ఆరు గ్యారంటీలే కాంగ్రెస్ ఆయుధాలు: కంది శ్రీనివాసరెడ్డి

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలే పార్టీని గెలిపించే ఆయుధాలని ఆదిలాబాద్ అసెంబ్లీ అభ్యర్థి కంది కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. కందికి టికెట్ ఖరారుకావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు పెద్దఎత్తున అభినందనలు తెలియజేశారు. నియోజకవర్గం నలుమూలల నుండి తరలివచ్చి కేఎస్ఆర్‌కు బోకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన జనంతో ప్రజాసేవా భవన్ సందడిగా మారింది. కోలాహల వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అందరి ఆశీర్వాదంతోనే తనకు టికెట్ వచ్చిందని, ప్రతి కార్యకర్తలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ బలం, బలగం ముందు అధికార బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న అన్యాయాన్ని, అహంకారాన్ని అణచాలంటే అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ గ్యారంటీ హామీలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. అమెరికా నుండి ఆదిలాబాద్‌కు సేవ చేయాలని వచ్చిన తనను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుందని, ఆదుకున్నదని అన్నారు. పార్టీని కన్నతల్లిలా కాపాడుకుందామని తెలిపారు. జోగు రామన్న, పాయల శంకర్ ల ఓటమి ప్రజల చేతుల్లోనే ఉందన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరిన పలువురికి కండువాలు కప్పి ఆయన సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మెన్ ముడుపు దామోదర్‌రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, ఎస్టీ సెల్ చైర్మన్ షెడ్మకి ఆనంద్‌రావు, నాయకులు ఐనేని సంతోష్‌రావు, డేరా కృష్ణారెడ్డి, ఎంఏ షకీల్, కొండూరి రవి, మానే శంకర్, మీరాబాయి, తిరుమల్ రెడ్డి, బూర్ల శంకర్, అన్నెల శంకర్, రాజా లింగన్న, ముఖీమ్, కర్మ, అస్బాత్ ఖాన్, అంజద్ ఖాన్, హరీష్‌రెడ్డి, మహమూద్, యాసం రాము, ఆశారెడ్డి, కిష్టారెడ్డి, సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.