Telangana Assembly | రాత్రి 3 గంటల వరకు కొనసాగిన అసెంబ్లీ.. సుదీర్ఘ ప్రసంగాలు చేయొద్దని స్పీకర్ సూచన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. సోమవారం 19 పద్దులపై చర్చ సందర్భంగా సభ సుదీర్ఘంగా కొనసాగింది. 19 పద్దులపై చర్చకు దాదాపు 19 గంటల పాటు సభను కొనసాగించారు.

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. సోమవారం 19 పద్దులపై చర్చ సందర్భంగా సభ సుదీర్ఘంగా కొనసాగింది. 19 పద్దులపై చర్చకు దాదాపు 19 గంటల పాటు సభను కొనసాగించారు. అంటే సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో మరో 19 పద్దులపై చర్చ ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభ్యులకు కీలక సందేశం ఇచ్చారు. నిన్నటిలాగా సుదీర్ఘ ప్రసంగాలు చేయొద్దని సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి సభ్యుడికి 15 నిమిషాల సమయం కేటాయిస్తామన్నారు. సభ్యులందరూ సబ్జెక్ట్‌పైనే మాట్లాడాలని సభాపతి సభ్యులకు సూచించారు. అనవసర ప్రసంగాలు చేసి సభా సమయాన్ని వృథా చేయొద్దని కోరారు. సభను హుందాగా నడిపించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవాళ వ్యవసాయం, సహకార, నీటిపారుదల, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పశు సంవర్ధక, పర్యాటక, క్రీడా శాఖ, అటవీ, దేవాదాయ, మైనార్టీ, చేనేత, స్త్రీ శిశు సంక్షేమ పద్దులపై చర్చ ప్రారంభమైంది.