ఈసీపై రాహుల్‌ పోరాటానికి రఘునందన్‌ ఎవిడెన్స్‌!

బోగస్‌ ఓట్లు ఉన్నాయని చెబుతూ ఒక ఓటరుకు ఒకే ఓటు నినాదంతో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. పార్లమెంటు లోపల, బయట దీనిపై గళమెత్తుతున్నారు. ఇదే అంశంపై బీజేపీ మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు సైతం ఈసీకి ఫిర్యాదు చేయడం ఆసక్తి రేపింది.

ఈసీపై  రాహుల్‌ పోరాటానికి రఘునందన్‌ ఎవిడెన్స్‌!
  • రాహుల్‌ పోరాటానికి రఘునందన్‌ ఎవిడెన్స్‌!
  • మెదక్‌లో భారీగా బోగస్‌ ఓట్లు
  • ఈసీకి ఫిర్యాదు చేసిన ఎంపీ
  • కాంగ్రెస్‌ సర్కార్‌పై ఆరోపణ

హైద‌రాబాద్‌, ఆగ‌స్ట్‌ 13 (విధాత‌): ఒకవైపు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బోగస్‌ ఓట్లు ఉన్నాయని చెబుతూ ఒక ఓటరుకు ఒకే ఓటు నినాదంతో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. పార్లమెంటు లోపల, బయట దీనిపై గళమెత్తుతున్నారు. ఇదే అంశంపై బీజేపీ మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు సైతం ఈసీకి ఫిర్యాదు చేయడం ఆసక్తి రేపింది. రాహుల్‌ చేస్తున్న పోరాటానికి రఘునందన్‌రావు ఫిర్యాదే ఎవిడెన్స్‌ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నిక‌ల క‌మిష‌న్ స్వ‌తంత్ర‌తను కోల్పోయింద‌ని, బీజేపీ చేతిలో పావుగా మారిందని రాహుల్‌ ఆరోపిస్తున్నారు. ఎన్నిక‌ల తేదీల ద‌గ్గ‌ర నుంచి ఓట్ల జాబితా స‌వ‌ర‌ణ‌, త‌యారీ అంతా బీజేపీ క‌నుస‌న్న‌ల్లో జరిగింద‌ని ఉదాహరణలతో సహా ఇటీవల బయటపెట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ప్రతిపక్ష ఎంపీలతో కలిసి ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ అరెస్టయారు. ఈ నేప‌థ్యంలో సాక్షాత్తూ బీజేపీ ఎంపీ రఘునంద‌న్ రావు సైతం ఓకేసారి భారీ స్థాయిలో ఓట్లు పెరగడాన్ని ప్రశ్నించారు.

ఇప్పుడు ఒక పంచాయ‌తీలో ఒకేసారి 700 ఓట్లు ఎలా పెరిగాయ‌ని ఛాలెంజ్ చేస్తూ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఆధారాల‌తో స‌హా రఘునందన్‌రావు ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక బీజేపీ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోప‌ణ‌ల‌ను బ‌ల‌ప‌రిచార‌ని అనుకోవాలా? లేక అన్ని అధికార పార్టీలూ ఈ పాపంలో పాలు పంచుకున్నాయ‌ని నాటి బీఆరెస్ ప్ర‌భుత్వాన్ని బోనులో నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశారా? అన్న సందేహాలు స‌ర్వ‌త్రా త‌లెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగింది 2023 న‌వంబ‌ర్ 23న‌. పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రిగింది 2024 మే నెల‌లో. ర‌ఘునంద‌న్ రావు స్థానిక స‌ర్పంచ్‌తో క‌లిసి మొద‌ట జిల్లా ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది 2024 జనవరి 10న‌. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత ఓట‌ర్ల జాబితాలో అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి మార్పులు, చేర్పులు జ‌ర‌గ‌లేదు. అయినా.. ఈ ఓట్ల పెరుగుదలకు కాంగ్రెస్‌ కారణమని రఘునందన్‌రావు ఆరోపించడాన్ని పరిశీలకులు కొట్టిపారేస్తున్నారు.

చిన్నగ్రామంలో 700 ఓట్లు ఎలా పెరిగాయి
మెదక్ నియోజకవర్గంలో ఐలపూర్ అనే ఒక చిన్న గ్రామంలో 700 పైగా ఓట్లు ఒకేసారి పెరిగాయని రఘునందన్‌రావు ఆరోపించారు. ఈ మేరకు బుధ‌వారం బీఆర్‌కే భ‌వ‌న్‌లోని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మొదటి సారి 10 జనవరి, 2024లో  స్ధానిక సర్పంచ్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామ‌న్నారు. 19 జనవరి 2024న జిల్లా కలెక్టర్‌కు అదే సర్పంచ్‌తో ఫిర్యాదు ఇప్పించామ‌ని తెలిపారు. 2024 ఫిబ్రవరి 28న ఫైనల్ ఓటర్ లిస్టు వచ్చాక తహశీల్దార్‌కు, అప్పటి సీఈవో వికాస్ రాజ్ కు 2024 ఏప్రిల్ 15 న‌ ఫిర్యాదు చేశామ‌ని వివరించారు. ఒక చిన్న పల్లెటూరులో 950 ఓట్లు ఉండాల్సిందని, కానీ అదనంగా దాదాపు 700 ఓట్లు పెరిగాయని తెలిపారు. మెద‌క్ జిల్లా ఐలపూర్‌లో 1-1 నుంచి 3-8 వరకు ఇండ్లు ఉంటే స్మశానవాటికకు, బోరింగ్‌కు, ట్యాంక్‌కు కూడా ఇంటి నంబర్లు ఇచ్చి ఇష్టమున్నట్టు ఓటర్లను కలిపారని ఆరోపించారు. 950 ఓట్లు ఉండాల్సిన ఐలపూర్‌లో ఇప్పుడు ఏకంగా 2500 ఓట్లు కనపడుతున్నాయన్నారు. 126 మరియు 126/ఏ ఉండే పోలింగ్ స్టేషన్లు  ఉంటే ఇప్పుడు 138, 137, 136, 135 అని నాలుగు పోలింగ్ స్టేషన్స్ పెంచారని ఆరోపించారు. పైపెచ్చు.. కాంగ్రెస్‌ పాలించే తెలంగాణలో ఒక పల్లెటూరులో ఎలా పెరిగాయని రాహుల్‌ గాంధీని నిలదీశారు. ఈ దొంగ ఓట్లను తొలగించేందుకు బీహార్‌లో ప్రత్యేక సవరణ చేపట్టినట్టు చెప్పుకొన్నారు. బెంగళూరులో రెండు దొంగ ఓట్లను చూపి ఏదో చెప్తున్నాడని మండిపడ్డారు. దొంగ ఓట్లతో గెలవాల్సిన అవసరం తమ పార్టీకీ లేదన్నారు.