Telangana | తడిసిన ధాన్యమంతా మద్దతు ధరకే కొంటాం.. కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే
ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లకే అప్పగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. రైతులు నష్టపోకుండా చివరి గింజ వరకూ కొనాలని సీఎం ఆదేశించారు

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియాకు ఆహ్వానం
సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్
కాళేశ్వరంపై ఎన్‌డీఎస్‌ఏ సూచన పాటిస్తాం
జూన్ 12 నాటికి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు
విధాత: ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లకే అప్పగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. రైతులు నష్టపోకుండా చివరి గింజ వరకూ కొనాలని సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గంలో ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లు, పాఠశాలల ఆధునీకరణపై చర్చించారు.
జూన్ 2 నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. అందుకే జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని, ఈ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలోమంత్రి వర్గ సమావేశం ముగిశాక కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబు, వెంకట్‌రెడ్డిలు మీడియాకు వెల్లడించారు.
గత పదేళ్లలో దేశంలో ఎక్కడా పౌర సరఫరాల శాఖ ద్వారా ఇంత వేగంగా ధాన్యం సేకరణ జరగలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇంత వేగంగా పండిన పంటను కొనుగోలు ప్రభుత్వం సేకరించిన సందర్భాలు లేవు. తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, రైతుల ప్రభుత్వమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం ధాన్యాన్ని సేకరించడమే కాకుండా రైతు ధాన్యం అమ్మిన 3 రోజుల్లోనే డబ్బులు పడ్డాయి.
అకాల వర్షాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిచోట్ల ధాన్యం తడిసిన మాట వాస్తవమేనని మంత్రి పొంగులేటి అన్నారు. మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రైతులు ఇబ్బందులు పడకూడదన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ధాన్యం తడిసిన రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు ఒక్క రూపాయి తగ్గకుండా కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు.
సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఈ సీజన్ నుంచే
అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి, హాస్టళ్ల చదువుకునే విద్యార్థులకు గాని, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చే పథకానికి సుమారుగా 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమన్నారు. ప్రజలకు, విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పాం. రాష్ట్రానికి అవసరమైన సన్న బియ్యమంతా రాష్ట్రంలోనే సేకరిస్తామన్నారు. అందుకే వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని పొంగులేటి చెప్పారు.
సన్న వడ్ల రకాలకు సంబంధించి వ్యవసాయ అధికారులు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తారని తెలిపారు. అలాగే నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలని నిర్ణయించామని, అందుకోసం రూ. 600 కోట్లు కేటాయిస్తామన్నారు. జూన్ 12 నాటికి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామమని పొంగులేటి తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ వేశామని చెప్పారు.
కాళేశ్వరంపై ఎన్‌డీఎస్‌ఏ సూచనలే పాటిస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేయాలని నిర్ణయించామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) మధ్యంతర నివేదికపై మంత్రివర్గం చర్చించిందన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేస్తే ఉంటుందనే గ్యారెంటీ లేదని, అందులో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదని కమిటీ ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందని మంత్రులు పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఏం చేప్తే అది చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాళేశ్వరం విషయంలో ఎన్‌డీఎస్‌ఏ సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. తాత్కాలికంగా ఏమైనా ఏర్పాటు చేసైనా రైతులకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నదన్నారు.
రైతులు ఆందోళన చెందవద్దు
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వ్యవసాయం, విద్య, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిస్థాయిలో పూరించాలని కేబినెట్‌లో ప్రధానంగా చర్చించామన్నారు. మా అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ పెట్టిన ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ లేనివిధంగా ధాన్యం సేకరణ, రైతులకు ఇబ్బంది కలుగకుండా ఒక్క గింజ కూడా తరుగు లేకుండా కొనుగోళ్లు చేస్తామన్నారు. అకాల వర్షాల వల్ల ఎక్కడైతే పంట దెబ్బతిన్నదో ఆ పంట నష్టాన్ని జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి పంపించారు.
సీఎం, వ్యవసాయ శాఖమంత్రి దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇస్తారని కాబట్టి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎక్కువగా సమయం వెచ్చించకుండా కొనుగోలు చేస్తున్నామన్నారు. దీంతో రైతులంతా సంతోషంగా ఉన్నారని మంత్రులు తెలిపారు. మిగిలిన ధాన్యం విషయంలోనూ జాప్యం లేకుండా మరింత వేగవంతంగా కొనుగోలు చేయాలని, తద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చేయాలని మా ప్రభుత్వ ఉద్దేశమన్నారు.