విధాత, హైదరాబాద్ : రాయదుర్గం భూముల వేలం పాటలు దేశ రియల్ ఎస్టేట్ రంగంలోనే కొత్త రికార్డులను నమోదు చేశాయి. తాజాగా రాయదుర్గం పాన్ మక్త ప్రాంతంలో టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.269 కోట్ల రికార్డు ధరకు అమ్ముడుపోయింది. 5.38 ఎకరాల పీ2 ప్లాట్ వేలంతో ప్రభుత్వానికి రూ.1,447.22 కోట్ల ఆదాయం సమకూరింది. రిజర్వు ధర కంటే 52.3% అధిక ధర పలికినట్టు టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ శశాంక తెలిపారు. భూముల వేలానికి భారీ స్పందన లభించింది.
స్థానిక, జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థలు వేలంలో పోటాపోటీగా పాల్గొన్నాయి. బ్రేగేడ్ సంస్థ చివరి వరకు పోటీ పడినా హైదరాబాద్‌కు చెందిన వంశీరాం బిల్డర్స్ ఎకరాకు రూ.269 కోట్లతో వేలంలో భూమిని కైవసం చేసుకుంది. ఇది రిజర్వ్ కంటే 52.3 శాతం అధికం కావడం విశేషం.
ఇదే నెల 21వ తేదీన నిర్వహించిన టీజీఐఐసీ వేలంలో ఎకరం భూమికి రూ.264 కోట్ల వరకు ధర పలికింది. వారం రోజుల వ్యవధిలో నిర్వహించిన తాజా వేలంలో ఎకరాకు మరో రూ.5 కోట్లు అదనంగా ధర పలకడంతో కొత్త రికార్డు నమోదైంది. హైదరాబాద్‌లో ముఖ్యంగా ఐటీ, వాణిజ్య కార్యకలాపాలకు కీలకమైన ప్రాంతాల్లో భూములకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. రాయదుర్గం, పాన్ మక్త వంటి ప్రాంతాల్లో ఉన్న భూములపై రియల్ ఎస్టేట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
వారం క్రితం నిర్వహించిన ప్లాట్ పీ1 వేలంలో ఎకరా రూ.264 కోట్లు ధర పలుకగా.. మొత్తం 1,386 కోట్ల ఆదాయం వచ్చినట్టు టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ శశాంక తెలిపారు. ఇందులో వేలం విలువలో 25% తొలి దశ చెల్లింపుగా ఇప్పటికే ప్రభుత్వం అందుకున్నట్టు తెలిపారు. పీ1, పీ2 ప్లాట్‌లు రెండు కలిపి మొత్తం 10.63 ఎకరాల భూమికి వేలం నిర్వహించగా.. ప్రభుత్వానికి మొత్తం రూ.2,883.22 కోట్ల ఆదాయం వచ్చినట్టు వెల్లడించారు.
రాయదుర్గం భూములు సర్కారు ఖజానాకు బంగారు గనులుగా మారాయి. 2025, 2026లో టీజీఐఐసీ రాయదుర్గంలో 41.74 ఎకరాల భూములను వేలం వేయగా ఏకంగా రూ.8,457.47 కోట్ల ఆదాయం సమకూరడం చూస్తే..రాయదుర్గం ప్రాంతంపై పెట్టుబడిదారుల్లో ఉన్న బలమైన ఆసక్తికి నిదర్శనంగా కనిపిస్తుంది.
