Siddipet : ప్లీజ్ సార్ ఈ హెడ్‌మాస్టర్ మాకొద్దు..ఎంఈఓకు విద్యార్థుల ఫిర్యాదు

సిద్దిపేటలో విద్యార్థులు హెడ్‌మాస్టర్ చేత కొట్టింపులు, బూతలతో వేధింపులపై ఎంఈఓకు కన్నీళ్లతో ఫిర్యాదు చేశారు. “మేడం మాకొద్దు సార్” అంటూ చిన్నారులు వేడుకున్నారు.

Siddipet : ప్లీజ్ సార్ ఈ హెడ్‌మాస్టర్ మాకొద్దు..ఎంఈఓకు విద్యార్థుల ఫిర్యాదు

విధాత, హైదరాబాద్ : చదువు చెప్పాల్సిన హెడ్‌మాస్టర్ కొడుతూ బూతులు తిడుతుందని ఎంఈఓ కు విద్యార్థులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్లీజ్ సార్ ఈ హెడ్ మాస్టర్ మాకొద్దు అని ఆ చిన్నారులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో గురువారం జరిగింది. ఎంఈఓ బచ్చలి సత్తయ్య పాఠశాల సందర్శనలో భాగంగా ఐదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఎంఈఓకు వారి బాధను వివరించారు. ‘హెడ్‌మాస్టర్ సరళ కుమారి మేడం మాకు వద్దు సార్.. ఇష్టం వచ్చినట్టు చేతిమట్టల మీద కొడుతుంది. బూతులు తిడుతుంది. కర్రలతో మమ్మల్ని కొడుతుంది’ అని విద్యార్థులు ఎంఈఓకు గోడును వెల్లబోసుకున్నారు.

హెడ్‌మాస్టర్ కొట్టడంతో తమ ఒంటిమీద ఉన్న గాయాలను కూడా చూపించారు. కనీసం ఇంటర్వెల్ సమయంలో గంట కూడా కొట్టనివ్వదు అని చెప్పారు. దీంతో దుస్తుల్లోనే మూత్ర విసర్జన పోసుకుంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. క్లాస్ రూమ్ లో పాఠాలు బోధించాల్సింది పోయి బయట వరండాలో చెప్పడంతో తమకు పాఠాలు అర్థం కావడం లేదని.. ఈ విషయం ఆమెకు చెబితే బూతులు తిడుతూ.. కొడుతుందని తమ పరిస్థితిని విద్యార్థులు ఏడ్చుకుంటూ ఎంఈఓకు ఫిర్యాదు చేశారు.