జూలై 31న ప్రభుత్వానికి కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 31న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. పీసీ ఘోష్ ఆదివారం నాడు హైదరాబాద్ కు చేరుకున్నారు. కమిషన్ గడువు ఈ నెలాఖరు వరకే ఉంది. దీంతో అప్పటిలోపుగా నివేదికను కమిషన్ ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది

విధాత: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 31న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. పీసీ ఘోష్ ఆదివారం నాడు హైదరాబాద్ కు చేరుకున్నారు. కమిషన్ గడువు ఈ నెలాఖరు వరకే ఉంది. దీంతో అప్పటిలోపుగా నివేదికను కమిషన్ ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. ఈ నివేదికలో ఏం తేలుస్తోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఈ నివేదిక ఆధారంగా ఏం చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం నిర్ణయించనుంది.
115 మందిని విచారించిన పీసీ ఘోష్ కమిషన్
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మేడిగడ్డ బరాజ్ లోని పిల్లరు 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. ఆ సమయంలో ఎన్నికల కోడ్ ఉంది. ఏడో పిల్లర్
కుంగిపోయింది. అప్పట్లోరాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ మేడిగడ్డ బరాజ్ ను పరిశీలించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ వంటి అంశాలపై జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దీనికి అనుగుణంగానే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, బరాజ్ ల కుంగుబాటుపై విచారించింది. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇంజనీర్లు, ఇతర విభాగాల్లో పనిచేసిన సుమారు 115 మంది ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందిని విచారించింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కూడా విచారణకు హాజరై తమ స్టేట్ మెంట్ ఇచ్చారు. పీసీ ఘోష్ కమిషన్ సీఎంఓను కొంత సమాచారం అడిగారని… ఆ సమాచారం ఈ నెల 30 లోపుగా కమిషన్ కు అందిస్తామని సీఎంఓ నుంచి కమిషన్ కు సమాచారం వెళ్లింది. ఈ సమాచారం ఆధారంగా తుది రిపోర్టును సిద్దం చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఈ నెల 31న కమిషన్ తుది రిపోర్ట్ ను అందించనుంది.
కాళేశ్వరంపైనే అధికార ,విపక్షాల మధ్య మాటల యుద్ధం
ప్రాజెక్టు రీ డిజైన్ల పేరుతో ప్రాణహితకు బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదికి తెచ్చారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. కమీషన్ల కోసమే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టుల రీ డిజైన్లు చేసిందనేది హస్తం పార్టీ ఆరోపణ. ఈ ఆరోపణలను కారు పార్టీ తోసిపుచ్చుతోంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను రీ డిజైన్ చేశామనేది గులాబీ పార్టీ చెబుతోంది. కోట్ల రూపాయాలు ఖర్చు చేసిన కాళేశ్వరం కడితే రైతులకు ఏం ఉపయోగపడిందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఏ ఆయకట్టు కింద పండిన పంటనైనా కాళేశ్వరం కింద చూపారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాళేశ్వరం కింద కనీసం 20 లక్షల ఎకరాలకు పైగా నీళ్లిచ్చినట్టుగా కారు పార్టీ చెబుతోంది. ఈ ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులు, వడ్డీలు తీర్చడానికి అప్పులు చేయాల్సి వస్తోందనేది కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందో ప్రజలకు వివరించాలని హస్తం పార్టీ భావిస్తోంది. మరోవైపు వర్షాకాలంలో గోదావరిలో వస్తున్న వరదను రిజర్వాయర్లలోకి పంప్ చేయకుండా వృధాగా వదిలేయడం ద్వారా కాళేశ్వరం ఆయకట్టు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. పీసీఘోష్ కమిషన్ బయటపెట్టే అంశాల ఆధారంగా బీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాళేశ్వరంపై ఎన్ డీ ఎస్ఏ నివేదిక ఇప్పటికే ఇచ్చింది. బరాజ్ లలో నీళ్లు నింపవద్దని ఆ నివేదిక తెలిపింది. మరో వైపు విజిలెన్స్ నివేదిక కూడా ఇంజనీర్లపై ప్రాసిక్యూషన్ కు రికమెండ్ చేసింది.