నేను రూలర్ ని కాదు.. ప్రజాసేవకుడిని : సీఎం రేవంత్ రెడ్డి

ది హిందూ హడిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రూలర్ కాదని, ప్రజాసేవకుడినని పేర్కొంటూ ఉద్యోగాలు, రైతులు, మహిళల అభివృద్ధిపై వివరించారు.

తెలంగాణ గతంలో అధికారంలో ఉన్న వారికి రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు అవకాశమిస్తే వారు రూలర్ గా భావించుకున్నారని.. నేను మాత్రం సేవ చేయ‌డానికి వ‌చ్చిన ప్ర‌జా సేవకుడిగానే భావించుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బెంగళూరు ది హిందూ హడిల్ కార్యక్రమంలో.. ది హిందూ గ్రూప్ డైరెక్ట‌ర్ ఎన్‌.రామ్‌ ప్రశ్నలకు రేవంత్ రెడ్డి జవాబు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా సామాన్యుల స‌మ‌స్య‌లు ఏమిటో అర్ధం చేసుకున్నానని, ప్ర‌త్యేకించి యువ‌త‌, రైతు కూలీలు, మ‌హిళ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నానన్నారు. అధికారంలో ఉన్న వారు యువ‌త స‌మ‌స్య తెలుసుకోకుంటే క‌ష్టం.. అందుకే 1969 మొద‌టి ద‌శ తెలంగాణ ఉద్య‌మం ఉద్యోగాల కోసం జ‌రిగింది.. 2009లోనూ మళ్లీ తెలంగాణ ఉద్య‌మం అందుకే వ‌చ్చింది అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ‌లో ప్ర‌భుత్వరంగంలో 2 ల‌క్ష‌లు ఉద్యోగాలు తెలంగాణ‌లో ఖాళీగా ఉన్నాయి. గత సీఎం కేసీఆర్ ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేదు.. నేను పీసీసీ అధ్య‌క్షునిగా ఉన్న‌ప్పుడు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించానని.. పాద‌యాత్ర చేశా.. యువ‌త స‌మ‌స్య‌ను, వాళ్ల ఆవేద‌న‌ను అర్ధం చేసుకున్నానని చెప్పుకొచ్చారు.

యూపీఎస్సీ బాటలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ

గ‌తంలో ఒక ఆర్ఎంపీ డాక్ట‌ర్ తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ స‌భ్యుడిగా ఉన్నాడని, ఆయ‌న గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ చేస్తాడు.. ఇంజినీరు, డాక్ట‌ర్‌, ఇత‌ర నియామ‌కాలు చేసే వ్య‌క్తి ఓ ఆర్ఎంపీ డాక్ట‌ర్‌నా? తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ పున‌రావాస కేంద్రంగా ఉండ‌కూడ‌దు.. అందుకే నేను యూపీఎస్సీ ఛైర్మ‌న్‌, ఇత‌ర స‌భ్యుల‌ను క‌లిశా.. వాళ్ల‌తో చ‌ర్చించా. యూపీఎస్సీ ఎలా ప‌ని చేస్తుందో తెలుస‌కున్నాం. ఎటువంటి వివాదాలు లేకుండా నియామ‌క ప్ర‌క్రియ ఎలా చేప‌డ‌తారో తెలుసుకున్నా.. దాన్ని టీజీపీఎస్సీలో అమ‌లు చేశా…15 నెల‌ల్లో మేం 67,760 ఉద్యోగాలు ఇచ్చాం.. దేశంలోనే అత్యధిక సంఖ్య‌లో ఉద్యోగాలు ఇచ్చాం.. రెండు వారాల క్రితం నోటిఫికేష‌న్లు ఇచ్చాం… త్వ‌ర‌లోనే 5 వేల పోలీసు ఉద్యోగ నియామ‌కాల నోటిఫికేష‌న్ ఇవ్వ‌బోతున్నాం… మా యువ‌త ఇప్పుడు ఉద్యోగాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారని రేవంత్ రెడ్డి వివరించారు.

