Congress Internal Conflicts | చేతులు కాలాక.. ఆకులు పట్టకున్నట్టు రేవంత్‌ తీరు!

పంచాయతీ ఎన్నికల్లో గ్రూపు రాజకీయాల వల్ల కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదని, ఈ తీరు మారకుంటే రాబోయే జడ్పీ, మున్సిపల్ ఎన్నికల్లో చేదు అనుభవాలు తప్పవని విశ్లేషణలు వస్తున్నాయి.

Congress Internal Conflicts | చేతులు కాలాక.. ఆకులు పట్టకున్నట్టు రేవంత్‌ తీరు!

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

Congress Internal Conflicts | చేతులు కాలాక.. ఆకులు పట్టుకొమ్మని చెప్పినట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరుంది. తెలంగాణలో దాదాపు నెల రోజుల పాటు పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించారు. మెజార్టీ స్థానాలు సాధించినప్పటికీ బీఆరెస్‌కు సైతం పోటాపోటీగా విజయాలు లభించాయి. దీనిపై ప్రస్తుతం సొంత నేతలకు హితోపదేశం చేసిన సీఎం రేవంత్.. అదేదో ముందే స్పందించి, తగిన చర్యలు తీసుకొని, సూచనలు చేస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉండేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీలో అంతర్గతంగా సమీక్షించో.. లేదా బహిరంగంగా హెచ్చరికలు చేసో.. సమయానుకూలంగా అత్యవసరమైన చర్యలు చేపట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, టీపీసీసీ నాయకత్వం, ఆఖరికి సీఎం స్పందిస్తే బాగుండేదంటున్నారు.

కాంగ్రెస్ లో బహిరంగ గ్రూపులు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అతి ప్రజాస్వామ్యంతోపాటు, బహిరంగంగా గ్రూపులు కొనసాగుతూ ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితి అనేక నియోజకవర్గాల్లో ఉంది. ఇది నాయకత్వానికి కూడా తెలుసు. అయినప్పటికీ అవసరమైన సందర్భంలో కట్టడి చేయకుండా నిర్లక్ష్యం చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే వరంగల్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ తదితర ఉమ్మడి జిల్లాల్లో రెబల్స్ సంఖ్య పెరిగి.. పలు చోట్ల పార్టీ మద్ధతిచ్చిన అభ్యర్థులు ఓటమిపాలయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల ఎమ్మెల్యే ఆధిపత్యానికి గండికొట్టాలని తమ వర్గం వారిని కొందరు నాయకులు పోటీలో పెట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులే పోటీపడటంతో ఎదుటి పార్టీలు.. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ మద్ధతు దారులు సునాయసంగా విజయం సాధించారు.

స్వంత పార్టీ అభ్యర్ధుల ఓటమికి పావులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డికి, కొండా వర్గానికి మధ్య నెలకొన్న విభేదాలతో.. వారి ఆధిపత్యం కోసం ఇద్దరు నాయకులూ ఎన్నికల బరిలోకి తమ మద్ధతుదారులను దింపారు. గీసుకొండ మండలంలో కొన్ని చోట్ల కొండా అనుచరులు గెలిచినప్పటికీ పలు గ్రామాల్లో కాంగ్రెస్ మద్ధతు తెలిపిన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. దీంతో కొన్నిచోట్ల రెబల్స్ గెలిచినప్పటికీ పలు స్థానాల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్ధులు విజయం సాధించారు. ఇదే పరిస్థితి పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్‌, జనగామ, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో కనిపించింది. పాలకుర్తిలో దాదాపు 30 గ్రామాల్లో కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యే, ఆమె అత్త వ్యతిరేక గ్రూపు పట్టుదలతో పోటీ చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత కాంగ్రెస్ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డికి పాత కాంగ్రెస్‌ నాయకులకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరాయి. ఒకరికి ఒకరు బహిరంగ సవాళ్ళతో పోటీపడ్డారు. ఝూన్సీరెడ్డి సొంత గ్రామం చెర్లపాలెంలో ఆమె మద్ధతు తెలిపిన అభ్యర్ధిని ఓడించి పాత కాంగ్రెస్ కాపులు పట్టు సాధించారు. ఇక పార్టీకి పూర్తి పట్టున్న నల్లగొండ జిల్లాలో సైతం నాయకుల మధ్య సమన్వయం కొరవడింది. తమ వర్గం వారే విజయం సాధించాలనే పట్టుదలతో పోటీలో నిలిచి ఓటమిపాలయ్యారు. మహబూబ్ నగర్ వనపర్తి తదితర నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. ప్రస్తుత ఎమ్మెల్యేలకు బలం పెరిగితే ఇక తమకు మళ్ళీ పోటీ చేసే అవకాశం రాదని భావించిన కొందరు నాయకులు ఎమ్మెల్యేల బలాన్ని తగ్గించేందుకు వారు మద్ధతునిచ్చిన నాయకులను ఓడించేందుకు ఎదుటివారితో ‘చేతులు’ కలిపారు. కొన్నిచోట్ల ఎన్నికలను స్థానిక ఎమ్మెల్యేలు సీరియస్‌గా పట్టించుకోకపోవడం కూడా అభ్యర్ధుల ఓటమికి కారణంగా చెబుతున్నారు. అవసరమైన ఆర్ధిక మద్ధతు లేక పోవడంతో కొన్ని చోట్ల ప్రత్యర్ధుల ముందు డీలాపడ్డారు.

నామ మాత్రంగా జిల్లా అధ్యక్షులు

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నూతన జిల్లా అధ్యక్షులను ప్రేక్షకులుగా మార్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులను పట్టించుకున్నవారే కరువయ్యారు. ఇదిలా ఉండగా పలు చోట్ల తమ వర్గం వారికి, బంధువులకు, ప్రజాబలం లేని వారికి ఎమ్మెల్యేలు ఏకపక్షంగా మద్ధతునందించడంలో ఓటమిపాలయ్యారు. పార్టీ కోసం పనిచేసి గుర్తింపుపొందిన పేద వర్గాల నుంచి వచ్చిన నాయకులకు సరైన ఆర్ధిక సహకారం లేక పోవడంతో పోల్ మేనేజ్ మెంట్ లేక స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

పట్టించుకోకుంటే పరిషత్ లు పట్టుతప్పినట్లే

కర్ణుని చావుకు నూరు కారణాలన్నట్లు కాంగ్రెస్ పార్టీ మద్ధతు అందించిన అభ్యర్దుల ఓటమికి అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. పార్టీలో ఎప్పటికప్పుడు ఈ అంశాలపై చర్చ చేపట్టడమే కాకుండా పార్టీ వ్యతిరేకులపై సరైన చర్యలు చేపట్టడంలో జాప్యం, గ్రూప్‌ వార్‌ కారణంగా పలు చోట్ల దెబ్బ తిన్నారు. ఈ ఎన్నికల ఫలితాల నుంచి సరైన గుణపాఠం తీసుకోకుంటే రానున్న ఎంపీపీ, జడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి గట్టి చర్యలు లేకుంటే జిల్లా పరిషత్ లతో పాటు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్నప్పటికీ ఈ అంశాలను తీవ్రంగా పరిగణించకుంటే గ్రామస్థాయిలో పార్టీ పట్టుతప్పి భవిష్యత్తులో అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముందంటున్నారు. మొత్తంగా సీఎం వార్నింగ్ నేపథ్యంలోనైనా కాంగ్రెస్‌లో గ్రూపు నాయకుల్లో కనీస మార్పు వస్తుందా? అనే చర్చ సాగుతోంది.

ఇవి కూడా చదవండి :

Inavolu Mallikarjuna Swamy Jatara : ఐనవోలు జాతరలో పటిష్ట ఏర్పాట్లు
Pawan Kalyan : కాలుకు కాలు.. కీలుకు కీలు తీస్తా: వైసీపీకి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్