విధాత, హైదరాబాద్ : తెలంగాణ సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే (సీపెక్) సంపూర్ణ డేటాను, నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ అధికారిక సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలు భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ, సామాజిక పరిణామాలను ప్రభావితం చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, క్రీడలు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ప్రణాళికశాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌లు తెలంగాణ సామాజిక, ఆర్థిక కుటుంబ సర్వే సమగ్ర నివేదికలను వెల్లడించారు. నివేదికలను https://des.telangana.gov.in/ వెబ్‌సైట్‌లోనూ అప్‌లోడ్ చేసినట్లుగా వెల్లడించారు.
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ఈ నివేదికలపై స్పందించి…రాష్టంలో వెనుకబాటుతనాన్ని తొలగించడానికి అందించే సలహాలు, సూచనల్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వేను ప్రవేశపెట్టి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని, తెలంగాణ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సర్వే చేసి సామాజిక న్యాయం సాధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు
1కోటి 12లక్షల 36,849 కుటుంబాలను సర్వే
తెలంగాణ ప్రణాళిక శాఖ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కోసం 1.03 లక్షల మంది ఉద్యోగులు పనిచేశారు. 1కోటి 12లక్షల 36,849 కుటుంబాలను సర్వే చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 97.10 శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. సర్వేకు దాదాపు 3.55 కోట్ల మంది ప్రజలు స్పందించారు. వారిచ్చిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా తీసుకుని నివేదిక రూపొందించింది. రాష్ట్రం చేపట్టిన సీపెక్ సర్వే డేటాను సంపూర్ణంగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుని… సమగ్ర కుటుంబ సర్వేను పబ్లిక్ డొమైన్‌లో పెట్టింది.
మాదిగల జనాభా అధికం
సర్వే నివేదిక ప్రకారం, రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ కులస్థుల జనాభా 36 లక్షల 57,551 గా నమోదైంది. రాష్ట్రం మొత్తం జనాభాలో వీరి వాటా 10.3 శాతంగా ఉండటం విశేషం. కేవలం ఎస్సీ కులాల్లోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గాల్లో ఒకటిగా మాదిగలు నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో మాల సామాజిక వర్గం 14,71,514 (4.1%) జనాభాతో నిలిచింది. మాదిగల జనాభా తర్వాత రాష్ట్ర జనాభాలో రెండో స్థానంలో ముదిరాజ్ కులస్థుల జనాభా 26లక్షల ,39,027 గా నమోదైంది. మొత్తం జనాభాలో వీరి వాటా 7.4 శాతంగా ఉండటం విశేషం. బీసీ జనాభాలో ఈ కులమే అత్యంత భారీ సంఖ్యను కలిగి ఉంది.
బీసీ జనాభా 56.33శాతం
తెలంగాణ రాష్ట్ర జనాభాలో బీసీలు 56.33శాతంతో అగ్ర స్థానంలో ఉన్నారు. ఇందులోనే 10.08శాతం వెనుకబడిన ముస్లింలు ఉన్నారు. ఎస్సీలు 17.43శాతం, ఎస్టీలు 10.45, ఓసీలు 15.79శాతం ఉన్నారు. ఓసీ జనాభాలో 20 కులాలు ఉండగా..వారంతా 56,01,539మంది ఉన్నారు. ఇందులో రెడ్డి కులస్తులు 17,06,867మందితో ఓసీ జనాభాలో 30.47శాతంగా ఉన్నరు. ఓసీల్లో రెండో స్థానంలో అగ్రవర్ణ ముస్లింలు, మూడో స్థానంలో వైశ్యులు, తర్వాతా కమ్మ, బ్రాహ్మణ, కాపు, నాయుడు, వెలమ, రాజులు, అయ్యంగార్ ,జైనులు ఉన్నారు. వెలమలు 1,43,279మంది ఉండగా..వారు ఓసీల్లో 2.56శాతం, మొత్తం జనాభాలో 0.4శాతం ఉన్నారు. ఓసీలల్లో పట్నాయక్, సిక్కులు, లింగాయత్, బౌద్దులు, కరణం కులస్తుల 1శాతం కంటే తక్కువ జనాభా కల్గి ఉన్నారు. కులగణన సర్వేలో ఏ కులమో చెప్పని జనాభా 12.04లక్షల మంది ఉన్నారు.
ముదిరాజులే అగ్రగామి!
తెలంగాణలోని వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన SEEEPC సర్వే-2024 సంచలన గణాంకాలను వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. రాష్ట్రంలోని బీసీ కులాలన్నింటిలోనూ ముదిరాజ్ సామాజిక వర్గం అత్యధిక జనాభాతో ప్రథమ స్థానంలో నిలిచింది. సర్వే నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ కులస్థుల జనాభా 26,39,027 గా నమోదైంది. మొత్తం జనాభాలో వీరి వాటా 7.4 శాతంగా ఉండటం విశేషం. బీసీ జనాభాలో ముదిరాజ్ లో అత్యధిక సంఖ్యలో ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
జనాభా పరంగా ముదిరాజుల తర్వాత స్థానాల్లో యాదవ, గౌడ్ సామాజిక వర్గాలు నిలిచాయి. యాదవ/గొల్ల కులస్థుల జనాభా 20.18 లక్షలతో (5.7%) రెండో స్థానంలో ఉండగా, గౌడ్ సామాజిక వర్గం 16.30 లక్షలతో (4.6%) మూడో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మున్నూరు కాపు (3.9%), పద్మశాలి (3.3%) సామాజిక వర్గాలు ఉన్నాయి. టాప్ 20 జాబితాలో రజక, కురుమ, వడ్డెర, అగ్నికుల క్షత్రియ వంటి కులాలు కూడా గణనీయమైన జనాభాతో నిలిచాయి.
అత్యంత వెనుకబడిన వర్గం డక్కల
వెనుకబాటు తనం నిర్ధారణలో 116పాయింట్లతో ఎస్సీ డక్కల కులం అత్యంత వెనుకబడిన వర్గంగా వెల్లడైంది. 12పాయింట్లతో ఓసీ కాపు కులం అత్యంత తక్కువ వెనుబడిన వర్గంగా నిలిచింది. బీసీ-ఈ అంచుకట్టల వాండ్లు, బీసీఏ రాజన్నాల, ఎస్సీ బైడ్ల, ఎస్సీ మాదిగలు 100పాయింట్లతో వెనుకబడిన వర్గాలుగా తేలింది. సీబీఐ(క్యాస్ట్ బ్యాక్ వర్డ్ నెస్ ఇండెక్స్) నివేదికలో రాష్ట్రంలోని 56ప్రధాన కులాల మధ్య వెనుకబాటు తనంలో గణనీయమైన తేడాలు వెల్లడయ్యాయి. ఓసీ కేటగిరిలోని రెండ్లు, కాపులు, వెలమలు, కమ్మలు, రాజులు, జైనులు, అయ్యంగార్లు, బ్రాహ్మణులు, వైశ్యులు తక్కువ వెనుకబడిన వర్గాల జాబితాలో ఉన్నారు. ఇకపోతే అత్యధికంగా విద్య, ఉద్యోగాలు, భూములు, ఇండ్లు, కార్లు అగ్రకులాల వారి చేతుల్లో ఉన్నాయని, వారి తర్వాత యాదవ, లంబాడ, ముదిరాజ్, మాదిగ, మన్నూరు కాపులు ఉన్నారని తేలింది. భూములలో అత్యధికం రెడ్ల చేతుల్లోనే ఉన్నట్లుగా వెల్లడైంది. రాష్ట్ర జనాభాలో 4.8శాతంగా ఉన్న రెడ్ల చేతుల్లో 13.5శాతం భూములు, 5.7శాతం ఉన్న యాదవుల చేతిలో 8.7శాతం భూములు, 6.8శాతం జనాభా ఉన్న లంబాడీల వద్ద 8.6శాతం భూములు, 7.4శాతం ఉన్న ముదిరాజుల వద్ద 10.3శాతం భూములు, 10.3శాతం ఉన్న మాదిగల వద్ద 6.5శాతం భూములు, 3.9శాతం మున్నురుకాపు వద్ద 6.4శాతం భూములు ఉన్నాయి.
కులాంతర వివాహాలు ఆ కులంలోనే అధికం
రాష్ట్రంలో కులాంతర వివాహాలు అత్యధికంగా చేసుకుంటున్న సామాజిక వర్గాల్లో అయ్యంగార్లు(అయ్యర్) 12శాతంతో మొదటి స్థానంలోఉణ్నారు. తర్వాతి స్థానంలో బీసీ సీ వర్గంలోని ఎస్సీ క్రిస్టియన్లు(9.9శాతం) ఉన్నారు. ఓసీ కులాల్లో అయ్యర్ల తర్వాత రాజు, కాపు, బ్రాహ్మణ, ముస్లిం, కమ్మ, జైనులు అధికంగా కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. బీసీలలో ఎస్సీ క్రిస్టియన్ల తర్వాత బీసీఏలోని గంగిరెద్దుల వారు, అగ్నికుల క్షత్రియులు, జంగాల వారు అధికంగా కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. ఎస్టీలలో కొలాము(2.6శాతం) అతి తక్కువగా కులాంతర వివాహాలు జరుగుతున్నాయని తేలింంది.
ఉన్నత చదువుల్లో అగ్రకులాలే వారే అధికం
డిగ్రీ, ఆపై స్థాయి చదువులు పూర్తి చేస్తున్నవారిలో అత్యధికంగా అగ్రకులాలే ఉన్నాయి. బ్రాహ్మణులు 40శాతం, కమ్మ, రెడ్డి, రాజు, కాపులు 35శాతానికి పైగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లుగా వెల్లడైంది. బీసీలలో పద్మశాలి, కంసాలి, పెరికే, మేర, మున్నూరు, కాపు, గౌడ కులస్తులు 30శాతం ఉన్నత చదువులు పూర్తి చేసినట్లుగా గుర్తించారు. కొలం, బేడ , గోండు, మాలి, వాల్మికీ, ఖురేజీ ముస్లింలలో ఉన్నత చదవుల శాతం తక్కువగా ఉన్నట్లుగా సర్వేలో వెల్లడైంది. స్కూల్ డ్రాపౌట్లలోనూ ఎస్టీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది.
తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న కులాలు
1) మాదిగ – 36 లక్షల 57 వేల 551 మంది(10.3%)
2)వెనుబడిన షేక్ ముస్లిం – 27.96 లక్షలు (7.9%)
3) ముదిరాజ్ – 26,39,027 (7.4%)
4) లంబాడీ / బంజారా 24,04,056 (6.8%)
5) యాదవ (Yadava/Golla) – 20,18,725 (5.7%)
6) రెడ్డి (Reddy) – 17,10,244 (4.8%)
7) గౌడ్ (Goud) – 16,30,187 (4.6%)
8) మాల (Mala) – 14,71,514 (4.1%)
9) మున్నూరు కాపు (Munnurukapu) – 13,75,018 (3.9%)
10) పద్మశాలి (Padmasali) – 11,82,252 (3.3%)
11) రజక (Rajaka) – 9,95,972 (2.8%)
12) యాదవ / కురుమ (Yadhava/Kuruma) – 7,95,822 (2.2%)
13) ఒడ్డు / వడ్డెర (Odde/Vaddera) – 6,43,571 (1.8%)
14) ముస్లింలు (OC Muslims) – 6,32,782 (1.8%)
15) అగ్నికులక్షత్రియ (Agnikulakshatriya) – 5,27,119 (1.5%)
16) కొమటి / వైశ్య (Komati/Vaishya) – 5,08,813 (1.4%)
17) నాయి బ్రాహ్మణ్ (Nayi Brahmin) – 4,33,785 (1.2%)
18) కుమ్మర (Kummara) – 4,31,363 (1.2%)
19) కొయ (Koya) – 4,28,142 (1.2%)
20) వడ్రంగి (Vadrangi) – 4,07,927 (1.1%)
21) గోండ్ (Gond) – 3,81,895 (1.1%)
మిగిలిన వర్గాలు
▸ కమ్మ – 3.68 లక్షలు (1.0%)
▸ వాల్మీకి బోయ – 3.59 లక్షలు (1.0%)
▸ బ్రాహ్మణులు – 3.36 లక్షలు (0.9%)
▸ దూడేకుల – 2.70 లక్షలు (0.8%)
▸ కాపు / నాయుడు – 2.42 లక్షలు (0.7%)
▸ పెరిక – 2.31 లక్షలు (0.6%)
▸ బెడ – 1.90 లక్షలు (0.5%)
▸ఎరుకల – 1.85 లక్షలు (0.5%)
▸ వీరశైవ లింగాయత – 1.73 లక్షలు (0.5%)
▸ కమ్మరి (బ్లాక్‌స్మిత్) – 1.66 లక్షలు (0.5%)
▸ వెలమ – 1.44 లక్షలు (0.4%)
▸ ధోబీ ముస్లిం – 1.26 లక్షలు (0.4%)
▸ ఉప్పర / సాగర – 1.24 లక్షలు (0.3%)
ఇవి కూడా చదవండి :
తెలంగాణ కుల గణన లెక్కలు వెల్లడించిన ప్రభుత్వం
స్వల్పంగా పెరిగిన బంగారం, స్థిరంగా వెండి!
