Telangana Assembly | జనవరి 7 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly | శాసనసభ శీతాకాల సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. జీరో అవర్ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన బీఏసీ సమావేశంలో శాసనసభ సమావేశాల తేదీలను ఖరారు చేశారు.
Telangana Assembly | హైదరాబాద్ : శాసనసభ శీతాకాల సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. జీరో అవర్ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన బీఏసీ సమావేశంలో శాసనసభ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. జనవరి 2 నుంచి 7వ తేదీ వరకు సమావేశాలను కొనసాగించాలని నిర్ణయించారు.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ తరపున హరీశ్‌రావు, బీజేపీ తరపున మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం తరపున అక్బరుద్దీన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ పని దినాలతో పాటు ఎజెండాను ఖరారు చేశారు.
అయితే శాసనసభ సమావేశాలను 15 రోజులు జరపాలని పట్టుబట్టినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. కానీ అందుకు బీఏసీ సమావేశంలో ఒప్పుకోలేదన్నారు. వారం రోజులు సభ జరిపిన అనంతరం మళ్లీ బీఏసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుందామని స్పీకర్ చెప్పినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇక సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అనుమతివ్వాలని కోరామని, ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తెలిపినట్లు ఆయన చెప్పారు. గతంలో కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వనందుకు బహిష్కరించామని భట్టి విక్రమార్క అన్నారని హరీశ్ గుర్తుచేశారు. ఇప్పుడు మీరు(కాంగ్రెస్ ప్రభుత్వం) ఇవ్వకపోతే మేము బాయ్‌కాట్ చేయాలా అని అడిగామన్నారు.
శాసనసభ సమావేశాలు కనీసం 20 రోజులైనా నిర్వహించాలని కోరినట్లు బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 32 అంశాలపై చర్చించాలని కోరినట్లుగా వివరించారు. జనవరి 2 నుంచి 7 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని వివరించారు. జనవరి 7న మళ్లీ బీఏసీ సమావేశం ఉంటుందని తెలిపారు. 2 రోజులు సమావేశాలు పెట్టి చేతులు దులుపుకోవటం సరికాదని వివరించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram