రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి ఈనెల 24న బంగాళాఖాతంలో వాయు గుండంగా బలపడే అవకాశముందని తెలిపారు
విధాత, హైదరాబాద్ : రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి ఈనెల 24న బంగాళాఖాతంలో వాయు గుండంగా బలపడే అవకాశముందని తెలిపారు. అయితే వాయుగుండం ఏపీపై ప్రభావం చూపదని అధికారులు వెల్లడించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశలున్నాయి తెలిపారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
జూన్ మొదటి వారంలోనే తెలంగాణకు నైరుతి రుతు పవనాలు
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు జూన్ మొదటివారంలో ప్రవేశించనున్నాయి. ఈ నెలఖారున కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం అయిదారు రోజుల సమయం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణకు 5-8 తేదీల మధ్య పవనాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తుంది. కొంత ఆలస్యమైనా జూన్ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు.
గతేడాది కేరళకు జూన్ 11న రాగా, తెలంగాణలో 20వ తేదీన చేరాయి. నైరుతి రుతుపవన గమనం ఆశాజనకంగా ఉందని జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయన్న అంచనాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్త శ్రావణి వివరించారు. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతువపనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలున్నాయని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram