సిక్కిం వరదల్లో తెలుగు నటి సరళ కుమారి గల్లంతు..! ఆచూకీ కనిపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి కుమార్తె విజ్ఞప్తి
విధాత: ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. వరదల్లో పలువురు మృతి చెందగా.. మరికొందరు గల్లంతయ్యారు. అయితే, సిక్కిం పర్యటనకు వెళ్లిన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అలనాటి హీరోయిన్ సరళ కుమారి మిస్సయ్యారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె తెలిపారు. ఆమె ఆచూకీని కనిపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సరళకుమారి 1983లో మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ, సంఘర్షణ తదితర చిత్రాల్లో నటించారు. సినిమాలకు దూరంగా ఉంటున్న సరళ కుమారి ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 2న పలువురితో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. పర్యటనకు సంబంధించి తన కూతురు నబితకు సమాచారం అందించారు.
సిక్కిం చేరిన తర్వాత స్థానిక హోటల్ బస చేసినట్లు సమాచారం ఇచ్చారని తెలిపారు. 3న చివరిసారిగా తల్లి సరళ కుమారితో మాట్లాడనని, ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు. ఆ తర్వాత సిక్కింలో వరదల సమాచారం తెలిసిందని, ఆర్మీ హాట్‌లైన్ నంబర్లకు సంప్రదించినా అవి పని చేయడం లేదని వాపోయారు. తన తల్లి ఆచూకీ కనిపెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
సిక్కింలోని లొనాక్ సరస్సులో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షాపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు, సరస్సులు పోటెత్తాయి. లాంచెన్ లోయలోని తీస్తా నదిలో వరద ఉధృతి భారీగా పెరగడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో ఇప్పటి వరకు 53 మంది ప్రాణాలు కోల్పోయారు. 142 మంది వరకు గల్లంతయ్యారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram