పీసీసీ పీఠంపై ఎవరు? పోటీ పడుతున్న సీనియర్‌ నేతలు

లోక్‌సభ ఎన్నికల పర్వం ముగుస్తోంది. జూన్‌ 4 తరువాత రాష్ట్రంలో అనేక మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ మార్పులు చేయాలన్న దిశగా కాంగ్రెస్‌ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

పీసీసీ పీఠంపై ఎవరు? పోటీ పడుతున్న సీనియర్‌ నేతలు

మంత్రి పదవి వదులుకుంటేనే పీసీసీ!
ఒకరికి ఒకే పదవి సూత్రం అమల్లోకి?
రేసులో మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, జగ్గారెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి, అద్దంకి
తెరపైకి మంత్రి ధనసరి సీతక్క పేరు..
తనకు ఆసక్తి లేదంటున్న మంత్రి
పీసీసీతోపాటు మంత్రివర్గ విస్తరణ!

విధాత: లోక్‌సభ ఎన్నికల పర్వం ముగుస్తోంది. జూన్‌ 4 తరువాత రాష్ట్రంలో అనేక మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ మార్పులు చేయాలన్న దిశగా కాంగ్రెస్‌ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా జూన్‌ 21వ తేదీ నాటికి రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది. కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో పీసీసీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌ రెడ్డి పార్టీలోని గ్రూపులను అధిగమించి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. దీంతో రేవంత్‌రెడ్డి సూచించిన వారినే అధిష్ఠానం పీసీసీ అధ్యక్షుడిని చేస్తుందన్న చర్చ గాంధీ భవన్‌లో జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పొందిన నాయకులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పీసీసీ పీఠాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా పీసీసీని ఆశిస్తున్న వారిలో మధుయాష్కీ గౌడ్‌, జగ్గారెడ్డి, సంపత్‌ కుమార్‌, అద్దంకి దయాకర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్కమార్క కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే దేశంలో ఇంకా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏఐసీసీ అధిష్ఠానం పీసీసీతోపాటు మంత్రివర్గ విస్తరణపై కూడా దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఎన్నికల తరువాత రాష్ట్ర వ్యవహారాలపై ఏఐసీసీ కేంద్రీకరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇది ఇలా ఉండగా పీసీసీ బాధ్యతల విషయంలో ఆదివాసీ మహిళ, సీనియర్‌ నాయకురాలు మంత్రి సీతక్క పేరును పరిశీలిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే దేశంలోనే మొదటిసారిగా సమక్క జాతికి చెందిన కోయ మహిళకు జనరల్ కేటగిరిలో మంత్రి పదవి వచ్చింది. ఆమె పోరాటాన్ని గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం జనరల్‌ కేటగిరిలో మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది.

ఎన్నికల అనంతరం కసరత్తు!

ఎన్నికల తరువాత పీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపికతోపాటు.. మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. ఈ సమయంలో ఒకరికి ఒకే పదవి అన్న సూత్రాన్ని అమలు చేయాలన్న నిర్ణయంతో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న వారు ఎవరైనా పీసీసీ చీఫ్‌ కావాలని కోరుకుంటే మంత్రి పదవిని వదులు కోవాల్సి వస్తుంది. ఇలా పీసీసీ చీఫ్‌ కావాలని కోరుకుంటున్న వారిలో డిప్యూటీ సీఎం ఉన్నారన్న ప్రచారం ఉంది. కానీ భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం హోదాను వదులుకోవడానికి సిద్ధపడతారా? అన్న ప్రశ్న తలెత్తుతున్నది. సీతక్కకు సైతం ఇదే పరిస్థితి ఎదురవుతుంది.

అయితే సీఎం రేవంత్‌రెడ్డికి ఆడ బిడ్డగా అత్యంత నమ్మకంగా కష్ట కాలాల నుంచి నిలబడిన సీతక్కను మంత్రి పదవిలోనే కొనసాగించడానికి మొగ్గు చూపుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాగా సీతక్కకు పీసీసీపై ఇంట్రెస్ట్‌ లేదని, ఇచ్చిన మంత్రి పదవితో సంతృప్తిగా ఉన్నారని ఆమె సన్నిహితులు చెపుతున్నారు. ఇది ఇలా ఉండగా సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే అద్దంకి దయాకర్‌కు మంచి పదవి ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆశావహులు ఇప్పటి నుంచే అధిష్ఠానం పెద్దల అనుగ్రహం పొందడానికి ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. అగ్ర నాయకులు ఎక్కడ ప్రచారానికి వెళితే అక్కడ వాలిపోతున్నారని టాక్‌.

మంత్రి వర్గ విస్తరణపై ఫోకస్‌

రాష్ట్ర కేబినెట్‌లో ప్రస్తుతం సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మొత్తం 12 మంది ఉన్నారు. పూర్తి స్థాయిలో మంత్రి వర్గం కొలువు దీరడానికి మరో ఆరుగురు మంత్రులను రేవంత్‌ రెడ్డి నియమించుకోవడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంపై ఆశావహుల నుంచి పోటీ ఎక్కువైంది. కాగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం కూర్పులో ఆయా సామాజిక వర్గాలు ఉండేలా చూసుకోనున్నారు. ఈ మేరకు ఇప్పటికే లోక్‌ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజ్‌లకు మంత్రి పదవి ఇస్తానని ప్ర కటించారు. ముదిరాజ్‌లతో పాటు మైనార్టీ, బీసీ, లంబాడీ వర్గాలకు అవకాశం కల్పించాల్సి ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. ఇది కాకుండా ఉమ్మడి నిజామాబాద్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు మంత్రి వర్గంలో స్థానం లభించలేదు.

ఈసారి మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణలతోపాటు జిల్లాల ప్రాతినిధ్యం కూడా కీలకం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో మంత్ర వర్గంలో ముదిరాజ్‌ సామాజిక వర్గం నుంచి మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి బెర్త్‌ దక్కే అవకాశం ఉందన్న చర్చ పార్టీ నాయకుల్లో జరుగుతోంది. కాగా నిజమాబాద్‌ నుంచి సుదర్శన్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, రంగారెడ్డి జిల్లా నుంచి రామ్మోహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో పాటు షబ్బీర్‌ అలీ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే మంత్రులుగా ఉన్న భట్టి విక్రమార్క, సీతక్కతలలో ఎవరో ఒకరిని పీసీసీ అధ్యక్షులుగా నియమిస్తే ఆ స్థానాన్ని కూడా మరొకరితో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సామాజిక వర్గీకరణలతో పాటు, సమర్థత, ప్రజలలో ఉన్న పేరు ప్రతిష్ఠలను పరిశీలించి అధిష్ఠానం నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీలో చర్చ జరుగుతోంది.