HARISH RAO | రుణమాఫీపై రైతులను, దేవుళ్లను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
రైతు రుణమాఫీ ఆగస్టు 15వరకు పూర్తి చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయకుండా రైతులను, దేవుళ్లపై ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పి వారిని కూడా మోసం చేసిన పాపాత్ముడు రేవంత్‌రెడ్డి అని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు

ఒట్లు పెట్టిన పాపాత్ముడిని క్షమించాలనే యాదగిరిగుట్టలో పూజలు
రుణమాఫీ పూర్తి కానందునా రేవంత్‌రెడ్డినే రాజీనామా చేయాలి
మాజీ మంత్రి టి.హరీశ్‌రావు
విధాత : రైతు రుణమాఫీ ఆగస్టు 15వరకు పూర్తి చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయకుండా రైతులను, దేవుళ్లపై ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పి వారిని కూడా మోసం చేసిన పాపాత్ముడు రేవంత్‌రెడ్డి అని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. హరీశ్‌రావు గురువారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహాస్వామిని దర్శించుకుని సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెట్టి రుణమాఫీపై మాట తప్పినందుకు ఆ పాపాత్ముడిని క్షమించాలంటూ పరిహార పూజలు చేశారు. తెలంగాణ ప్రజలపై స్వామి దయ ఉంచాలని, రైతులందరికి రుణ విముక్తి కావాలని వేడుకున్నానని ఈ సందర్భంగా హరీశ్‌రావు చెప్పారు. అనంతరం ఆలేరుకు వెళ్లి బీఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రులు రుణమాఫీపై తలోమాట లెక్కలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా 17 లక్షల మందికి మాఫీ చేయాల్సి ఉందని మంత్రి ఉత్తమ్ అన్నారన్నారు. రుణమాఫీ ఇంకా పూర్తికాలేదని పొంగులేటి అంటున్నారని చెప్పారు. రుణమాఫీకి మరో రూ.12 వేల కోట్లు ఇంకా ఇవ్వాలని అంటున్నారని వెల్లడించారు. భట్టి విక్రమార్క ఓ సారి 31వేల కోట్లు అని, బ్యాంకర్ల సమావేశంలో 7,500కోట్లని చెప్పాడని గుర్తు చేశారు. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేయాలని మంత్రి తుమ్మల చెప్పారని, ఇప్పటివరకు 22 లక్షల మందికి రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశామన్నారని, తుమ్మల లెక్కల ప్రకారం 42 లక్షల మంది రైతులకుగాను 22 లక్షల మందికే మాఫీ అయ్యిందని, అంటే ఇప్పటివరకు 45 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని హరీశ్‌రావు వెల్లడించారు. ఇంకా 54 శాతం మంది రైతులకు మాఫీ డబ్బు బ్యాంకుల్లో జమచేయాలని, మరి మంత్రుల లెక్కల ప్రకారం రాజీనామా ఎవరు చేయాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని నీతి, నిజాయితీ ఉంటే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15వ కల్లా రుణమాఫీ పూర్తి చేయనందునా ఆయనే రాజీనామా చేయాలన్నారు.
రేవంత్‌రెడ్డి ప్రాయశ్చిత్త చేసుకోవాలి
రుణమాఫీపై ఏ దేవుళ్లపై ఒట్లు పెట్టారో ఆ దేవుళ్ల వద్దకు వెళ్లి రేవంత్ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తాను తెలంగాణ కోసం మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, రాజీనామాలు నాకు కొత్తకాదన్నారు. పాలకుడు పాపం చేస్తే ప్రజలకు అరిష్టం అని బ్రాహ్మణోత్తములు చెప్పారని, అందుకే ప్రజలకు అరిష్టం కలుగకుండా పాపం చేసిన సీఎంను క్షమించాలని లక్ష్మీనరసంహస్వామిని మొక్కుకున్నానని తెలిపారు.. ప్రజలను రక్షించాలని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని వేడుకున్నాని చెప్పారు. రైతులందరికి రుణమాఫీ, పంటల బోనస్ ఇచ్చేంత వరకూ పోరాడే శక్తిని ఇవ్వాలని వేడుకున్నానన్నారు.
సీఎం సొంతూరులో రుణమాఫీ సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యం చేశారని విమర్శించారు. రేవంత్ సర్కార్ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామన్నారు. కేసులు, బెదిరింపులతో రైతుల ఆగ్రహాన్ని ఆపలేరన్నారు. ప్రజారాజ్యమని రేవంత్ గప్పాలు కొట్టారని, రైతులు తమ బాధలు చెప్పుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. అందరికి రుణమాఫీ చేసేవరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని స్పష్టం చేశారు. పోలీసులు చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వానికి కొమ్ముకాయొద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు వెంట ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, బూడిద బిక్షమయ్య తదితరులు ఉన్నారు`