ఎన్నికల్లో పోటీకి దూరంగా టీడీపీ
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండనుంది. ఆపార్టీ అధిష్టానం అభ్యర్థులను బరిలో దింపేందుకు నిరాకరించింది

విధాత, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండనుంది. ఆపార్టీ అధిష్టానం అభ్యర్థులను బరిలో దింపేందుకు నిరాకరించింది. అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉండడం, ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలపై పార్టీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించడం కష్టసాధ్యంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే తెలంగాణ ఎన్నికల్లో ఈ దఫా పసుపు జెండా కానరాకుండా పోనుంది.
అయితే ఇతర పార్టీలకూ మద్దతుపైనా ఆపార్టీ నేతలు స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శనివారం చంద్రబాబును జైలులో ములాఖత్ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే తెలంగాణ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ప్రకటనపై చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు వివరించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాసాని జ్ఞానేశ్వర్ ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి అధిష్టానం నిరాకరించినట్లు చెప్పారు. ఈ నిర్ణయంపై టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో పోటీకి దిగాల్సిందే అంటూ పట్టుబట్టారు. భావోద్వేగానికి గురైన కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ నేతల అభిప్రాయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.