Telangana | SC వర్గీకరణ.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం

Telangana | SC వర్గీకరణ.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం

విధాత: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ(SC Categorisation) అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు వెల్లడించింది. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఎస్సీలకు ఇప్పటివరకు గంపగుత్తగా అమలైన రిజర్వేషన్లను ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి. మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది.

ఏ గ్రూప్‌లో 15 ఉప కులాలు ఉండగా.. వారికి 1 శాతం రిజర్వేషన్లు, బీ గ్రూప్‌లో ఉన్న 18 కులాలకు 9 శాతం, సీ గ్రూప్‌లో ఉన్న 26 కులాలకు 5 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నట్లు పేర్కొంది. ఇకపై గ్రూపులు, కులాల ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ గెజిట్‌ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో అందుబాటులో ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ నెల 8వ తేదీనే ఇందుకు సంబంధించిన బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. ఎస్సీ వర్గీకరణపై నేడు గెజిట్ నోటిషికేషన్ విడుదల చేశారు.

సుప్రీం కోర్టు తీర్పు అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ: మంత్రుల వెల్లడి

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవో విడుదల చేసి మొదటి కాపీని సీఎం రేవంత్‌రెడ్డికి అందించామన్నారు. ‘‘ఎస్సీ వర్గీకరణపై గతంలో అసెంబ్లీలో అన్ని పార్టీలు హామీ ఇచ్చాయని.. కానీ ఏ పార్టీ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లలేదన్నారు. మా ప్రభుత్వం ఏర్పడ్డాక వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు రావడంతో ఈ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు.

మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లామని.. కొన్ని వేల విజ్ఞప్తులు వచ్చాయని, వాటిని ఎంతో అధ్యయనం చేశాం’’ అని తెలిపారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమల్లోకి వచ్చిందని చెప్పారు. దళితుల్లో సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు ఉండకూడదన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అమలుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేసుకున్నామని..వచ్చిన విజ్ఞప్తులు అందుకుని అధ్యయనం చేశామని తెలిపారు.విద్య, ఉద్యోగాల్లో ఇకపై ఇచ్చే నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అమలవుతుందన్నారు. ఈ రోజు నుంచి భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని రాజనర్సింహ వెల్లడించారు.