డ్రైపోర్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు!
హైదరాబాద్ సమీపంలో డ్రైపోర్ట్ నిర్మాణం.. తెలంగాణ పరిశ్రమలు, ఎగుమతులకు బలమైన ఊతం! వేలాది ఉద్యోగాలు, పెట్టుబడులు రాబోతున్నాయి.

విధాత, హైదరాబాద్ : ఓ దేశం..రాష్ట్రం అభివృద్ధి క్రమంలో రైలు మార్గాలు..రహదారులు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో..సీ పోర్టులు కూడా అంతకంటే కీలకంగా ఉపయోగపడుతాయి. అభివృద్ధి ముఖ ద్వారాలుగా పేర్కొనే జల రవాణా మార్గాలు తెలంగాణ రాష్ట్రానికి లేకపోవడం విదేశీ ఎగుమతుల..దిగుమతుల రంగం విస్తరణలో ప్రధాన అటంకంగా మారింది. తెలంగాణకు పోర్టు లేని సమస్యకు ప్రత్యామ్నాయంగా డ్రై పోర్టు నిర్మించాలన్న ప్రతిపాదనలు రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్ల నుంచి వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా డ్రైపోర్టు దిశగా ప్రయత్నాలు చేసినా వాటికి కార్యరూపం తేలేకపోయింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డ్రై పోర్టు నిర్మాణం కోసం పట్టుదలతో ముందుకెలుతుంది.
ఫోర్త్ సిటీలో డ్రైపోర్ట్ నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అక్కడి నుంచి బందరు పోర్ట్ కు గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్వే నెట్‌వర్క్ ద్వారా అనుసంధానం చేయాలని ప్రణాళిలు వేసింది. ఇప్పటికే డ్రైపోర్ట్ ఏర్పాటుకు అవసరమైన సన్నాహాలు..అనుమతుల ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం అతి త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సిద్దమవుతున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో డ్రైపోర్ట్ ఏర్పాటుతో పారిశ్రామిక ప్రగతిలో కీలక ముందడుగు పడుతుందని.. యువతకు వేలాది ఉద్యోగావకాశాలు, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ అభివృద్ధిలో డ్రైపోర్ట్ మరో మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.
ఇవి కూడా చదవండి…