ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దైంది. అత్యంత భారీగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ తో సహా తెలంగాణలోని వివిధ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి

- 10 జిల్లాల్లో అతి భారీ వర్షాలు
- మరో 8 జిల్లాల్లో భారీ వర్షాలు
- మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం
- వెల్లడించిన వాతావరణ శాఖ
హైదరాబాద్, ఆగస్టు16(విధాత): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దైంది. అత్యంత భారీగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ తో సహా తెలంగాణలోని వివిధ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జన జీవనం అస్తవ్యస్థమైంది. కాగా తెలంగాణ రాష్ట్రంపై నైరుతి రుతుపనాలు చురుకుగా కదులుతుండడంతో వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మరోరెండు రోజుల పాలు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, జనగాం, సూర్యాపేట, సిద్దిపేట, పెద్దపల్లి, నిర్మల్, నల్లగొండ, మంచిర్యాల, కొమురంభీమ్ ఆసిఫాబాద్, ఖమ్మం, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేస్తూ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలుపుతూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు సోమవారం కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
నిండుకుండల్లా జలాశయాలు
ఇటీవల కురిసిన వర్షాలకు అనేక జిల్లాల్లో చెరువులు, కుంటలు నిండాయి, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణానదిపై ఉన్న రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి. పై నుంచి వచ్చిన వరదను వచ్చినట్లుగానే కిందకు వదిలేస్తున్నారు. అలాగే గోదావరికి కూడా కడెం, ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదులనుంచి భారీగా వరద వచ్చిచేరుతున్నది. హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే జంట జలాశయాలు నిండుకుండలా ఉన్నాయి. హిమాయత్ సాగర్ జలాశయం గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌కు మరో మూడు అడుగుల నీరు రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని, దీంతో దీని గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్దం అవుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే భారీ వర్షాలకు మూసీ ఉదృతంగా ప్రవహిస్తున్నది.