Phone Tapping case | ఫోన్ ట్యాపింగ్‌పై ప్రణీత్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీతరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు.

Phone Tapping case | ఫోన్ ట్యాపింగ్‌పై ప్రణీత్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు

1200మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా వెల్లడి
ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే అన్ని చేశాం
పట్టుబడిన నగదును హవాలా రికార్డుల్లో చూపాం
17సిస్టమ్‌లు..56మంది సిబ్బంతో ట్యాపింగ్‌
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డాటా ధ్వంసం

విధాత: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీతరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. ట్యాపింగ్‌లో భాగంగా అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ సహా ప్రభుత్వ పెద్దల సూచనలతో 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్‌రావు పేర్కోన్నాడం సంచలనం రేపుతుంది. బీఆరెస్‌కు వ్యతిరేకంగా వ్యవహారించే ప్రతిపక్ష రాజకీయ నేతల ఫోన్లు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు, మీడియా పెద్దల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా తెలిపాడు. అలాగే ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా తన వాంగ్మూలంలో ప్రణీత్‌రావు పేర్కోన్నాడు. ఎనిమిది ఫోన్లో ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉంటూ ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడించాడు.

అధికారికంగా మూడు, అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్లుగా ప్రణీత్‌రావు తెలిపాడు. ప్రతిపక్షాలకు ఆర్థిక సాయం చేస్తున్న వాళ్ల డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకుని, ఆ డబ్బు మొత్తాన్ని ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డులో చూపించామని వెల్లడించడం ఆసక్తికరం. ఫోన్ ట్యాపింగ్ కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సాయం తీసుకున్నామని, ల్యాబ్‌కు చెందిన శ్రీనివాస్, అనంత్‌ల సాయంతో ట్యాపింగ్‌ విస్తృతం చేశామని తన వాంగ్మూలంలో ప్రణీత్‌రావు బయటపెట్డాడు. అలాగే ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టంల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేశామని, రెండు లాగర్ రూమ్‌లలో, 56 మంది సిబ్బందితో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా తెలిపాడు.

ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి ట్యాపింగ్ నిలిపివేశామని, కాంగ్రెస్ రాగానే ఫోన్ ట్యాపింగ్‌ మొత్తం ఆపివేయమని ప్రభాకర్‌రావు చెప్పాడని, ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ ట్యాపింగ్‌కు సంబంధించిన సమాచారం మొత్తాన్ని ధ్వంసం చేయాలని ఆదేశించాడని ప్రణీత్‌రావు పేర్కోన్నాడు. ప్రభాకర్‌రావు ఆదేశాలకతో 50కొత్త హార్డ్ డిస్కులు తెచ్చి పాత వాటి స్థానంలో కొత్త హార్డ్ డిస్క్ లు ఫిక్స్ చేశామని తెలిపాడు. అలాగే 17 హార్డ్ డిస్క్‌లలో అత్యంత కీలక సమాచారం ఉందని, ఆ 17 హార్డ్ డిస్క్‌లను కట్టర్‌లతో కట్ చేసి ధ్వంసం చేసి పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్‌తో ఐడీపీఆర్ డేటా మొత్తాన్ని కాల్చివేశామని చెప్పాడు. పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు,లాప్ ట్యాప్‌లు,ఇతర ఎలక్ట్రానిక్ డాటాను ధ్వంసం చేసి, వాటిని నాగోల్ మూసీ, ముసరాంబాద్‌లో మూసీలో పడేశామని, ధ్వంసం చేసిన సెల్‌ఫోన్లు, పెన్ డ్రైవ్‌లను బేగంపేట నాలాలో పడేశామని ప్రణీత్‌రావు తన వాంగ్మూలంలో వెల్లడించం జరిగింది.

ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు టాస్క్‌ఫోర్సు మాజీ డీసీపీ రాథాకిషన్‌రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్నల వాంగ్మూలాలో వెల్లడైన సంచలన విషయాలు హాట్ టాపిక్‌గా మారగా, ప్రణీత్‌రావు వాంగ్మూలంలోనూ మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. దీంతో అప్పటి బీఆరెస్ ప్రభుత్వం, ఫోన్ ట్యాపింగ్ బృందంపై బాధిత ప్రతిపక్షాలు, నాయకులు, వ్యాపారులు, జర్నలిస్టులు మండిపడుతూ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.