ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం తీర్పును గౌరవించాలి.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మానసం తీర్పును కొందరు వ్యతిరేకిస్తున్నారని, వారందరు కూడా తీర్పును స్వాగతించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కోన్నారు.

రిజర్వేషన్లను 15నుంచి 18శాతానికి పెంచేందుకు పోరాడాలి
విధాత, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మానసం తీర్పును కొందరు వ్యతిరేకిస్తున్నారని, వారందరు కూడా తీర్పును స్వాగతించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కోన్నారు. ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనంలో ఆరుగురు జడ్జిలు ఇచ్చిన తీర్పును మనమంతా గౌరవించాల్సివుందన్నారు. ఇంకా దీన్ని సాగదీయడం సరైంది కాదన్నారు. షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు నేడు 15శాతం మాత్రమే అమలవుతున్నాయని, వాస్తవంగా జనాభా ప్రాతిపదికన షెడ్యూల్డ్ కులాలకు 18 % రిజర్వేషన్లు లంభించాల్సివుందని, దాని కోసం కొట్లాడుదామన్నారు. ఆ 18శాతం రిజర్వేషన్ల సాధనతో మాల, మాదిగ తదితర ఉప కులాల జనాభా ప్రతిపాదికపైన ప్రయోజనం పొందేందుకు అందరం కలిసికట్టుగా పోరాడుదామన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపైన ప్రస్తుతమున్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను 15శాతం రిజర్వేషన్ నుంచి 18శాతం పెంచేందుకు అంతా కలిసి పోరాడుదామని, అందులో తాను ముందుండి పోరాడుతానన్నారు. ఇకముందు దళితులంతా ఐక్యంగా సాగి దళిత జాతి అభివృద్ధికి పనిచేద్దామని కోరారు.