సాదా బైనామాలపై జీవో
రాష్ట్రంలో సాదా బైనామా దరఖాస్తుల క్రమబద్దీకరణ కోసం తెలంగాణ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబర్ 106) బుధవారం జారీ చేసింది.

- దరఖాస్తులకు ఇక పరిష్కారాలు
- భూ హక్కుల బదలాయింపులు
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విధాత): రాష్ట్రంలో సాదా బైనామా దరఖాస్తుల క్రమబద్దీకరణ కోసం తెలంగాణ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబర్ 106) బుధవారం జారీ చేసింది. సాదా బైనామాలను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు వేదికలపై ప్రకటించిన విషయం తెలిసిందే. 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదెకరాల లోపు వ్యవసాయ భూముల సాదా బైనామాలను క్రమబద్ధీకరించేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించింది.
ఐదు ఎకరాల వరకు ఎలాంటి ఫీజులు లేకుండా, అంతకు మించి ఉన్న భూములకు ఫీజులు వసూలు చేయనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఆర్వోఆర్ 2020 చట్టంలో క్రమబద్ధీకరణ సెక్షన్లు లేకపోవడం న్యాయపరంగా వివాదానికి దారితీసింది. దీంతో 9,65,000 సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. దీని పై ఉన్న స్టే ను గత నెలలో హైకోర్టు స్టే ఎత్తి వేయడంతో దరఖాస్తుల పరిష్కారానికి మార్గం లభించింది. ఆర్వోఆర్ 2020 స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చింది.
ఈ చట్టం ప్రకారం క్రమబద్దీకరించేందుకు వీలుగా ఆర్డీఓలకు బాధ్యతలు అప్పగించారు. ఈ విషయాన్ని హైకోర్టుకు రెవెన్యూ శాఖ తెలియచేయడంతో మార్గం సుగమం అయ్యింది. తెలంగాణ భూ భారతి (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) యాక్ట్ 2025 ప్రకారం 2020 అక్టోబర్ 10 నుంచి 2020 నవంబర్ 10 వరకు అందిన సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి పట్టాదార్ పాస్ పుస్తకాలు అందచేయనున్నారు.