Budget 2024 | రూ.48.21లక్షల కోట్లతో మోదీ 3.o బడ్జెట్.. ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
Budget 2024 | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను సమర్పించారు. ఈ బడ్జెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధారణ బడ్జెట్ అమృతకాల్ బడ్జెట్ అని పేర్కొన్నారు.

Budget 2024 | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను సమర్పించారు. ఈ బడ్జెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధారణ బడ్జెట్ అమృతకాల్ బడ్జెట్ అని పేర్కొన్నారు. ఐదేళ్లపాటు దిశను నిర్దేశించడంతో పాటు 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాది వేస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూ.48.21 లక్షలకోట్ల పరిమాణంతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం ఆదాయం రూ.32.07లక్షల కోట్లుగా అంచనా వేశారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.28.83వేలకోట్లు అంచనా వేయగా.. ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని తెలిపారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16లక్షల కోట్లుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. వ్యవసాయ ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, సామాజిక న్యాయం, తయారీ, సేవలరంగాలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, పరిశోధనలు, భవిష్యత్ సంస్కరణలు అనే తొమ్మిది ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని ప్రకటించారు.
విద్యారంగానికి 9వేల కోట్ల కోత
దేశంలో ఉన్నత విద్యారంగాన్ని పర్యవేక్షించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి కేంద్రం దాదాపు 60 శాతం కోత పెట్టింది. ఐఐఎంలకు వరుసగా రెండో బడ్జెట్‌లోనూ కేటాయింపులు తగ్గించివేసింది. పాఠశాల విద్యకు 535 కోట్లు పెంచిన కేంద్రం.. ఉన్నత విద్యకు గ్రాంట్లను మాత్రం గత ఏడాది సవరించిన అంచనాలతో పోల్చితే 9,600 కోట్ల మేరకు తగ్గించింది. మొత్తంగానే విద్యారంగానికి 9 వేల కోట్లకు పైగా కోతలు పడ్డాయి.
ఐఐటీలకు తగ్గిన కేటాయింపులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లకు కూడా గత బడ్జెట్ సవరించిన అంచనాలతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. సవరించిన బడ్జెట్‌లో 10,384.21 కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ. 10,324.50 కోట్లకు తగ్గించారు. సెంట్రల్ యూనివర్సిటీలకు గ్రాంట్లు మాత్రం 28 శాతం పెంచారు. గతంలో ఇవి 12వేల కోట్లు ఉండగా.. 15,472 కోట్లకు పెంచారు. పాఠశాల విద్యలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఎన్సీఆర్టీ, పీఎం శ్రీ స్కూల్స్, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ పెంచారు.
జనాభా లెక్కల సేకరణ లేనట్టే
జన గణనకు 2021-22 బడ్జెట్‌లో 3,768 కోట్లు కేటాయించారు. కానీ ఆ ఏడాది కొవిడ్ కారణంగా జనాభా లెక్కలు సేకరించలేదు. ఈసారి 1,309.46 కోట్లు మాత్రమే కేటాయించడంతో ఈసారి కూడా జనాభా లెక్కల సేకరణ లేనట్టే. 2019 డిసెంబర్ 24న సమావేశమైన కేంద్ర క్యాబినెట్ 2021 జనాభా లెక్కల కోసం 8,754.23 కోట్లకు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్‌కు రూ.3,941.35 కోట్లు కేటాయించింది. జనాభా లెక్కల సేకరణకు మొత్తంగా 12వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు.
సబ్సిడీలకు కోత
ఆహారం, ఎరువులు, ఇంధనాలపై సబ్సిడీలను కేంద్రం గణనీయంగా తగ్గించింది. గత బడ్జెట్‌తో పోల్చితే ఈ బడ్జెట్‌లో 7.8 శాతం నిధులు తగ్గిపోయాయి. మొత్తం సబ్సిడీలకు రూ.3,81,175 కోట్లు కేటాయించారు. ఈ నిధులు గత బడ్జెట్‌లో రూ.4,13,466 కోట్లుగా ఉన్నాయి.
ప్రభుత్వ ఖజానాకు చేరే ప్రతి రూపాయిలో 63 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారానే లభించనున్నాయి. మిగిలిన 27 పైసల్లో రుణాలు, ఇతర అప్పులు ఉన్నాయి. మరో 9 పైసలు పెట్టుబడుల ఉపసంహరణ వంటి పన్నేతర ఆదాయం నుంచి, ఇక మిగిలిన ఒక పైస రుణేతర మూలధన వసూళ్ల నుంచి రానున్నాయి.
అద్భుతమైన బడ్జెట్ ఇది : బీజేపీ నేతలు
ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతమైనదని, దేశ ఆర్థిక వ్యవస్థ రూపాంతరాన్ని వేగవంతం చేస్తుందని అధికార బీజేపీ పేర్కొన్నది. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ప్రధాని మోదీ కలను నెరవేర్చుతుందని తెలిపింది. దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. సౌభాగ్యవంతమైన, స్వావలంబన కలిగిన వికసిత్ భారత్ దిశగా దేశాన్ని ముందుకు తీసుకుపోతుందన్నారు. బడ్జెట్‌ను వృద్ధి ఆధారితంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు అభివర్ణించారు. అందరికీ లబ్ధి చేకూర్చేదని చెప్పారు.