రైతాంగ సంక్షేమానికి ప్రాధాన్యతం

గ‌తంలో మ‌హారాష్ట్ర త‌ర్వాత తెలంగాణ‌లోనే ఎక్కువ సంఖ్య‌లో రైతు ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగేవి.. కార‌ణం అప్పులు.. నేను అధికారంలోకి వ‌చ్చాక 25,035 రైతు కుటుంబాల‌కు చెందిన రూ.20,616 కోట్ల రుణాల‌ను మాఫీ చేశా.. ఇది దేశంలోనే అత్య‌ధిక రుణ‌మాఫీ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2024-25 సంవ‌త్స‌రంలో రైతు ఆత్మ‌హ‌త్య‌లు లేని రాష్ట్రం తెలంగాణ అని ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. ఎన్‌సీఆర్‌బీ కేంద్ర ప్ర‌భుత్వ నివేదిక‌… రైతులు సంతోషంగా ఉన్నారు.. రైతులు ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎమ్మార్పీ) కోసం పోరాడారు.. నేను ఎమ్మార్పీ ఇవ్వ‌డంతో పాటు ధాన్యం రైతుల‌కు క్వింటాకు రూ.500 బోన‌స్ ఇచ్చాను.. పంట సేక‌ర‌ణ‌ను కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎమ్మార్పీ ప్ర‌క‌టించి చేతులు దులుపుకుంటోంది.. పంట ఉత్ప‌త్తుల సేక‌ర‌ణ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు.. ధాన్యం, మొక్క‌జొన్న‌తో పాటు ఇత‌ర పంట‌లు మేం సేక‌రిస్తున్నాం.. రైతు భ‌రోసా కింద ఎక‌రాకు రూ.12 వేలు ఇస్తున్నాం.. వాటిని రైతులు ఎరువులు, పెట్టుబ‌డికి ఉప‌యోగించుకుంటున్నారని వివరించారు.

మహిళా సాధికారికతకు ప్రోత్సాహం

మ‌హిళా సాధికారిత‌కు మేం కృషి చేస్తున్నామని..తెలంగాణ‌లోని స్వ‌యం సహాయ‌క సంఘాల్లో 67 ల‌క్ష‌లు మంది మ‌హిళ‌లున్నారు… సున్నా వ‌డ్డీతో 60 వేల కోట్ల రుణాలు తీసుకున్నారు.. ఆ వ‌డ్డీల‌ను మేం క‌డుతున్నాం. మ‌హిళా సంఘాలు 1000 బ‌స్సులు కొనుగోలు చేశారు.. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలోకి మా మ‌హిళా సంఘాలు వ‌చ్చాయి. వాళ్ల‌కు పెట్రోల్ బంక్‌లు ఇచ్చాం. సోలార్ ప్లాంట్లు ఇచ్చాం.. ప్ర‌తి ప్ర‌భుత్వ సంస్థ వ‌ద్ద మా మ‌హిళా సంఘాల స‌భ్యులు క్యాంటీన్లు న‌డుపుతున్నారు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో వ‌స‌తుల క‌ల్ప‌న మ‌హిళా సంఘాలకు అప్ప‌గించామని..ఆయా కార్యక్రమాలతో మహిళలు ఆర్థికంగా పురోగమిస్తున్నారన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఎన్‌.రామ్‌: దేశంలోనే అత్యంత వృద్ధి ఉన్న రాష్ట్రం తెలంగాణ‌.. 2034 నాటికి తెలంగాణ‌ను 1 ట్రిలియ‌న్ డాల‌ర్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా, 2047 నాటికి 3 ట్రిలియ‌న్ డాల‌ర్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా తెలంగాణ రైజింగ్ లో ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.. అది ఎలా సాధ్యం?

సీఎం రేవంత్ రెడ్డి: తెలంగాణ‌కు సంబంధించి మాకు సమ‌గ్ర‌మైన ప్ర‌ణాళిక ఉంది.. 160 కిలోమీట‌ర్ల ఔట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలోని న‌గ‌ర ప్రాంతాన్ని క్యూర్ (కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకానమీ), ఓఆర్ఆర్‌-ఆర్ఆర్ఆర్ మ‌ధ్య ప్రాంతాన్ని ప్యూర్ (పెరీ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ), ఆర్ఆర్ఆర్ వెలుప‌ల ప్రాంతాన్ని రేర్ (రూర‌ల్ అగ్రిక‌ల్చ‌రల్ రీజియ‌న్ ఎకాన‌మీ)గా పెట్టుకున్నాం. గ‌తేడాది డిసెంబ‌రు 7, 8,9 గ్లోబ‌ల్ స‌ద‌స్సు నిర్వ‌హించాం.. పాల‌సీ డాక్యుమెంట్ విడుద‌ల చేశాం. క్యూర్‌లో స‌ర్వీస్‌, ప్యూర్ లో మ్యానుఫ్యాక్చ‌ర్‌, రేర్‌లో అగ్రికల్చ‌ర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం.. క్యూర్‌ను నెట్ జీరో సిటీగా మార్చ‌నున్నాం.. పాల‌సీకి త‌గిన‌ట్లు ప్ర‌ణాళిక అమ‌లు చేస్తున్నాం.. ఏడాదికి రూ.2000 కోట్లు న‌ష్ట‌పోతున్నా మేం క్యూర్ ప‌రిధిలో ఈవీ వాహ‌నాల‌నే వాడాల‌ని నిర్ణ‌యించాం.. అందుకోసం ఈవీ వాహ‌నాల‌పై ట్యాక్స్ ఎత్తివేశాం. మెట్రో విస్త‌ర‌ణ చేప‌డుతున్నాం.. చెరువుల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి వాటి పున‌రుద్ధ‌ర‌ణ చేప‌డుతున్నాం. వాట‌ర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మిస్తున్నాం… ప్యూర్ పరిధిలో మ్యానుఫాక్చ‌ర్ రంగాన్ని ప్రోత్స‌హిస్తున్నాం. అని వివరించారు.

మేం 30 వేల ఎక‌రాల్లో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీని నిర్మిస్తున్నాం.. ఇక్క‌డ ఫార్చ్యున్ 500 కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేలా ఆహ్వానిస్తున్నాం.. మాది భూప‌రివేష్టిత రాష్ట్రం (ల్యాండ్ లాక్డ్ స్టేట్‌).. మాకు ఓడ రేవు లేదు.. అందుకే నేను ప్ర‌ధాన‌మంత్రి మోదీ, పొరుగు రాష్ట్రం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడ‌తో చ‌ర్చించి 12 వ‌రుస‌ల‌తో ర‌హ‌దారితో మ‌చిలీప‌ట్నం ఓడ‌రేవును అనుసంధానించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం.. రోడ్డు, రైలు, ఓడ‌రేవు, విమానాశ్ర‌యంతో అనుసంధానించే ప్ర‌య‌త్నం చేస్తున్నా.. అవే మా వృద్ధికి కార‌ణాల‌వుతాయి.. మా ద‌గ్గ‌ర ఐఎస్‌బీ, ట్రిఫుల్ ఐటీ, న‌ల్సార్ యూనివ‌ర్సిటీ ఉన్నాయి.. మేం విద్యా సంస్థ‌ల‌పై దృష్టిపెట్టాం. మాన‌వ వ‌న‌రుల ప్రాధాన్యాన్ని గుర్తించాం. ఏఐపై ఇప్పుడు మ‌న‌మంతా చ‌ర్చిస్తున్నాం.. ఏఐతో వైట్ కాల‌ర్ జాబ్‌లు పోతున్నాయి.. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేశాం.. ఇది ప్ర‌భుత్వ‌-ప్రైవేటు సంస్థ‌.. ఆనంద్ మ‌హీంద్రా స్కిల్స్ యూనివ‌ర్సిటీ ఛైర్మ‌న్‌, శ్రీ‌ని రాజు వైస్ ఛైర్మ‌న్‌.. అన్ని కార్పొరేట్ సంస్థ‌ల ప్ర‌తినిధులు డైరెక్ట‌ర్లు.. వాళ్లే సిల‌బ‌స్ రూపొందిస్తారు.. వాళ్లే ట్రైనింగ్ ఇస్తారు.. వాళ్లే ఉద్యోగాలు ఇస్తారు.. ప్ర‌భుత్వం కేవ‌లం ఫెసిలిటేట‌ర్‌.

మ‌నం 1950ల్లో ఐటీఐలు ఏర్పాటు చేశాం.. అందులో కాలం చెల్లిన కోర్సులు ఉన్నాయి.. వాటిలో ఇంకా అంబాసిడ‌ర్ కారు రిపేర్ న‌డుపుతున్నారు.. రిపేర్ చేయ‌డానికి అంబాసిడ‌ర్ కార్లు ఎక్క‌డ ఉన్నాయి.. ఇప్పుడు అన్నీ ఆడీ, బీఎండ‌బ్ల్యూ కార్లున్నాయి.. ఒకే ఒక్క కారు తెలంగాణ‌లో కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉంది. వాళ్ల ఎన్నిక‌ల గుర్తు అంబాసిడ‌ర్ కారు.. ఎవ‌రైనా అంబాసిడ‌ర్ కారు రిపేర్ చేయాలంటే ఫాంహౌస్‌కు వెళ్లాలి.. మేం ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు మార్చేశాం.. టాటా కంపెనీతో ఒప్పందం చేసుకొని మా ఐటీఐల‌ను ఏటీసీలుగా మార్చివేశాం.. ఇందుకు రూ.2,400 కోట్ల వ్య‌యం అవుతోంది. అందులో 86 శాతం టాటా కంపెనీ పెడుతోంది… మేం బ్లూ కాల‌ర్ జాబ్‌లు సృష్టిస్తున్నాం.. అందుకే నేను ఎక్కువ‌గా జ‌ర్మ‌న్‌, జ‌పాన్‌, సౌత్ కొరియా ప‌ర్య‌టించా.. వైట్ కాల‌ర్ జాబ్‌ల స్థానంలో బ్లూ కాల‌ర్ జాబ్‌లు ఉన్నాయి.. ఇప్పుడు ఐటీ ఇంజినీర్ క‌న్నా బ్లూ కాల‌ర్ జాబ్ చేసే వాళ్లు ఎక్కువ సంపాదిస్తున్నారు.. ఆయా దేశాల్లో ప‌ని చేసేలా జ‌ర్మ‌న్‌, జ‌పాన్, కొరియ‌న్‌ భాష‌లు నేర్పిస్తున్నాం అని తెలిపారు.

హైడ్రా’ అనేది హిట్లర్‌కు అత్యంత ఇష్టమైన పదం. ఎవరినైనా మట్టుబెట్టగల ఒక ప్రత్యేక బృందాన్ని ‘హైడ్రా’ అని పిలుస్తారు. నేను హిట్లర్ నుండి స్ఫూర్తి పొంది, దానికి ‘హైడ్రా’ అని పేరు పెట్టాను. అక్రమ కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తూ హైడ్రా కబ్జాదారుల్లో వణుకు పుట్టిస్తుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.అలాగే డ్రగ్స్ రహిత రాష్ట్ర నిర్మాణం కోసం ఈగల్ టీమ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

ఎన్‌.రామ్‌: కాంగ్రెస్ లోకి మీ ప్రయాణం ఎలా సాగింది?

రేవంత్ రెడ్డి: విద్యార్థిగా విద్యార్థి ప‌రిష‌త్‌లో ప‌ని చేశా.. త‌ర్వాత వ్యాపారం చేశా.. 2006 జులైలో ఇండిపెండెంట్‌గా జ‌డ్పీటీసీ స‌భ్యునిగా గెలిచా, 2007లో స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచా… త‌ర్వాత టీడీపీలో చేరాను. ప‌దేళ్లు చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి ప‌ని చేశా. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. రాష్ట్ర విభ‌జ‌న‌, స్థానిక కార‌ణాల‌తో నేను తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్య‌త్వానికి, తెదేపా స‌భ్య‌త్వానికి రాజీనామా చేశా… కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా బ‌ల‌మైన పోరాటం కావాల‌ని ప్ర‌జ‌లు భావించారు. దాంతో నేను టీడీపీకి రాజీనామా చేశా.. ఆ స‌మ‌యంలో నాకు ఎదుట ఎన్నో మార్గాలున్నాయి.. కానీ నేను కాంగ్రెస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. 60 ఏళ్ల తెలంగాణ ప్ర‌జ‌ల క‌ల‌ను సోనియా గాంధీ నెర‌వేర్చారు.. నేను చేరే స‌మ‌యంలోనే నా రాజ‌కీయ ప్ర‌స్థానానికి సంబంధించిన‌ అన్ని విష‌యాలు రాహుల్ గాంధీకి తెలియజేశానన్నారు.

2018 డిసెంబ‌రు ఎన్నిక‌ల్లో నేను ఓడిపోయా.. మూడు నెల‌ల త‌ర్వాత దేశంలోనే అతి పెద్ద‌ద‌యిన మ‌ల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచా. 36 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు అక్క‌డ ఉన్నారు. అతి పెద్ద‌ద‌యిన నియోజ‌క‌వ‌ర్గం. త‌ర్వాత నేను పీసీసీ అధ్య‌క్షుడుని, ముఖ్య‌మంత్రిని అయ్యాను. 2026 జులైతో నా ప్ర‌జా జీవితం 20 ఏళ్లు పూర్త‌వుతుంది. నా రాజ‌కీయ జీవిత‌మంతా ప్ర‌జ‌లు, సామాన్యుల కోసం పోరాడా.. నాకు ఎటువంటి రాజ‌కీయ నేప‌థ్యం లేదు.. ఎటువంటి మ‌ద్ద‌తు లేదు.. నేను వ్య‌వ‌సాయ కుటుంబం నుంచి వ‌చ్చా.. నా తండ్రి పోలీస్ ప‌టేల్‌.. మాది వ్య‌వ‌సాయ కుటుంబం.. క‌ష్టించే ప‌నిత‌త్వం… తెలంగాణ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వ‌చ్చానని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Latest News