Supreme Court| ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు..నేటితో ముగియనున్న సుప్రీం గడువు!

కాంగ్రెస్ లో చేరిన 10మంది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఇచ్చిన గడువు నేటీతో ముగిసిపోనుంది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Supreme Court| ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు..నేటితో ముగియనున్న సుప్రీం గడువు!

విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ లో చేరిన 10మంది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల(Disqualification of MLAs) కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్(Speaker)కు ఇచ్చిన మూడు నెలల గడువు(three-month deadline) నేటీతో ముగిసిపోనుంది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు జూలై 31న కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మూడు నెలల లోపు అసెంబ్లీ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తీర్పు వెలువరించిన సందర్భంగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్‎లో ఉంచడం సరికాదని.. ఆలస్యం జరిగే కొద్ది ఫిరాయింపుదారులు ప్రయోజనం పొందుతారని.. ఇలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని ధర్మాసనం హాట్ కామెంట్స్ చేసింది. పార్టీ ఫిరాయింపుల చట్టంపై పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

ఈ కేసులో అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు స్పీకర్ కు నిర్ధేశించిన గడువు శుక్రవారంతో ముగియ్యనుంది. దీంతో మరో రెండు నెలల గడువు ఇవ్వాలని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ కార్యాలయం సుప్రీంకోర్టును కోరింది. నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయిందని.. అంతర్జాతీయ సదస్సులు ఉండటంతో గడువు సరిపోలేదని సుప్రీంకోర్టుకు తెలిపింది.

నలుగురు ఎమ్మెల్యేల విచారణ

ఫిరాయింపు అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ (ఖైరతాబాద్), ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), కాలే యాదయ్య (చేవెళ్ల), సంజయ్ కుమార్ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల) ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. 10మంది ఎమ్మెల్యేలకు, ఫిర్యాదుదారులైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు విచారణ నోటీసులు జారీ చేశారు. వారిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు సమాధానమిచ్చారు. అలాగే ఇరువర్గాలు స్పీకర్ ముందు మౌఖిక వాదనలు వినిపించాయి. ఇరువర్గాలు కూడా తమ వాదనలకు మద్దతుగా ఆధారాలు, అఫిడవిట్లు స్పీకర్ కి అందజేశారు. ఈ క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ ల మాత్రమే ఇప్పటిదాక రెండు దఫాలుగా విచారించారు. మిగతా 6 మంది విచారణకు ఇంకా స్పీకర్ షెడ్యూల్ కూడా విడుదల చేయలేదు. మిగతా ఎమ్మెల్యేల విచారణకు 8 వారాల సమయం కావాలని స్పీకర్ సుప్రీం కోర్టును అభ్యర్థించడం గమనార్హం.