Telangana Cabinet : త్వరలో…తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ !?

తెలంగాణలో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చన్న ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, మరో పది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ జరగవచ్చని వార్తలు వస్తున్నాయి.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Nov 29, 2025, 3:05 pm IST
Read Time: 4 mins
Telangana Cabinet : త్వరలో…తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ !?

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరందుకుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తుందని..పది రోజల వ్యవధిలో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్ 9 తేదీతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రచారం తెరపైకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సీఎం సహా 16మంది మంత్రులు ఉన్నారు. మరో రెండు మంత్రిపదవులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడుసార్లు మంత్రివర్గ విస్తరణ చేశారు.

వారు ఔట్..వీరు ఇన్ ?

రాష్ట్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరిగితే ప్రస్తుత మంత్రుల్లో కనీసం నలుగురైదుగురు మంత్రులకు ఉద్వాసన తప్పదని తెలుస్తుంది. మంత్రివర్గం నుంచి తప్పించే వారి జాబితాలో ప్రధానంగా మంత్రి జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుల పేర్లు వినిపిస్తున్నాయి. తప్పించనున్న మంత్రుల స్థానంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తారని ప్రచారం సాగుతుంది. కొత్తగా బి. మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, విజయశాంతి, బాలు నాయక్ వంటి వారికి కేబినెట్లో స్థానం దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లను ఏఐసీసీలోకి తీసుకుంటారని, పీసీసీ చీఫ్ గా శ్రీధర్ బాబుకు అవకాశం కల్పిస్తారన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి.