Swarnalatha Rangam Bhavishyavani 2024 | వర్షాలు సమృద్ధి.. పంటలు పుష్కలం.. భవిష్యవాణిలో స్వర్ణలత
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల వేడుకలో భాగంగా ఆనవాయితీగా కొనసాగే రంగం కార్యక్రమంలో పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు

ప్రజలను చల్లగా చూస్తానని భరోసా
విధాత, హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల వేడుకలో భాగంగా ఆనవాయితీగా కొనసాగే రంగం కార్యక్రమంలో పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని తెలిపారు. వ్యాధులు రాకుండా ప్రజలను కాపాడతానన్నారు. ప్రజలను చల్లగా చూస్తానని చెప్పారు. మట్టి బోనమైనా, స్వర్ణ బోనమైనా.. ఎవరు తీసుకొచ్చినా తాను సంతోషంగా అందుకుంటానని చెప్పారు. పిల్లలు, పెద్దలు, జంతువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటానన్నారు.
నేను సంతోషంగా ఉండటానికి చల్లని శాక పెడుతున్నారని, ఈసారి కూడా 5 వారాలు పప్పు బెల్లాలతో శాక పెట్టండని సూచించారు. పాడి పంటలు గతంలో లాగా పండించడం లేదు రసాయనాలు ఎక్కువ వాడుతున్నారని, అందుకే అనారోగ్యాల పాలవుతున్నారని, రసాయనాలు తగ్గించుకుంటే మీకు వ్యాధులు తగ్గుతాయని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఎవరెన్ని ఆటంకాలు పెట్టిన నా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ రంగం కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారిలు హాజరయ్యారు.