా కలవాలన్న నిరంజన్ చివరి కోరికను మన్నించి, పవన్ కళ్యాణ్ అతని ఇంటికి వెళ్లి దాదాపు 45 నిమిషాల పాటు బాలుడితో, అతని కుటుంబ సభ్యులతో గడిపారు.
చిన్ననాటి నుంచి పవన్ కల్యాణ్ పట్ల విపరీత అభిమానం పెంచుకున్న నిరంజన్ ఎప్పటికైనా ఆయన్ని నేరుగా కలిసి మాట్లాడాలనేది ఆశించారు. ఈ విషయాన్ని అభిమానులు పవన్‌కు చేరవేయగా.. ఆయన హన్మకొండలోని బాలుడి ఇంటికెళ్లి పరామర్శించారు. నిరంజన్ ఆరోగ్యాన్ని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. పవన్ పరామర్శలో తమ కుమారుడి ఆయుష్ మరికొంత కాలం పెరుగుతుందని తల్లిదండ్రులు ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా పవన్ బాలుడి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ. లక్ష ఆర్థిక సహాయం చేశారు. బాలుడి తల్లిదండ్రులకు ఉపాధి కోసం క్యాంటిక్ పెట్టుకునేందుకు సహాయం చేస్తానని హమీ ఇచ్చారు. పవన్ రాకతో ఆయనను చూసేందుకు హన్మకొండలో ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన భద్రకాళీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.
