C.M. REVANTH REDDY | రేష‌న్ కార్డు ఉంటేనే రైతు రుణ‌మాఫీ.. రేవంత్ స‌ర్కార్ కీల‌క మార్గ‌ద‌ర్శకాలు.. అవి ఏంటంటే..?

తెలంగాణలో భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసింది.

C.M. REVANTH REDDY | రేష‌న్ కార్డు ఉంటేనే రైతు రుణ‌మాఫీ.. రేవంత్ స‌ర్కార్ కీల‌క మార్గ‌ద‌ర్శకాలు.. అవి ఏంటంటే..?

రైతు రుణమాఫీ
కుటుంబానికి 2 లక్షలు
రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ వర్తింపు
రైతు రుణమాఫీ మార్గదర్శకాల విడుదల
తెలుగులో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఇబ్బందుల పరిష్కారానికి ఐటీ పోర్టల్‌
మండల స్థాయిలో సహాయ కేంద్రాలు కూడా
రుణమాఫీకి 2023, డిసెంబర్ 9 కటాఫ్‌ తేదీ
అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో నేరుగా జమ

విధాత: తెలంగాణలో భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులందరూ సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాలను నిర్ధారించి, రైతు రుణమాఫీని అమలుచేయనున్నట్లు ప్రభుత్వం తన మార్గదర్శకాలలో స్పష్టం చేసింది. తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక స్థితిని గమనంలోకి తీసుకొని వ్యవసాయ కార్యకలాపాలు స్థిరంగా కొనసాగేలా చూడానికి వీలుగా రాష్ట్రంలో రైతుల కోసం పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలుచేస్తున్నట్లు ప్రకటించింది. రైతులు తమ ఇబ్బందులను ఐటీ పోర్టల్‌లో కానీ, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల వద్ద కానీ తెలియజేయాలని తెలిపింది. రైతులు ఇచ్చే ప్రతి అభ్యర్థనను అధికారులు 30 రోజులలోపు పరిష్కరించి, దరఖాస్తు దారునికి తెలియజేస్తారని విధివిధానాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

మార్గదర్శకాలు ఇలా…

-తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు పంట రుణం మాఫీ వర్తిస్తుంది.
– ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుంది.
– రాష్ట్రంలోని సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
– రుణమాఫీకి 2023 డిసెంబర్9ని కటాఫ్‌ తేదీగా నిర్ణయించింది. డిసెంబర్ 12, 2018 నుంచి తీసుకున్న రుణాలు, రెన్యువల్ అయిన రుణాలకు కూడా రుణమాఫీ పథకం వర్తిస్తుందని తెలిపింది.
– ప్రతి రైతు కుటుంబం రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీకి 2023 డిసెంబర్ 9వ తేదీ నాటికి వరకు ఉన్న అసలు, వడ్డీకి మొత్తానికి అర్హత ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
– రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి రేషన్ కార్డు డేటా బేస్ ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

పథకం అమలుకు ఏర్పాట్లు ఇలా..

– పంటల రుణమాఫీ పథకాన్ని అమలు చేసే అధికారిగా వ్యవసాయ శాఖ కమిషన్ సంచాలకులు వ్యవహరిస్తారు.
– ఈ పథకానికి ఎన్ఐసీ సాంకేతిక బాధ్యతలు నిర్వహిస్తుంది. రైతు రుణమాఫీ అమలు కోసం ప్రత్యేక ఐటీ పోర్టల్ నిర్వహిస్తారు.
– ఐటీ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్, డేటా సేకరణ, డేటా వాలిడేషన్‌తోపాటు అర్హతను నిర్వహించే వీలు ఉంటుంది.
– రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఉంటాయి.
– ప్రతి బ్యాంకు ఒక బ్యాంకు అధికారిని నోడల్‌ అధికారిగా నియమించాలి.
– ప్రతి బ్యాంకు సీబీఎస్ నుంచి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి.
– లబ్ధిదారుల రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోకి ఆధార్‌ను పాస్ బుక్ డేటా బేస్‌లో ఉన్న ఆధార్‌తో, పీడీఎస్ డేటా బేస్‌లో ఉన్న ఆధార్‌తో మ్యాప్ చేయాలి.
– అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల రుణ ఖాతాలకు జమ చేస్తారు.
– రుణమాఫీ ఆరోహణ క్రమంలో అమలు చేస్తారు.
– రెండు లక్షలకు పైన ఉన్న రుణాన్ని రైతులు మొదట బ్యాంకులో చెల్లించాలి. ఆ తరువాత అర్హత కలిగిన రూ.2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు.
– మొదట మహిళ పేరున ఉన్న రుణాన్ని మాఫీ చేసి, ఆ తరువాత ఇతర కుటుంబ సభ్యుల రుణమొత్తాన్ని దామాషా పద్ధతిలో మాఫీ చేస్తారు.

– మినహాయింపులు ఇవి

– ఎస్‌హెచ్‌జీలు, జేఎల్‌జీలు, ఆర్‌ఎంజీలు, ఎల్‌ఈసీఎస్‌ల రుణాలకు మాఫీ వర్తించదు.
– పునర్వ్యవస్థీకరించిన, రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు.
– కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు మాఫీ వర్తించదు. కానీ పీఏసీఎస్‌ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తిస్తుంది.
– కేంద్రం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా మేరకు ఆచరణాత్మకంగా అమలు చేయడానికి వీలైనంత మేరకు పరిగణలోకి తీసుకుంటారు.
– రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించినా, మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు గుర్తించినా, రుణమాఫీకి అర్హులు కాదని గుర్తించినా రుణమాఫీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.