Nagaram Land : నాగారం భూ వివాదంలో ఐఏఎస్, ఐపీఎస్ లకు హైకోర్టు ఊరట

నాగారం భూ వివాదంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు హైకోర్టు ఊరట లభించింది. సర్వే నంబర్లు 194, 195 నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

Nagaram Land : నాగారం భూ వివాదంలో ఐఏఎస్, ఐపీఎస్ లకు హైకోర్టు ఊరట

విధాత : రంగారెడ్డి జిల్లా నాగారం భూ వివాదంలో ఐఏఎస్, ఐపీఎస్ లకు హైకోర్టులో ఊరట దక్కింది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వారి కుటుంబసభ్యులు కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలో యథాతథస్థితి కొనసాగించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. నిషేధిత జాబితా నుంచి సర్వే నెంబర్లు 194, 195 తొలగిస్తూ ఆదేశాలిచ్చింది. అవి పట్టా భూములేనని జిల్లా కలెక్టర్ సైతం కోర్టుకు నివేదించడం.. పిటిషనర్ కూడా అవి భూదాన్ భూములుగా పేర్కొనకపోవడంతో హైకోర్టు డివిజన్ బెంచ్ తాజా ఆదేశాలిచ్చింది. సింగిల్ జడ్డి ఆదేశాలు సవరించింది. అయితే సర్వే నెంబర్ 181, 182లపై సింగిల్ జడ్జీ ఆదేశాలు యథాతథంగా కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.

నాగారం భూములపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఐపీఎస్‌లు రవిగుప్త, తరుణ్‌జోషి, జితేందర్‌కుమార్‌ గోయల్‌ భార్య రేణుగోయల్, మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ భార్య జ్ఞానముద్ర తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. అధికారుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ… భూదాన్‌ భూములన్నీ 181, 182లో ఉన్నాయని, వాటిలో అవకతవకలు జరిగాయని, విచారణ జరిపించాలంటూ బీర్ల మల్లేశ్‌ పిటిషన్‌ దాఖలు చేశారని గుర్తు చేశారు. పిటిషనర్ ఎక్కడా ఐఏఎస్, ఐపీఎస్‌ తదితరులు కొనుగోలు చేసిన సర్వే నం.194, 195ల్లోని భూముల గురించి ప్రస్తావించలేదన్నారు. ఈ రెండు సర్వే నంబర్లలో ఉన్నవి పట్టా భూములేనని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం సింగిల్‌ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల నుంచి 194, 195 సర్వే నంబర్లను మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారుల ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉంది.