కోటి విలువైన చీరల లారీలు స్వాధీనం

- బాచుపల్లి ప్రగతి నగర్‌లో డంపింగ్‌కు యత్నం
విధాత : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ధి ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేస్తున్న తాయిలాలు భారీగా పట్టుబడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. బుధవారం బాచుపల్లి ప్రగతి నగర్ పంచవటి అపార్ట్ మెంట్‌కు తెల్లవారుజామున చేరుకున్న చీరల లోడ్‌తో ఉన్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు.
వరంగల్ నుంచి చీరల లోడ్‌తో వచ్చిన ఈ లారీల నుంచి అపార్ట్‌మెంట్ గదుల్లో చీరలను డంపింగ్ చేస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. చీరల లోడ్ విలువ సుమారు కోటి రూపాయలుగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఆ చీరలను ఎవరి కోసం తరలిస్తున్నారన్న దానిపై విచారణ చేస్తున్నారు.
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్ధి తరుపున పంపిణీ కోసం ఈ చీరలను తెప్పించినట్లుగా తెలుస్తున్నది. చీరల లోడ్ లారీలను బాచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి బుధవారం ఉదయం వరకు తనిఖీల్లో పట్టుబడిన నగదు, బంగారం, వస్తువుల విలువ ఏకంగా 101కోట్లు కావడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ లెక్కన రానున్న రోజుల్లో ఇంకేంత భారీగా ఎన్నికల నజరానాలు, నగదు పట్టుబడుతుందోనన్న అంచనాలతో తనిఖీలను మరింత ముమ్మరం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నది.