Andole: సత్తా చాటిన.. అందోల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

Andole: సత్తా చాటిన.. అందోల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

అందోల్: తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌కి చెందిన ముగ్గురు విద్యార్థులు మండలంలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు. అందోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణత సాధించడంతో పాఠశాలలో సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థుల్లో మునాజ్జా బేగం 583 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, ఎన్. అఖిల 560 మార్కులతో ద్వితీయ, పి. సాయిచరణ్ 557 మార్కులతో తృతీయ స్థానం సాధించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. దేవిదాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల, నిరంతర కృషి ఫలితంగానే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారికి సహకరించిన ఉపాధ్యాయ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం పాఠశాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. అందోల్ జెడ్పీహెచ్ఎస్ నుంచి మొత్తం 75 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణత సాధించడం విశేషం. అంతేకాకుండా ఒక విద్యార్థిని అత్యధికంగా A1 గ్రేడ్ సాధించారు. ఈ విజయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.