• Telugu News
  • /Telangana

Mattaiah Vote For Note Case | ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు.. మత్తయ్య పేరును క్వాష్ చేసిన హైకోర్టు నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఏసీబీ పిటిషన్‌ను కొట్టివేసింది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Sep 26, 2025, 12:42 pm IST
Read Time: 4 mins
Mattaiah Vote For Note Case | ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య పేరును తెలంగాణ హైకోర్టు క్వాష్ చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషన్ ను విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టిపారేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేం అని..మత్తయ్య పేరును కేసులో క్వాష్ చేయడానికి తగు కారణాలు ఉన్నాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 22న ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పు వెల్లడించింది. సుప్రీం తీర్పుతో మత్తయ్యకు కేసులో ఊరట దక్కింది.

2016లో సుప్రీంకోర్టులో పిటిషన్

ఓటుకు నోటు కేసుకు సంబంధించి జరూసలేం మత్తయ్యపై 2016లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. ఈ ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏసీబీ 2016 జులై 6వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది మేనకా గురుస్వామి వాదనలు వినిపించారు. ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్‌, ఏ4 మత్తయ్యలు దాదాపుగా ఇరవై సార్లు ఫోన్లలో సంభాషించుకున్నారని కోర్టుకు తెలిపారు. దానిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఏంతైనా ఉందని అన్నారు. మత్తయ్యను విచారించాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు కేసును కొట్టివేసిందని వాదించారు.

ప్రభుత్వ వాదనను మత్తయ్య తరఫు న్యాయవాది ఖండించారు. ఆయన క్రైం సీన్‌లో లేరని, కేసులో ఇరికించారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును సమర్ధించింది. తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టి పారేసింది.