Telangana Cabinet | 18న మేడారంలో తెలంగాణ కేబినెట్.. రేవంత్ ఉద్దేశం ఇదేనా..?
Telangana Cabinet | ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రస్తుత ములుగు జిల్లాలోని దట్టమైన అడవిలోని ఓ మారుమూల ప్రాంతమైన మేడారంలో రెండేళ్ళకోసారి జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు కోట్లాది మంది భక్తులు హాజరుకావడమే ఒక ప్రత్యేక అంశమైతే, కుగ్రామమైన మేడారంలో ఈ నెల 18వ తేదీ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది.
ఒక్క సమావేశం, పలు ప్రయోజనాలు
తొలిసారి హైదరాబాద్‌కు వెలుపల
ప్రజాపాలనకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారు
చర్చనీయాంశంగా సర్కారు నిర్ణయం
18, 19 తేదీల్లో ఇక రాజకీయ జాతరే
మేడారంలో విస్తృతస్థాయి ఏర్పాట్లు
రెండు రోజులు భక్తులకు ఇబ్బందులు
Telangana Cabinet | విధాత, ప్రత్యేక ప్రతినిధి : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రస్తుత ములుగు జిల్లాలోని దట్టమైన అడవిలోని ఓ మారుమూల ప్రాంతమైన మేడారంలో రెండేళ్ళకోసారి జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు కోట్లాది మంది భక్తులు హాజరుకావడమే ఒక ప్రత్యేక అంశమైతే, కుగ్రామమైన మేడారంలో ఈ నెల 18వ తేదీ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడి నిర్ణయమిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నిర్ణయం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఆశిస్తున్న ప్రయోజనాలేంటనే విషయం చర్చనీయాంశంగా మారింది. నిన్నమొన్నటి వరకు కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ శుక్రవారం ఈ మీటింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రకటన విడుదల చేయడంతో స్పష్టత వచ్చింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్‌లో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు ములుగు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
మేడారంలో కేబినెట్ మీటింగ్ ఉద్దేశ్యం!?
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కాకుండా వెలుపల నిర్వహించడం చరిత్రలో ఇదే తొలిసారి కానున్నది. హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించుకునే అవకాశం ఉన్నప్పటికీ మారుమూల ప్రాంతమైన మేడారంలో సమావేశం నిర్వహించడం ద్వారా ప్రజలకు కొన్ని స్పష్టమైన సందేశాలు ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు చర్చసాగుతోంది.
శాంతిభద్రతలూ…పెట్టుబడులు
దట్టమైన అడవిలో నక్సలైట్‌ల ప్రాబల్య ప్రాంతంగా ఉన్న మేడారానికి గతంలో ఎవరైనా విఐపీలు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, మరీ ముఖ్యంగా మంత్రులు, సీఎం లాంటి వారు పర్యటించాలంటే ఒకటికి రెండు పర్యాయాలు ఆలోచించేవారు. వారి పర్యటనకు ముందూ, ఆ తర్వాత విస్తృతస్థాయి బందోబస్తు నిర్వహించేవారు. అనేక ముందస్తు జాగ్రత్తలు,చర్యలు తీసుకునేవారు. కానీ,ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నక్సలైట్ల ప్రాబల్యం కొద్ది సంవత్సరాలుగా తగ్గిపోగా, ఇటీవల పరిస్థితి మరింత సానుకూలంగా మారింది. ఈ నేపథ్యంలో కేబినేట్ మీటింగ్ ద్వారా తెలంగాణలో ప్రశాంత వాతావరణంతోపాటు, శాంతి భద్రతలు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నట్లు చాటిచెప్పేందుకు మేడారాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. దీని వల్ల అటవీప్రాంతాలతోపాటు, ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు మార్గం సుగమవుతుందనే లక్ష్యం దాగి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయం తెలంగాణలో పెట్టుబడులు, భద్రతా వాతావరణాన్ని ప్రోత్సహిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
గిరిజనాభివృద్ధికి పెద్దపీట
తెలంగాణలో మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా గిరిజిన ప్రాంతాల పై తమకు ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శించేందుకు, గతానికి భిన్నంగా ఈ సారి మేడారంలో శాశ్వత అభివృద్ధికి రూ. 300 కోట్ల మేరకు ఖర్చు చేసి తమ ప్రభుత్వం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రదర్శించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కేబినెట్ ఒకే తాటిపై ఉన్నట్లు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
పర్యాటకం, సాంస్కృతిక అభివృద్ధి
ఉమ్మడి వరంగల్ జిల్లా అంటేనే చారిత్రక, పర్యాటక కేంద్రాలకు నిలయంగా ఉండగా ములుగు జిల్లాలోని రామప్ప, లక్నవరం, ఘనపురం, కోటగుళ్ళ, నర్సింహాసాగర్, మల్లూరు, మేడారంతో పాటు బోగత జలపాతం, ఇటీవల అటవీశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బ్లాక్ బెర్రీ ఐలాండ్, జలగలంచ వ్యూపాయింట్తోపాటు అటవీ అందాలను వినియోగించుకుని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్న తీరును మరోసారి చాటిచెప్పాలని భావిస్తున్నారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. ఇప్పటికే బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రజాపాలనకు ప్రత్యక్ష నిదర్శనం
ఇక ప్రజాపాలనకు తమ ప్రభుత్వం ప్రతీకగా చెప్పుకుంటున్న నేపథ్యంలో మేడారంలో చేపట్టిన అభివృద్ధియే కాకుండా మంత్రివర్గమంతా సామూహికంగా మేడారం నుంచి ఇచ్చే సందేశానికి గుర్తింపేకాకుండా, ప్రత్యేకత కూడా లభిస్తుందనే లక్ష్యంతో మేడారంలో కేబినేట్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
సెంటిమెంట్, కమిట్ మెంట్
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం పై పాదయాత్ర ద్వారా ప్రచారాన్ని చేపట్టిన సమయంలో మేడారం సమ్మక్క, సారలమ్మల నుంచే యాత్ర ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యారు. తన సెంటిమెంట్ ను తన మంత్రివర్గ సహచరులతో కలిసి చాటిచెప్పడం వల్ల కృతజ్ఞత చాటుకున్నట్లుగా భావిస్తున్నారు. గత సీఎం కేసీఆర్ యాదాద్రిని అభివృద్ధి చేస్తే రేవంత్ ఆధ్వర్యంలో మేడారం, వేములవాడలకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ రెండు ప్రాంతాల మధ్య, భక్తుల మధ్య అవినాభావ సంబంధం కూడా ఉండడం యాదృచ్ఛికమైనా కలిసొచ్చే అంశం.
కేబినెట్‌లో చర్చనీయాంశాలు
ఈ కేబినెట్ సమావేశంలో వచ్చే రాష్ట్ర బడ్జెట్ సన్నాహాలు, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ముఖ్యంగా మున్సిపల్, అవకాశముంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మేడారం జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలు, జాతీయ పండుగ స్థాయి కోసం కేంద్రానికి తీర్మానం పాస్ చేయడం వంటి అంశాలు చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఈ సందర్భంగా మేడారంలో అభివృద్ధి పనుల ప్రారంభమే కాకుండా భారీ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటిచెప్పేందుకు వేదికగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు.
రెండు రోజులు రాజకీయ జాతర

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే జిల్లాల పర్యటన కొనసాగిస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో పర్యటించారు. ఆ తర్వాత మహబూబ్ నగర్, 18న ఖమ్మం జిల్లాలో జరిగే అభివృద్ధి పనులను ప్రారంభించడమే కాకుండా సీపీఐ వంద సంవత్సరాల సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి మేడారానికి చేరుకుంటారు. సాయంత్రం ఐదు గంటలకు మేడారం హరిత హోటల్ లో జరిగే కేబినెట్ మీటింగ్ లో పాల్గొంటారు. 19వ తేదీన మేడారం అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత జరిగే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం దావోస్ పయనమవుతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ మీటింగ్, ప్రారంభోత్సవం, సభ నేపథ్యంలో మేడారానికి రాష్ట్ర మంత్రివర్గంతోపాటు ఉన్నతాధికారులు రానున్నారు. దీనికి తోడు బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, మంత్రివర్గం, ప్రభుత్వం, ములుగు జిల్లా యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులతో రెండు రోజులు మేడారంలో రాజకీయ జాతర జరుగనున్నది. ఈ సందర్భంగా ఇప్పటికే భారీ బందోబస్తు , విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి సీతక్క స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం రాక సందర్శంగా, అతిథుల కోసం ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్ స్థలాన్ని, టెంట్ సిటీ, సాంసృతిక కార్యక్రమాల సభ ప్రాంగణాన్ని, క్యూ లైన్స్ షెడ్స్, మీడియా టవర్ నిర్మాణాలను, ప్రధాన ఆర్చి ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు. శనివారం సాయంత్రం లోపు పనులు చేసి, సభ ప్రాంగణ పరిసరాలలో రాతి నిర్మాణాల వ్యర్ధాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు.
మేడారం భక్తులకు అగ్ని పరీక్షే

మేడారం భక్తులకు శని, ఆదివారాల్లో రెండు రోజులు అగ్నిపరీక్ష ఎదురుకానున్నది. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతర ఉండగా ఇప్పటికే భక్తులు ముందస్తు మొక్కులు సమర్పిస్తున్నారు. భక్తులు వేల సంఖ్యలో వచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా గురు, శుక్ర, ఆదివారాల్లో భక్తులు పోటెత్తతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం, మంత్రులు, ఉన్నతాధికారుల రాక, కేబినెట్ మీటింగ్, సీఎం ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే బందోబస్తు, దర్శనం నిలిపివేయడంతో ఆది, సోమవారాల్లో భక్తులకు ఇబ్బందులు తప్పేట్లులేవు. భద్రత పేరుతో ట్రాఫిక్ మళ్లింపు, క్యూ లైన్ ల మూసివేతతో అవస్థలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే కేబినెట్ మీటింగ్, ప్రారంభోత్సవాల సందర్భంగా భక్తులకు అంతరాయం కలుగకుండా అవసరమైన మేరకే జాగ్రత్తలు తీసుకుంటే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని చెబుతున్నారు. లేకుంటే ట్రాఫిక్ జామ్ అయ్యి భక్తులు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. అయితే మరో ప్రయోజనం ఉందంటున్నారు. సీఎం రాక, మంత్రులు, అధికారుల పర్యటన నేపథ్యంలో అవసరమైన పారిశుద్ధం, వసతులు, ఏర్పాట్లు సత్వరం చేసే అవకాశం ఉందంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram