విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వం బాంబు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కీలక మార్పు

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో కీలక మార్పు చేస్తూ బాధ్యతను విద్యార్థులపై మోపింది. 2026 నుంచి ఫీజు నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పినా, ముందుగా విద్యార్థులే కాలేజీలకు చెల్లించాల్సిన పరిస్థితి. ₹12,000 కోట్ల బకాయిల మధ్య ఈ నిర్ణయం పేద విద్యార్థులను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెడుతుందా?

Reported by: ADHARVA | తెలంగాణ‌ | Apr 30, 2026, 10:58 pm IST
Read Time: 8 mins
విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వం బాంబు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కీలక మార్పు విద్యార్థులపై ఫీజు బాంబ్.. తెలంగాణలో కొత్త నిర్ణయం తీవ్ర చర్చ

Telangana Fee Reimbursement Shock: Students to Pay Fees First from 2026

ప్రధాన అంశాలు

హైలైట్స్:

  • 🔴 2026-27 నుంచి ఫీజు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి
  • 🔴 విద్యార్థులే కాలేజీలకు ఫీజు చెల్లించాల్సిన కొత్త విధానం
  • 🔴 ₹12,000 కోట్ల బకాయిలతో కాలేజీల ఆర్థిక సంక్షోభం
  • 🔴 ఫీజు ఆలస్యం అయితే డ్రాప్‌అవుట్స్ పెరిగే ప్రమాదం
  • 🔴 Aadhaar, e-KYC, MeeSeva లింకింగ్ తప్పనిసరి
  • 🔴 విద్యార్థి సంఘాల తీవ్ర వ్యతిరేకత

 

విధాత కెరీర్​ డెస్క్​ | హైదరాబాద్​:

Fees Reimbursement | తెలంగాణలో ఉన్న లక్షలాది పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు కాలేజీలకు నేరుగా చెల్లిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని ఇకపై నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసి, వారు స్వయంగా కాలేజీలకు చెల్లించే విధానాన్ని 2026-27 విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మార్పు పరిపాలనా దృష్ట్యా పారదర్శకతను పెంచే ప్రయత్నంగా కనిపిస్తున్నప్పటికీ, ప్రాక్టికల్‌గా ఇది విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఫీజు ముందా? రీఇంబర్స్​మెంట్​ ముందా?

Telangana students walking on campus amid uncertainty over new fee reimbursement rules

కొత్త ఫీజు విధానంపై అనిశ్చితిలో ఉన్న విద్యార్థులు

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ డిగ్రీ, ప్రొఫెషనల్ కాలేజీలకు సుమారు ₹12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. గత నాలుగు విద్యాసంవత్సరాలుగా ఈ చెల్లింపులు నిలిచిపోవడంతో కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త విధానం అమల్లోకి వస్తే, కాలేజీలు విద్యార్థులపై ముందుగానే ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెచ్చే అవకాశముందని విద్యార్థి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ సమయంలో కాలేజీలు ఫీజు డిమాండ్ చేయవద్దని ప్రభుత్వం సూచించినప్పటికీ, డబ్బు ఎప్పుడు విద్యార్థుల ఖాతాల్లోకి జమ అవుతుందన్న విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం పరిస్థితిని మరింత అనిశ్చితిలోకి నెడుతోంది. కొత్త విధానం ప్రకారం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు మెయింటెనెన్స్ అలవెన్స్ మొత్తం కూడా విద్యార్థుల ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమ అవుతుంది. విద్యార్థులు ఆ మొత్తాన్ని స్వయంగా కాలేజీలకు చెల్లించాలి. అయితే, డబ్బు ఆలస్యంగా జమ అయితే పేద విద్యార్థులు ముందుగా ఫీజులు చెల్లించలేక చదువు మధ్యలోనే ఆపేయాల్సివచ్చే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా.

నిబంధనలు కఠినతరం – విద్యార్థులకు శరాఘాతం

Telangana government officials discussing new fee reimbursement policy in high-level meeting

ఫీజు రీయింబర్స్‌మెంట్ మార్పుపై ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం

ఈ నిర్ణయానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ప్రభుత్వం కారణంగా చూపుతోంది. పెండింగ్ బకాయిలపై కోర్టును ఆశ్రయించిన కాలేజీలకు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవచ్చని కోర్టు అనుమతించింది. అదే సమయంలో, కేసు తుదితీర్పులో కాలేజీలకు అనుకూలంగా లేకపోతే విద్యార్థులకు తిరిగి ఫీజు చెల్లించాలని కూడా సూచించింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను DBT ద్వారా పంపిణీ చేస్తుండటాన్ని రాష్ట్రం ఉదాహరణగా చూపుతోంది. ఇదిలా ఉండగా, కొత్త విధానంలో విద్యార్థులు  అనుసరించాల్సిన విధానాలు కూడా కఠినతరం అయ్యాయి. ఆధార్ ఆధారంగా e-KYC లేదా బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి చేశారు. బ్యాంక్ ఖాతా వివరాలు, IFSC కోడ్, ఖాతాదారుడి పేరు వంటి వివరాల పరిశీలన జరుగుతుంది. కులం, ఆదాయం, నివాస ధృవపత్రాలు మీ సేవా కేంద్రాల ద్వారా ఆధార్‌తో లింక్ చేయబడతాయి. ePASS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ అనంతరం కాలేజీలు విద్యార్థుల అర్హతను ధృవీకరించాలి. తదుపరి సంవత్సరాల్లో స్కాలర్‌షిప్ ఆటో-రిన్యువల్ కూడా విద్యార్థి అకడమిక్ ప్రోగ్రెస్, కాలేజీ నిర్ధారణ ఆధారంగా జరుగుతుంది.

బలహీనవర్గాల పిల్లల చదువు ఆగిపోనుందా?

ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని క్రమంగా ఎత్తేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇది పెద్ద దెబ్బ అవుతుందని, విద్యార్థులు చదువు మధ్యలోనే మానేసే పరిస్థితులు రావచ్చని హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి, పైకి పరిపాలనా మార్పుగా కనిపిస్తున్న ఈ నిర్ణయం, అమలు దశలో అనేక సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది. ముఖ్యంగా ఫీజుల చెల్లింపులో ఆలస్యం జరిగితే విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు, టైమ్​లైన్​ ప్రకటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.