Telangana Budget 2024 | హైద‌రాబాద్ న‌గ‌రాభివృద్ధికి భారీగా నిధులు.. హ‌య‌త్‌న‌గ‌ర్, ప‌టాన్‌చెరు వ‌ర‌కు మెట్రో విస్త‌ర‌ణ‌..!

హైద‌రాబాద్ న‌గ‌రాభివృద్ధికి రాష్ట్ర ప్ర‌భుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఎంతో ఘ‌న చ‌రిత్ర క‌లిగిన న‌గ‌రంలో పారిశుద్ధ్య‌, మురుగు నీటి, తాగునీటి వ్య‌వ‌స్థ‌లు గ‌త ప‌దేండ్లుగా అత్యంత నిర్ల‌క్ష్యానికి గుర‌య్యాయని ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.

Telangana Budget 2024 | హైద‌రాబాద్ న‌గ‌రాభివృద్ధికి భారీగా నిధులు.. హ‌య‌త్‌న‌గ‌ర్, ప‌టాన్‌చెరు వ‌ర‌కు మెట్రో విస్త‌ర‌ణ‌..!

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రాభివృద్ధికి రాష్ట్ర ప్ర‌భుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఎంతో ఘ‌న చ‌రిత్ర క‌లిగిన న‌గ‌రంలో పారిశుద్ధ్య‌, మురుగు నీటి, తాగునీటి వ్య‌వ‌స్థ‌లు గ‌త ప‌దేండ్లుగా అత్యంత నిర్ల‌క్ష్యానికి గుర‌య్యాయని ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. మితిమీరిన కాలుష్యంతో మూసీ, హుస్సేన్ సాగ‌ర్ విషతుల్యం అయ్యాయి. మురికి నీటి కాల్వ‌ల నిర్వ‌హ‌ణ లోపంతో, ఆక్ర‌మ‌ణ‌ల‌తో చినుకు ప‌డితే న‌గ‌రం జ‌ల‌మ‌య‌మై ప్ర‌జా జీవ‌నం అస్త‌వ్య‌స్తం అయ్యే ప‌రిస్థితి దాపురించింది. దూర‌దృష్టి లేని ప్ర‌ణాళిక‌లు, ఇబ్బ‌డిముబ్బ‌డి అక్ర‌మ నిర్మాణాల‌పై దృష్టి సారించ‌క‌పోవ‌డంతో న‌గ‌రాభివృద్ధి కుంటుప‌డింది. కేవ‌లం కొన్ని ఫ్లై ఓవ‌ర్లు నిర్మించి దాన్నే అభివృద్ధిగా భ్ర‌మింప‌జేశారు. హైద‌రాబాద్‌లో భూముల వేలం ద్వారా వేల కోట్లు స‌మ‌కూరినా, వాటి వినియోగం మాత్రం న‌గ‌రాభివృద్ధి కొర‌కు జ‌ర‌గ‌లేద‌న్నారు భ‌ట్టి విక్ర‌మార్క‌.

హైద‌రాబాద్ న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ఈ క్ర‌మంలోనే మెట్రో రైలును హ‌య‌త్‌న‌గ‌ర్, ప‌టాన్ చెరు, ఎయిర్‌పోర్టు వ‌ర‌కు విస్త‌రించాల‌ని నిర్ణ‌యించాం. వివిధ వ‌ర్గాల అవ‌స‌రాల‌ను తీర్చ‌డంతో పాటు న‌గ‌రంలోని అన్ని ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి చెందాల‌న్న ల‌క్ష్యంతో, ప్ర‌భుత్వం 78.4 కిలోమీట‌ర్ల పొడ‌వున్న ఐదు ఎక్స్‌టెండెడ్ కారిడార్ల‌ను 24,042 కోట్ల‌తో అభివృద్ధి ప‌రుస్తుంది. ఇందులో భాగంగా మెట్రో రైలును పాత‌బ‌స్తీకి పొడిగించి దాన్ని శంషాబాద్ ఎయిర్‌ఫోర్టు వ‌ర‌కు అనుసంధానం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. నాగోల్, ఎల్‌బీన‌గ‌ర్‌, చంద్రాయ‌ణ‌గుట్ట స్టేష‌న్ల‌ను ఇంట‌ర్ ఛేంజ్ స్టేష‌న్లుగా అభివృద్ధి చేస్తామ‌న్నారు. మియాపూర్ నుంచి ప‌టాన్‌చెరు వ‌ర‌కు, ఎల్‌బీన‌గ‌ర్ నుంచి హ‌య‌త్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో రైలు సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌న్నారు భ‌ట్టి విక్ర‌మార్క‌.

జీహెచ్ఎంసీ ప‌రిధిలో కేటాయింపులు ఇలా..

మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్ – రూ. 3,385 కోట్లు
హైడ్రా సంస్థ – రూ. 200 కోట్లు
జీహెచ్ఎంసీలో మౌలిక వ‌స‌తులు క‌ల్ప‌న – రూ. 3,065 కోట్లు
హెచ్ఎండీఏలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న రూ. 500 కోట్లు
విమానాశ్ర‌యం వ‌ర‌కు మెట్రో విస్త‌ర‌ణ రూ. 100 కోట్లు
హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు
మూసీ రివ‌ర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూఏ. 1500 కోట్లు
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ. 1525 కోట్లు
పాత‌బ‌స్తీ మెట్రో విస్త‌ర‌ణ‌కు రూ. 500 కోట్లు
మ‌ల్టీ మోడ‌ల్ స‌బ‌ర్బ‌న్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్ట‌మ్ రూ. 50 కోట్లు
ఔట‌ర్ రింగ్ రోడ్డుకు రూ. 200 కోట్లు
హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ. 500 కోట్లు