BC Reservations : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
బీసీ బిల్లు దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని, బ్యాక్‌వర్డ్ క్లాస్ అంటే సొసైటీకి బ్యాక్ బోన్ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్ పెంచుతూ బిల్లును ప్రతిపాదించామన్నారు.

BC Reservations : రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల పెంపుకోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. ఇవాళ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బిల్లును ప్రవేశపెట్టారు. అన్ని పార్టీల సభ్యుల చర్చ తరువాత సోమవారం రాత్రి 7.30 గంటలకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానం ప్రకారం విద్య, ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ 42 శాతానికి పెరగనున్నది. స్థానిక సంస్థల్లో కూడా 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చర్చ సందర్భంగా మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేందుకు ప్రధాన రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేశారు. ఎఐసీసీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ అప్పాయింట్ మెంట్ తాను తీసుకుంటానని, ప్రధాని నరేంద్ర మోదీ అప్పాయింట్ మెంటు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఇప్పించాలని ఆయన కోరారు. వివాదాలకు తావు లేకుండా బీసీలకు న్యాయం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తమతో కలిసి రావాలని కోరారు. కుల గణన సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 56.36 శాతం బీసీలు ఉన్నారని, వారి కోసమే కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ చేశామని వివరించారు.ఈ ఏడాది ఫిబ్రవరి 4న సర్వే పూర్తయినందుకన ఈ రోజును సోషల్ జస్టిస్ డే గా జరుపుకుందామన్నారు.
బీసీ బిల్లు దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని, బ్యాక్‌వర్డ్ క్లాస్ అంటే సొసైటీకి బ్యాక్ బోన్ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్ పెంచుతూ బిల్లును ప్రతిపాదించామన్నారు. బిల్లు పై బీజేపీ నుంచి పాయల్ శంకర్, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు, గంగుల కమలాకర్ మాట్లాడారు.